ArticlesNews

హథీరాంజీ మఠం విషయంలో దాగున్న రహస్యమేంటి? – ప్రశ్నిస్తున్న మఠాధిపతులు, వివిధ సంస్థల ప్రతినిధులు

1.8kviews

దారు వందల ఏండ్ల చరిత్ర కలిగిన హథీరామ్ జీ మఠం విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు మరింత పారదర్శకంగా ఉండి ఉంటే బాగుండేదని హిందూ దేవాలయ ప్రతిష్ఠాన పీఠాధిపతి శ్రీ కమలానంద భారతీ స్వామి అభిప్రాయపడ్డారు.

తిరుపతిలోని హథీరాంజీ మఠం కష్టోడియన్ అర్జున్ దాస్ ను ప్రభుత్వం నిర్బంధించి, కాళహస్తి ఈవో చంద్ర శేఖర్ రెడ్డికి మఠం బాధ్యతలు అప్పగించిన విషయం పాఠకులకు తెలిసిందే. మఠం విషయంలో జరిగిన, జరుగుతున్న పరిణామాలపై వివిధ మఠాధిపతులు, హిందూ సంఘాలు, వివిధ సంస్థల, రాజకీయ పక్షాల కార్యకర్తలు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీ కమలానంద భారతీ స్వామిని మా VSK ప్రతినిధి ఫోనులో సంప్రదించినప్పుడు వారు పలు అభిప్రాయాలను మాతో పంచుకున్నారు.   

హథీరామ్ జీ మఠాన్ని స్థాపించిన  హథీరామ్ బావాజీ ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ లో జన్మించిన వాడైనా తిరుమలలో తపస్సు చేసి సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామితో సహచరించిన వాడని స్వామీజీ తెలిపారు. అంతేకాక  బంజారాలు, లంబాడాలు మరియు గిరిజన జాతులకు ఆశ్రయమిచ్చిన చరిత్ర హథీరామ్ జీ మఠానిదని స్వామీజీ పేర్కొన్నారు.

1933లో బ్రిటిష్ వారు హథీరామ్ జీ మఠాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారని, అప్పటివరకూ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిర్వహణను హథీరామ్ జీ మఠమే చూసిందని ఆయన తెలిపారు.

ఇంతటి చరిత్ర, కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు, ఆభరణాలు కలిగిన మఠానికి చెందిన అధిపతిని ఏ కారణం చేత అరెస్టు చేశారో, హడావుడిగా శ్రీకాళహస్తి ఈవోని ఇన్చార్జిగా ఎందుకు నియమించారో, అధికారులు కూడా అంతే హడావుడిగా మఠంలోని గదులన్నీ ఎందుకు సీజ్ చేశారో హిందూ సమాజానికి ప్రభుత్వం వివరించవలసిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.

అలాగే ప్రభుత్వం అర్జున్ దాస్ పై విధించిన సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేసి ఆయన వాదనను ప్రజలకు వినిపించే అవకాశం ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఒకవేళ అర్జున్ దాస్ తీవ్రమైన మోసాలకు, నేరాలకు పాల్పడి ఉంటే అది కూడా సమాజానికి వివరించ వచ్చు కదా? అని ఆయన ప్రశ్నించారు.

అంతేకాక ఎంతో విలువైన వస్తువులు, ఆభరణాలు కలిగిన మఠానికి గట్టి భద్రతను కూడా ప్రభుత్వం కల్పించవలసిన అవసరం ఉన్నదని ఆయన తెలిపారు.

అలాగే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, చత్తీస్ గఢ్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్ అలా దేశమంతా విలువైన భూములు, విలువైన, పురాతనమైన ఆభరణాలు, వస్తువులు కలిగిన హథీరామ్ జీ మఠం యొక్క ఆస్తుల మదింపు జరగాలని, ఇందు కోసం అవసరమైతే ఒక నిపుణుల కమిటీని నియమించాలని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వీకరిస్తే తప్పేమీ లేదని స్వామీజీ అభిప్రాయపడ్డారు.

ఈ విషయాలలో అంత రహస్యంగా వ్యవహరించవలసిన అవసరం ఎందుకు వచ్చిందని స్వామీజీ ప్రశ్నించారు?

ఈ విషయమై మఠాధిపతులు, పీఠాధిపతులు, హిందూ సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యమానికి పూనుకోకముందే ప్రభుత్వం కళ్ళు తెరచి నిజానిజాలను ప్రజలకు వెల్లడించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

అలాగే కాంగ్రెస్ నేత, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, ఐఎన్టియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ నవీన్ కుమార్ రెడ్డి కూడా పలు సందేహాలను వ్యక్తం చెయ్యడం తోపాటు, పలు సూచనలు, డిమాండ్లను కూడా ప్రభుత్వం ముందుంచారు.

శ్రీ నవీన్ కుమార్ రెడ్డి (ఫైల్ ఫోటో)

“తిరుమల శ్రీవారి నగలకు సంబంధించి తిరుమలలో 1952 నుంచి తిరువాభరణం (శ్రీవారి నగల వివరాలు) రిజిస్టర్ అమలులోకి వచ్చింది, అలాగే తిరుమల శ్రీవారి ఆలయాన్ని 1933 టిటిడి ఏర్పడక ముందు నుంచి సుమారు 80 సంవత్సరాల పాటు హథీరాంజీ మహంతుల ఆధీనంలో ఉన్న సమయంలో శ్రీకృష్ణ దేవరాయల కాలంనాటి నగలు ఏమైనాయి?? అసలు ఉన్నాయా లేవా??” అని ఆయన ప్రశ్నించారు.

“టీటీడీ స్పెషల్ ఆఫీసర్ “ధర్మారెడ్డి” ఇటీవల శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి నగలు తమ వద్ద లేవని స్పష్టం చేశారు మరి గతంలో తిరుమల ఆలయ ప్రధాన అర్చకులుగా పనిచేసిన “రమణ దీక్షతులు” శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి “పింక్ డైమండ్” మాయమైందని చెప్పడం పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇంతకీ తిరుమల శ్రీవారికి “పింక్ డైమండ్” ఉన్నట్లా?లేనట్లా? ఉంటే ఏమైపోయినట్లు??” అంటూ శ్రీ నవీన్ ప్రశ్నిస్తున్నారు.

అలాగే శ్రీ కృష్ణదేవ రాయలు శ్రీవారికి సమర్పించినట్లు తిరుమల శ్రీవారి ఆలయ ప్రాకారంలోని శాసనాలలో స్పష్టంగా ఉన్నట్లు  ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తమ రికార్డులలో స్పష్టం చేసిందని, శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి నగల లెక్కలు తేలాలంటే  హథీరాంజీ మఠం అధికారులతోపాటు,టీటీడీ ఉన్నతాధికారులకు “నార్కో అనాలసిస్” పరీక్షలు చేయాలని శ్రీ నవీన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

హథీరాంజీ మఠం “బ్యాంకు లాకర్లను” జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో తెరిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, హథీరాంజీ మఠం ఆస్తుల లెక్క తేలాలంటే కేంద్ర ప్రభుత్వం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో “సీబీఐ” విచారణకు ఆదేశించాలని కూడా శ్రీ నవీన్ డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.