ArticlesNews

ఈ భోగిమంటలలో..

56views

ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు, ఆచార సంప్రదాయాలు, మర్యాద మన్ననలు, ఆహారవు అలవాట్లు లాంటి వాటి మేలికలయిక సంస్కృతి. అది ప్రజల జీవనసారం. సంస్కృతి, సాహిత్యాలు జాతికి జీవనాధారాలు. సంస్కృతికి జీవం సామాజిక జీవనం. మరి… అవన్నీ సక్రమరీతిలో ఉన్నాయా? అని ప్రశ్నించుకుంటే… అన్ని రంగాలు కాలుష్యంతో కునారిల్లుతున్నాయనేందుకు వర్తమాన పరిస్థితులే నిదర్శనం. మర్యాదలు, మన్ననలు మంటగలసిపోతున్నాయి. విధాన నిర్ణయాలను అమలు చేయవలసిన ప్రజాప్రతినిధులు చట్టసభలు, బహిరంగ వేదికలపైనే పరస్పరం దూషించుకుంటున్న విచిత్ర సన్నివేశం. రాజ్యాంగపదవుల గౌరవాన్ని మరచి, వాటిని అధిష్ఠించిన వారిని ఏకవచనంతో సంబోధిస్తూ, అశ్లీల పదాలను నిస్సిగ్గుగా, యథేచ్ఛగా వాడేస్తున్నారు. అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుతోంది.

సాంకేతికత, సమాచార విప్లవంతో సమాంతరంగా సాంస్కృతిక విధ్వంసమూ కొనసాగుతోంది. సాంకేతిక ప్రగతిని కాదనే వారు ఉండరు. కానీ హద్దుమీరితేనే తంటా. స్మార్ట్‌ ఫోన్‌ల వాడకం అధికమవుతున్న కొద్ది విశృంఖలత్వం శ్రుతి మించి యువతపైన, సంస్కృతిపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా మంది యూట్యూబర్లు కట్టుతప్పుతున్నారు. నచ్చని వారిపై కొందరు చేసే జుగుప్సాకర వ్యాఖ్యాలను యథాతథంగా ప్రసారం చేస్తున్నారు. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ…’ అన్న శ్రీరామచంద్రుని హితోక్తి స్ఫూర్తితో…‘ఏ దేశమేగినా ఎందుకాలిడిన… ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైన… పొగడరా నీ తల్లి భూమి భారతిని…’ అన్నారు మాన్యులు రాయప్రోలు వారు. ఆ జాతీయతా స్ఫూర్తి గీతాన్ని అనుసరించేందుకు ఎందరో జాతీయనేతలు యత్నించారు, యత్నిస్తున్నారు. అదే సమయంలో… కొందరు విదేశీగడ్డపైనే స్వదేశం గురించి చిన్నతనంగా మాట్లాడడం బాధాకరం.

సాంస్కృతిక విస్మృతి/కాలుష్యం పెచ్చరిల్లుతోంది. ఒక పరమార్థంతో ఏర్పడిన పండుగల నిర్వహణలో ఆర్భాటాలకే చోటెక్కువ. ఉదాహరణకు, వినాయక చవితి అంటే పందిళ్లలో అసభ్యనృత్యాలు… శబ్దకాలుష్యం. సంక్రాంతి అంటే కోడిపందాలు అనే భావన కుదురుకుంటోంది. జనంలో భక్తి భావం పెరుగుతున్నట్టు అనిపిస్తున్నా, మరోవంక సాంస్కృతిక, ఆధ్యాత్మికత,సనాతన ధర్మం హననయత్నాలు ముమ్మరమవు తున్నాయి. పురాణ పురుషులను, కించ పరచడం, ఇతిహాసాలు, ప్రవచనకారులపై, భగవత్‌ ప్రసాదాలపై విపరీత వ్యాఖ్యానాలు, దేవీదేవతా విగ్రహాల ధ్వంసం, రథాల దహనాలు, సర్వసాధారణ మయ్యాయి. దేవుడి సొమ్ముపై దళారులు కన్ను. పరకామణిలో హస్త లాఘవం.ఆయా సంఘటనలకు సంబంధించి పట్టుబడిన నిందితులు ‘మతిస్థిమితం’ లేని వారిగా క్షమార్హులు కావడం వింత, విచిత్ర పరిణామం. మతిస్థిమితం లేని వారికి హిందూ దేవాలయాలు, దేవతామూర్తులే ఎందుకు లక్ష్యమవుతున్నారు? అన్నది జవాబులేని ప్రశ్న. లౌకకి రాజ్యంలో సాగుతున్న ఈ విపరీత ధోరణిని గట్టిగా ఖండిరచే వారు కరవయ్యారు. అరకొరగా నిలదీసిన వారి మాటలను లెక్కపెట్టని దయనీయత.

