News

స్వామి వివేకానంద బోధనలు యువతకు ఆదర్శం

226views

స్వామి వివేకానంద బోధనలను యువత రోల్ మోడల్‌గా తీసుకుని, తమ నైపుణ్యాలను, వ్యక్తిత్వాన్ని పెంపెందించుకోవాలని రామకృష్ణ మఠం సహాయ కార్యదర్శి స్వామి స్థితి కంఠానంద పిలుపునిచ్చారు.

స్వామి వివేకానంద 163 వ జయంతిని పురస్కిరించుకొని యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ స్థానిక తుమ్మలపల్లి కళా క్షేత్రంలో జాతీయ యువజనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ యువజనోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన రామకృష్ణ మఠం సహాయ కార్యదర్శి స్వామి స్థితి కంఠానంద మాట్లాడుతూ.. వివేకానందుని బోధనలను యువత ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. వివేకానందుడు 33 సంవత్సాలు జీవించి 150 సంవత్సరాల చరిత్రను ప్రపంచానికి అందించారన్నారు. నేటి యువత మెడిటేషన్ ను అలవాటుగా చేసుకుని సంకల్ప బలాన్ని పెంపెందించుకోవాలన్నారు. నేటి ఇంటర్నెట్ యుగంలో నైపుణ్యాలను పెంచుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. యువత తమ విలువైన సమయాన్ని వినోదానికి కాకుండా, కొత్త విషయాలు నేర్చుకోవడానికి కేటాయించాలన్నారు.

జీవితంలో అతిపెద్ద సవాలు తమ మనస్సును నియంత్రించుకోవడమేనని, మనస్సు అదుపులో ఉంటేనే ఏకాగ్రత పెరుగుతుందని తద్వారా సానుకూల ఆలోచనలు వస్తాయన్నారు. స్వామి వివేకానంద జీవితం, ఆయన చికాగో ప్రసంగం, ఆయన బోధనలు యువతకు గొప్ప స్ఫూర్తినిస్తాయన్నారు. ఆయన రచించిన పుస్తకాలను విద్యార్ధులు చదవడం వల్ల మానసిక స్థైర్యం పెరుగుతుందన్నారు. కాశీలో కోతుల గుంపు వివేకానందుడిని వెంటాడినప్పుడు ఆయన పారిపోకుండా వాటిని ఎదుర్కొన్న సంఘటనను స్వామీజీ ఉదహరించారు. మన జీవితంలోని కష్టాలు కూడా కోతుల వంటివేనని, వాటిని చూసి పారిపోతే అవి మనల్ని ఇంకా భయపెడతాయని కానీ ధైర్యంగా ఎదుర్కొంటే అవి తొలగిపోతాయన్నారు. మన దేశ ఆధ్యాత్మికతను విదేశాలైన కొరియా, జపాన్ లాంటి దేశాలు నేటికీ విరివిగా ఆచరిస్తున్నాయన్నారు. ధృడమైన సంకల్ప శక్తితో ముందుకెళితే యువతకు విజయం సాధ్యపడుతుందని స్వామి స్థితి కంఠానంద తెలియజేశారు.