
భారత సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త శ్రీనివాస్ కులకర్ణికి బ్రిటిష్ రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ (ఆర్‌ఏఎస్) స్వర్ణ పతకాన్ని ప్రదానం చేసింది. ఆర్‌ఏఎస్ 1824 నుంచి ఏటా బహూకరిస్తున్న స్వర్ణ పతకాలను పొందినవారిలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ఎడ్విన్ హబుల్, స్టీఫెన్ హాకింగ్ వంటి జగద్విఖ్యాత శాస్త్రవేత్తలు ఉన్నారు. ఆ కోవలోకి చేరిన కులకర్ణి మహారాష్ట్రలో జన్మించారు. ఐఐటీ-దిల్లీలో చదువుకున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా-బెర్కిలీ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశారు. 40 ఏళ్ల నుంచి కాల్టెక్ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా, పరిశోధకుడిగా ఉన్నారు. విద్యార్థి దశలోనే కులకర్ణి ప్రపంచంలో మొట్టమొదటిసారి మిల్లీసెకండ్ పల్సార్‌ను కనుగొన్నారు. మన గెలాక్సీకి వెలుపల నుంచి వస్తున్న గామా కిరణ విస్పోటనాలతో సహా పలు ఖగోళ విశేషాలను కనిపెట్టి, 2024లో ఖగోళ శాస్త్రంలో షా బహుమతి పొందారు. విశ్వ రహస్యాలను ఛేదించడానికి తోడ్పడే 10 పరికరాలను కూడా రూపొందించారు. నాసా తరఫున 2030లో అతినీలలోహిత కిరణ అన్వేషణ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రస్తుతం కృషిచేస్తున్నారు.





