News

అమెరికా చేతిలో మరో అల్ ఖైదా నేత హతం

618views

మెరికా మరో కీలక ఉగ్రవాద నేతను హతమార్చింది. అరేబియా ద్వీపకల్ప ప్రాంతాన్ని అడ్డాగా చేసుకున్న అల్‌ఖైదా నాయకుడు ఖాసీం అల్‌-రిమిని హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అమెరికాలో నావికా స్థావరంపై జరిగిన కాల్పులకు తామే కారణమని అంగీకరించిన కొన్ని రోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.”యెమెన్‌లో ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా జరిగిన కాల్పుల్లో అరేబియన్‌ పెనిన్సులాలో అల్‌ఖైదా(ఏక్యూఏపీ) వ్యవస్థాపకుడు ఖాసీం అల్‌-రమిని హతమార్చాం. రమి నేతృత్వంలో సామాన్య పౌరులపై ఏక్యూఏపీ వికృత హింసాకాండకు పాల్పడ్డది. అతడి మృతితో అల్‌ఖైదా కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతుందని భావిస్తున్నాం” అని శ్వేతసౌధం విడుదల చేసిన ప్రకటనలో ట్రంప్‌ వెల్లడించారు. అయితే అతణ్ని ఎప్పుడు మట్టుబెట్టింది మాత్రం తెలపలేదు.

డిసెంబరు 6న ఫ్లోరిడాలోని అమెరికా నావికాదళానికి చెందిన పెన్సకోలా వైమానిక స్థావరంలో భారీ ఎత్తున ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సౌదీ అరేబియాకు చెందిన ఓ సైనికాధికారి మృతిచెందడంతో పాటు ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే, దాడికి పాల్పడ్డ ముష్కరుణ్ని అమెరికా వెంటనే మట్టుబెట్టింది. మరోవైపు ఈ దాడికి బాధ్యతవహిస్తూ ఏక్యూఏపీ గత ఆదివారం ప్రకటన విడుదల చేసింది. మహ్మద్‌ అల్‌షమ్రానీగా గుర్తించిన అతడు దాడికి ముందు అమెరికాపై తన విద్వేషాన్ని వ్యక్తపరుస్తూ ఓ వీడియో విడుదల చేసినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఓ వర్గంపై జరుగుతున్న హింసకు అమెరికా అండగా ఉంటోందని.. అందుకే తాను ఆ దేశాన్ని ద్వేషిస్తున్నానని అతడు పేర్కొన్నట్లు అంతర్జాతీయ పత్రికలు వెల్లడించాయి. ఈ దాడికి ప్రతీకారంగా అమెరికా తాజాగా జరిపిన దాడుల్లో ఖాసీం అల్‌-రైమీ హతమయ్యాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.