News

సామాజిక సమరసతను మరింత బలోపేతం చేయాలి : హోసబళే

121views
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే రాంచీలో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ సామాజిక సంస్థలు, కులాలు, వర్గాలకు సంబంధించి దాదాపు 600 మంది ప్రతినిధులతో సామాజిక సమరసత సమావేశం నిర్వహించారు. సమాజంలో ప్రబలంగా వున్న సమకాలీన అంశాలపై ఇందులో లోతుగా చర్చించారు. అలాగే సమాజంలో సామాజిక సమరసతను మరింత బలోపేతం చేయడానికి అందరూ ప్రయత్నాలు చేయాలని హోసబళే సూచించారు.
ఈ సందర్భంగా ప్రతినిధులు తమ తమ ప్రాంతాలలో జరుగుతున్న సామాజిక, సాంస్కృతిక, సేవా కార్యాల గురించి హోసబళేకి వివరించారు. అలాగే తమ తమ ప్రాంతాల్లో ఎదురవుతున్న సామాజిక సవాళ్లను కూడా ఆయన ముందు వుంచారు. వీటితో పాటు మత మార్పిళ్లు, అక్రమ చొరబాట్లు, మాదక ద్రవ్యాల వ్యసనం, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు, లవ్ జిహాద్ వంటి తీవ్రమైన సమస్యలపై కూడా చర్చించారు.
ఈ సందర్భంగా దత్తాత్రేయ హోసబళే మాట్లాడుతూ పేదరికం, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలే మత మార్పిళ్లకు ప్రధాన కారణమని అన్నారు. వనవాసీ క్షేత్రాల్లో మత మార్పిళ్లు, డీజే సంస్కృతి, మద్యపానం వంటి సమస్యలపై కూడా ప్రస్తావించారు. మతమార్పిడి సమస్యను పరిష్కరించడానికి సమాజంలో పరస్పర సహకారం వుండాలని నొక్కి చెప్పారు. అంటరానితనం, కులవివక్ష నుంచి విముక్తం కావాలని, ఆధిక్యత, నీచత్వం అనే భావాలను విడిచిపెట్టాలని సూచించారు. హిందూ జనాభాను బలోపేతం చేయాల్సిన అవసరం వుందని నొక్కి చెప్పారు.
dattaji2
ఈ సందర్భంగా హోసబళే ఘర్ వాపసీ గురించి కూడా చర్చించారు. మత పరంగా అందరిలో అవగాహన తేవడం అనేది సమాజం పని అని, దానిని సమాజమే స్వయంగా చేయాలని సూచించారు. అలాగే కులం గురించి కూడా ప్రస్తావిస్తూ.. మన పుట్టుక మన చేతిలో లేదని, ఏ కులంలో పుడతామన్నది మన చేతుల్తో లేదని, అలాంటప్పుడు కుల పరంగా ఇతరులను ఇబ్బంది పెట్టడం ఎందుకున్నారు.
స్త్రీలను సోదరీమణులుగా గౌరవించాల్సిన బాధ్యత సమాజంపై వుందని నొక్కి చెప్పారు. లింగ సమానత్వం అనేది ఇప్పుడు అత్యావశ్యకమని, పురుషులు, మహిళలు కలిసి పనిచేసినప్పుడు అసమానత పోతుందని తెలిపారు.
సోషల్ మీడియాపై కూడా మాట్లాడుతూ.. సోషల్ మీడియా సానుకూల, ప్రతికూల విషయాలతో నిండి వుంటుందని, పిల్లలపై కేవలం సానుకూల విషయాల ప్రభావమే వుండాలన్నారు. ప్రతికూల ప్రభావాల నుంచి వారిని రక్షించడానికి భారతీయ సంస్కృతితో వారిని అనుసంధానించాలని సూచించారు. అలాగే పిల్లలో నిరంతరం సంభాషణ అవసరమన్నారు. అలాగే దేవాలయాలను సందర్శించడం ద్వారా అహంకారాన్ని తొలగిపోతుందని, ప్రశాంతత లభిస్తుందని, అందుకే పిల్లలను అటువైపు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
dattaji23
చివరగా బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీని ద్వారా రాజకీయంగా ప్రయోజనం చేకూరుతోందన్నారు. బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి అత్యంత దారుణంగా వుందని, ఇదేమీ రహస్యం కాదని, యావత్ ప్రపంచానికి తెలుసన్నారు. సరిహద్దుల్లో కంచె వేయడం ఒక పెద్ద సవాలు అని, కొన్నిసార్లు మన సొంత ప్రజలే చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తారని ఆయన అన్నారు. ప్రభుత్వం SIR తో సహా వివిధ మార్గాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోందని హోసబళే అన్నారు.