
కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు, ఈ సీజన్ నుంచి ఉపశమనం కలగనుంది. 13 ఏళ్ల క్రితం సంభవించిన వరదల్లో ధ్వంసమైన రాంబారా- గరుడచట్టి పాత కాలిబాట పునర్నిర్మాణం దాదాపు పూర్తయింది. త్వరలో అది తిరిగి అందుబాటులోకి రానుంది.
ప్రపంచ ప్రసిద్ధ కేదార్‌నాథ్ థామ్ యాత్రకు వెళ్లే భక్తులకు, ఈ సీజన్ నుంచి ఉపశమనం కలగనుంది. 2013 నాటి వినాశకరమైన విపత్తులో ధ్వంసమైన రాంబారా- గరుడచట్టి పాత కాలిబాట పునర్నిర్మాణం దాదాపు పూర్తయింది. 13 ఏళ్ల తర్వాత ఆ మార్గం తిరిగి అందుబాటులోకి రావడం యాత్రికులకు పెద్ద ఊరటనివ్వనుంది. దీంతో పాటు మార్గం మధ్యలో పర్యాటకుల భద్రత, సౌకర్యాల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పర్యాటకుల యాత్రా ప్రయాణం మరింత సులభంగా, సౌకర్యవంతంగా మారబోతోంది.
2013 విపత్తులో ధ్వంసం
2013 జూన్ 16-17 కేదార్‌నాథ్‌లో సంభవించిన వరదల్లో ఆ కాలిబాట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో యాత్రికులు ఇన్నాళ్లూ పరిమిత సౌకర్యాలున్న ప్రత్యామ్నాయ మార్గాల్లోనే ప్రయాణించాల్సి వచ్చింది. అయితే, ప్రస్తుతం గుప్తకాశీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఈ మార్గాన్ని దశలవారీగా పునర్నిర్మించి, తిరిగి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు బద్రీ కేదార్ ఆలయ కమిటీ సభ్యుడు వినీత్ పోస్టి మాట్లాడుతూ, “పునర్నిర్మాణంలో భాగంగా, మొదట కేదార్‌నాథ్ ధామ్ నుంచి గరుడచట్టి వరకు ఉన్న 3.3 కిలోమీటర్ల మార్గాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత, తీవ్రంగా దెబ్బతిన్న గరుడచట్టి నుంచి రాంబారా వరకు ఉన్న 5.3 కిలోమీటర్ల సెక్షన్‌ను కూడా పూర్తి చేశారు” అని ఆయన వివరించారు.

ఇకపై మరింత సురక్షితంగా
బాబా కేదార్‌నాథ్‌ను దర్శించుకోవడానికి వచ్చే యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వారి ప్రయాణం సులభంగా, సురక్షితంగా ఉండేలా పాత కేదార్‌నాథ్ మార్గంలో వివిధ ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిటీ సభ్యుడు వినీత్ పోస్టి తెలిపారు. ‘ఏర్పాట్లను పాత మార్గంలోనే నిరంతరం అమలు చేస్తున్నారు. దీనికోసం మార్గం వెంబడి తాగునీరు, రెయిన్ షెల్టర్లు (వర్షం నుంచి రక్షణ కల్పించే షెడ్లు), రైలింగ్‌లు వంటి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. దీంతో భక్తులు ప్రతికూల వాతావరణంలోనూ సౌకర్యవంతంగా ఉండేందుకు వీలవుతుంది’ అని ఆయన వివరించారు.
యాత్రికులకు రెండు మార్గాల్లో వెళ్లేందుకు అవకాశం
కేదార్ నాథ్ ఆలయాన్ని చేరుకునేందుకు, భక్తులకు ఈ సీజన్ నుంచి రెండు మార్గాలు అందుబాటులో ఉంటాయని కమిటీ సభ్యుడు వినీత్ తెలిపారు. ఒకటి పునర్నిర్మించిన గౌరీకుండ్-రాంబారా-గరుడచట్టి-కేదార్‌నాథ్ మార్గం కాగా, రెండోది ప్రస్తుతం అందుబాటులో ఉన్న గౌరీకుండ్-రాంబారా-లించౌలి-కేదార్‌నాథ్ రహదారి వెంట వెళ్లొచ్చని ఆయన వివరించారు. అయితే, రాంబారా నుంచి కేదార్‌నాథ్ దూరం గతంలో 7 కిలోమీటర్లు ఉండేదని, కొన్ని మార్పుల కారణంగా అది ఇప్పుడు 8.6 కిలోమీటర్లకు పెరిగిందని వినీత్ వెల్లడించారు. గుప్తకాశీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాజ్‌వింద్ సింగ్ ఈ రహదారికి సంబంధించిన విషయమై మాట్లాడుతూ, “ఈ ఏడాది జరగబోయే తీర్థయాత్రా సీజన్ నుంచి ఈ పాత కాలిబాట భక్తుల రాకపోకల కోసం తిరిగి తెరుచుకోనుంది. దీంతో భక్తుల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది” అని ఆయన తెలిపారు.
దేవాలయ పురాణ ప్రాముఖ్యం
హిందూ పురాణాల ప్రకారం, కేదార్‌నాథ్ ధామ్‌కు పాండవులతో లోతైన సంబంధం ఉంది. మహాభారత యుద్ధం తర్వాత తమ పాప పరిహారం కోసం పాండవులు ఇక్కడే శివుని కోసం తపస్సు చేశారని భక్తులు నమ్ముతారు. అయితే, ఎనిమిదో శతాబ్దంలో ఆది గురువు శంకరాచార్యులు ఈ కేదార్‌నాథ్ ఆలయాన్ని పునరుద్ధరించి, పునర్నిర్మించారని, తద్వారా ఈ పుణ్యక్షేత్రానికి మతపరమైన, చారిత్రక ప్రాముఖ్యతను ఆయన మరింత పెంచారని విశ్వసిస్తారు.
కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకునేది ఆరోజే
బద్రీనాథ్ ధామ్ ద్వారాలు ఏప్రిల్ 23న తెరుచుకుంటాయని ఇప్పటికే ప్రకటించారు. అయితే, కేదార్‌నాథ్ ధామ్ ద్వారాలు తెరిచే తేదీని మహాశివరాత్రి పర్వదినాన ప్రకటిస్తారు. కాగా, ప్రస్తుతం కేదార్‌నాథ్ ఆలయ ప్రాంతమంతా మంచుతో నిండి ఉంది.





