
ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు గ్రామీ అవార్డు దక్కింది. ‘మెడిటేషన్స్: ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ హోలీనెస్ ద దలైలామా’ పేరుతో ఆయన చేసిన ప్రసంగ ఆల్బమ్‌కు ఈ గౌరవం దక్కింది. 90 ఏళ్ల టిబెట్ ఆధ్యాత్మిక గురువు అయిన దలైలామాకు గోల్డెన్ గ్రామోఫోన్ దక్కడం ఇదే తొలిసారి. ఆదివారం రాత్రి లాస్ ఏంజెలెస్‌లోని క్రిప్టోడాట్‌కామ్ ఎరీనాలో జరిగిన కార్యక్రమంలో మొత్తం 90 కేటగిరీలో అవార్డులను ప్రకటించారు. దలైలామాకు అవార్డు దక్కడంతో హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలతోపాటు ఇతర ప్రాంతాల్లో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. దలైలామా తరఫున గాయకుడు రఫూస్ వెయిన్‌రైట్ అవార్డును స్వీకరించారు. ‘ఆడియో బుక్స్, నరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్’ కేటగిరీలో ఈ అవార్డు దక్కింది. గాయకులు మ్యాగీ రోజర్స్, ఆండ్రా డేతో కలిసి దలైలామా ఈ ఆల్బమ్ రూపకల్పనలో పాలుపంచుకున్నారు. కబీర్ సెహగల్ నిర్మించిన ఈ ఆల్బమ్‌లో సరోద్ విద్వాంసుడు అంజాద్ అలీ ఖాన్, ఆయన కుమారులు అమాన్ అలీ బంగాష్, అయాన్ అలీ బంగాష్, అమెరికా శాక్సాఫోన్ విద్వాంసుడు టెడ్ నాష్, గాయకుడు, గేయ రచయిత డెబీ నోవా తదితరులు కనిపించారు.





