
ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో నిర్వహించిన డిఫెన్స్ ఎక్స్‌పో దేశ రక్షణ శాఖ సత్తాను చాటింది. భారత ఆయుధ సంపత్తి వీక్షకులను అబ్బురపరచింది. యుద్ధ వాతావరణంలో ఆయుధాల పనితీరును చాటి చెప్పేలా సాగిన ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. దూసుకొచ్చిన యుద్ధ ట్యాంకర్లు, ఆకాశంలోకి రివ్వున ఎగిరే హెలికాప్టర్లు, శత్రువులను వెంటాడే అత్యాధునిక ఫైటర్ జెట్లు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణ. భారతదేశ రక్షణ రంగ సత్తాను చాటేలా లఖ్‌నవూలో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్‌పో సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ ప్రదర్శనను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో దేశ సామర్థ్యాన్ని చూపే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఎక్స్‌పోలో త్రివిధ దళాలు చేసిన విన్యాసాలు వీక్షకులను ఆశ్చర్యచకితులను చేశాయి. సైనికుల ధైర్య సాహసాలు అబ్బురపరిచేలా చేశాయి. విపత్కర పరిస్థితుల్లో బాధితులను రక్షించేందుకు గగనతలం నుంచి కిందికి దిగుతూ సైనికులు చేసిన విన్యాసాలు రెప్పవాల్చకుండా చూసేలా చేశాయి. యుద్ధ వాతావరణంలో అధునాతన ఆయుధాలు ధరించి త్రివిధ దళాలు చేసిన పోరాటాలు ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శన అయిదు రోజుల పాటు జరుగనుంది.







