News

కైలాసనాథుని ధ్వజారోహణం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

126views

భక్తితో పూజించిన వెంటనే పరవశించిపోయే ఆదిదేవునికి రెండు కళ్లు సమర్పించి నిస్వార్ధ భక్తికి సంపూర్ణ నిర్వచనమయ్యాడు భక్తకన్నప్ప. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల అంకురార్పణగా.. భక్తకన్నప్ప నేతృత్వంలో కైలాసనాథస్వామికి నిర్వహించే ధ్వజారోహణ ఘట్టంతో ఉత్సవాలు ప్రారంభించడం శ్రీకాళహస్తి ప్రత్యేకం. అందుకే ఇక్కడి క్షేత్రం భూతల కైలాసంగా దినదిన ప్రవర్తమానం చెందుతోంది. అందుకే బ్రహ్మోత్సవాల్లో తొలి రోజున ఇక్కడి కైలాసనాథునికి భక్తకన్నప్ప నేతృత్వంలో ధ్వజారోహణం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.

కన్నులిచ్చి.. కన్నప్పగా..: ఎందరో శివభక్తులున్నా తిన్నడిది అగ్రస్థానం. ద్వాపర యుగంలో అర్జునుడే తరువాత జన్మలో బోయవానిగా జన్మించి తిన్నడయ్యాడు. దైవంపై నమ్మకం లేని తిన్నడు ఇక్కడి శివలింగాకృతికి ఆకర్షితుడై అపరభక్తుడయ్యాడు. అతని భక్తిని పరీక్షించేందుకు శివుడు శివలింగాకృతి నుంచి రక్తధారను రప్పించడం, అది చూసి భరించలేని తిన్నడు కన్నుకు కన్నే మందని తన కళ్లను తీసి శివునికి అర్పించి శివసాయిజ్యాన్ని పొందాడు. రెండు కళ్లను శివయ్యకు దానం ఇచ్చి భక్తకన్నప్పగా ఇక్కడి క్షేత్రంలో పూజలందుకుంటున్నాడు. ఇప్పటికి ఇక్కడి క్షేత్రంలో తొలి పూజ భక్తకన్నప్పకే. రోజూ సుప్రభాతం పూర్తయ్యాక గర్భాలయంలో కొలువుదీరిన భక్తకన్నప్పకు తొలి పూజ నిర్వహించి రోజువారి ఆర్జితసేవలు ప్రారంభిస్తుంటారు. అర్చకులు ఆటవికులు ధరించే విధంగా మోకాళ్ల వరకు వస్త్రధారణతో పూజలు నిర్వహించడం ఇక్కడి సంప్రదాయంగా వస్తోంది.