మనిషి మాతృ,భాషాబంధాలతో పుడతాడని పెద్దల మాట. ఈ బంధాలకు వర్తమానంలో గల విలువ ఏ పాటిదో ఆత్మపరిశీలన అవసరం. ఆర్థిక సంబంధాల ముందు హార్ధిక సంబంధాలు వెలవెలబోతున్నాయి. కట్టుబొట్టు కట్టుతప్పుతున్నాయి. కన్నవారిని నిరాదరించే ‘వృశ్చిక’ సంతతిలానే, వావివరుసలు మరచి,అవసరమైతే అయిన వారిని అంతమొందించేందుకు కూడా వెనుకాడని ఘనుల గురించిన కథనాలు మాధ్యమాల్లో పుంఖానుపుంఖాలు. మాతృభాషాభిమానం మసక బారుతోంది. ‘సొంత భాషను ప్రేమించు,పరభాషను గౌరవించు’ అనే భాషాభిమానుల పిలుపు బధిర శంఖారావమే. పరభాషకు పట్టం కట్టడమే పరమావధిగా కనిపిస్తోంది. చిన్నారులకు ఉగ్గుపాలతో ఆంగ్లం నేర్పే సంస్కృతి బలపడుతోంది. ‘సనాతనుల దృష్టిలో సంస్కృతం నేర్చినవాళ్లే చదువుకున్నవారు. అధునాతనుల దృష్టిలో ఇంగ్లిషు నేర్చుకున్న వాళ్లే చదువుకున్న వాళ్లు. ఆ సనాతనులు, ఈ అధునాతనులు తెలుగువాళ్లే’ అని విఖ్యాత కథకులు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి దశాబ్దాల క్రితమే అమ్మభాష దుస్థితిపై, భాషా కాలుష్యంపై కలత చెందారు. ఈ కాలుష్యానికి మాధ్యమాలూ తమ వంత పాత్ర పోషిస్తున్నాయడంలో మొహమాటపడక్కరలేదు.అందులోనూ టీవీ చానళ్ల పాలెక్కువన్నది నిష్ఠుర సత్యం.

‘మా పిల్లలకు తెలుగు (మాతృభాష) రాదు’ అని ప్రకటించుకోవడం కన్నవారు మిన్నగా భావించుకుంటున్నారు. ‘నేటి యువతరంలో చాలా మందికి తమ మాతృభాష ఏమిటనేది కూడా తెలియదు.మాతృభాష నిర్లక్ష్యానికి కచ్చితంగా తల్లిదండ్రులే బాధ్యత వహించవలసి ఉంటుంది’అని ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ కార్యవహ దత్తాత్రేయ హోసబళే చెప్పడం కాదనలేని నిజం.

విద్యారంగం వ్యాపారమయమై, మార్కులు… ర్యాంకులే పరమావధిగా భావిస్తున్నవేళ, బలవంతపు చదువులతో ఎందరో విద్యార్థులు బతుకులు చాలి స్తున్నారు. తాము భావిపౌరులకు మార్గదర్శకులమన్న భావన కొందరు గురువుల్లో లోపిస్తోంది. ‘గురువులకు పరువులేదు. విద్యాలయాలకు విలువలేదు. గురజాడ అంటే బెజవాడ పక్కన ఊరు అనుకుంటారే తప్ప ఆయనో మహాకవి అనే అవగాహనలేదు….’ అని దాదాపు అయిదున్నర దశాబ్దాల క్రితం నాటి ప్రయోగాత్మక చలనచిత్రంలోని సంభాషణలు నేటి స్థితికి చాలా వరకు అద్దం పడుతున్నాయి. ఈ దురాచారాలు, దుశ్చర్యలను,వివిధ రంగాల్లో వేళ్లూనుకున్న కాలుష్యాన్ని భోగిమంటలకు ఆహుతి చేయాలి. భోగి మంటలంటే… కేవలం నిరుపయోగ వస్తువులు,చెత్తాచెదారాన్ని దహనం చేయడమే కాదు. మనసుల్లో పేరుకున్న వికారాలను, అరిషడ్వర్గాలను, అజ్ఞానం, మూఢత్వాలను దహింప చేయడమే భోగి మంటల పరమార్థం.