ArticlesNews

ఆ గ్రామంలో రోజూ ‘జాతీయ గీతాలాపన’

74views

సాధారణంగా స్కూళ్లలో రోజూ జాతీయ గీతాలాపన చేయడం మనం చూస్తుంటాం. కానీ ఓ గ్రామ పంచాయతీలో రోజూ జాతీయ గీతాలపాన చేస్తూ దేశం పట్ల వారికున్న మమకారాన్ని చాటుతున్నారు ఆ ప్రాంత వాసులు. గీతాలాపాన మొదలవ్వగానే ఊర్లో ఎక్కడి వారక్కడ ఆగిపోయి గీతాన్ని ఆలపిస్తున్నారు. అంతేకాదు, గీతాలపానతోపాటు ఇంకో ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టారు ఆ ప్రాంత వాసులు. మొబైల్​ ఫోన్లు పిల్లలు బానిసలు కాకుండా ఫైన్​లు విధించడం, అలాగే వరకట్న వేధింపులు గురికాకుండా నివారణ చర్యలు తీసుకోవడం వంటివి చేస్తున్నారు. మరి ఆ ఊరి విశేషాలేంటో? ఆ సమస్యలకు వారు తీసుకున్న చొరవ ఏ విధమైనదో తెలుసుకుందాం.

మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లా, నెవాసా తాలూకాలో సౌందాల గ్రామంలో సమాజానికి ఉపయోగపడే ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. అందులో భాగంగా రోజూ గ్రామ పంచాయతీ పరిధిలో ఉదయం 10 గంటలకు జాతీయ గీతాలాపన చేస్తున్నారు. ఆ సమయంలో గ్రామ ప్రజలంతా ఎక్కడివారు అక్కడే ఆగిపోయి జాతీయ గీతాన్ని పాడుతున్నారు. ప్రతి ఒక్కరిలో దేశ భక్తిని పెంపొందించాలని, మనమంతా భారతమాత బిడ్డలమన్న భావన ప్రతి ఒక్కరిలో కలగాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ సర్పంచ్​ శరద్​ అర్గాడే పేర్కొన్నారు. ‘దేశమే ప్రథమం’ అనే భావనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు.

National Anthem Played Every Day In Saundala

“మనమంతా వివిధ రకాల కులాలకు చెందినవాళ్లమని కాకుండా, అంతా భారత మాత బిడ్డలమనే భావన గ్రామస్థుల మనస్సుల్లో లోతుగా నాటుకుపోవాలి. ఈ లక్ష్యంతో ఈ రోజు నుంచి ఉదయం 10 గంటలకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జాతీయ గీతాన్ని ఆలపిస్తాం. ఈ చొరవ గ్రామంలోని ప్రతి ఒక్కరిలో దేశభక్తిని నింపుతుంది. అంతేకాదు, ఇలా రోజూ జాతీయ గీతాలాపన ఆలపించడం వల్ల చిన్నపిల్లల్లో కూడా దేశభక్తి విలువలు పెరుగుతాయి. ఈ నిర్ణయం దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది” అని గ్రామ సర్పంచ్​ పేర్కొన్నారు.

ఎక్కడి వారు అక్కడే ఆగి!
రోజూ జాతీయ గీతాలాపన చేయడం వల్ల గ్రామంలో కులతత్వం అంతం అవుతుందని, పౌరులందరి మధ్య ఐక్యత బలోపేతం అవుతుందని గ్రామ పంచాయతీ సభ్యులు పేర్కొన్నారు. అదే విధంగా, దేశంపట్ల సామాజిక స్పృహ ప్రతిఒక్కరిలో బలోపేతం అవుతాయని వారు భావిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన లౌడ్‌స్పీకర్లలో సరిగ్గా ఉదయం 10 గంటలకు జాతీయ గీతం ప్లే అవుతుందని చెబుతున్నారు. ఆ సమయంలో పొలాల్లో పనిచేస్తున్న రైతులు, రోడ్లపై వెళ్తున్న పౌరులు తాము ఉన్న చోటే ఆగి జాతీయ గీతానికి గౌరవం తెలుపుతున్నారు. ‘దేశమే ప్రథమం’ అనే భావన ఆధారంగా గ్రామ పంచాయతీ తీసుకున్న ఈ నిర్ణయానికి విస్తృత ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు కూడా అమలు చేయాలని సర్పంచ్ శరద్ అర్గాడే విజ్ఞప్తి చేశారు.

గీతాలాపన చేస్తున్న బైకర్​

దీంతో పాటు ఇంకా ఎన్నో మంచి పనులను అవలంభిస్తున్నారు సౌందాల గ్రామ ప్రజలు. సాయంత్రం 7 గంటల తర్వాత విద్యార్థులకు మొబైల్ ఫోన్లు ఇవ్వడాన్ని నిషేధించారు. ఈ విషయంలో (రాష్ట్రంలోనే) ప్రత్యేక చొరవ తీసుకున్న మొదటి గ్రామంగా సౌందాల గ్రామ పంచాయతీ నిలవడం విశేషం. ఒకవేళ ఎవరి చేతిలోనైనా మొబైల్ ఫోన్ కనబడితే రూ.500 జరిమానా విధించాలని తీర్మానం చేశారు. ఇలా చాలా మంది నుంచి జరిమానాలు వసూలు చేశారు. అదేవిధంగా, గ్రామాన్ని బాల కార్మిక రహితంగా మార్చాలని కూడా విజ్ఞప్తి చేశారు. బాల కార్మికుల గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.1000 బహుమతిగా అందిస్తున్నారు.

అయితే, గత సంవత్సరం, భారీ వర్షాల కారణంగా రైతుల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, అప్పుల భారం, తగినంత సహాయం అందకపోవడం రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని పంచాయతీ సభ్యులు తెలిపారు. అయితే, అలాంటి పరిస్థితుల్లో రైతులపై విద్యా ఖర్చుల భారాన్ని తగ్గించడానికి సౌందాల గ్రామ పంచాయతీ ఈ చొరవ తీసుకుందని గ్రామస్థులు చెబుతున్నారు.

సమాచారం ఇచ్చిన వారికి రూ.5000 బహుమతి!
వీటితో పాటు గ్రామ పంచాయతీ మరో ప్రత్యేక చొరవ కూడా తీసుకుంది. అదేంటంటే, గ్రామంలో కట్నం డిమాండ్ చేసే వారిపై కఠిన నియమ నిబంధనలను పాటిస్తున్నారు. ఎవరైనా కట్నం అడిగినట్లు తమ దృష్టికి తీసుకువస్తే రూ.5000 బహుమతిగా ఇస్తామని పంచాయతీ సభ్యులు ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం గృహ హింసను కూడా నివారిస్తుందని సర్పంచ్ శరద్ అర్గాడే అభిప్రాయపడ్డారు.