News

శబరిమల దేశవ్యాప్తంగా ఉన్న భక్తులతో ముడిపడిన అంశం : అమిత్‌షా

49views

సంచలనం సృష్టించిన శబరిమల బంగారం చోరీ వ్యవహారంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సారథ్యంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ -LDF ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విమర్శలు గుప్పించారు. బంగారం మాయం కావడానికి బాధ్యులైన వారికి ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఆరోపించారు. ఈ కేసును స్వతంత్ర, తటస్థ విచారణ ఏజెన్సీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. పినరయి విజయన్ ప్రభుత్వం హయాంలో నిజం బయటకు రాదన్నారు.

బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్‌ను గెలుచుకుంది. ఈ విజయం అనంతరం తిరువనంతపురంలో అమిత్‌షా తొలిసారి పర్యటించారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడటంతో పాటు పార్టీ మిషన్-2026 ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో అమిత్‌షా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

శబరిమల అంశాన్ని ప్రస్తావిస్తూ, ఈ ఘటన కేవలం కేరళకే పరమితం కాదని, దేశవ్యాప్తంగా ఉన్న భక్తులతో ముడిపడిన అంశమని చెప్పారు. కీలకమైన పుణ్యక్షేత్రంలోని విలువైన వస్తువులను కాపాడటంలో విఫలమైన ప్రభుత్వం ప్రజల మత విశ్వాసాలను ఎలా కాపాడుతుందని ప్రశ్నించారు. ఈ కేసులో నిందితులకు అనుకూలంగా ఎఫ్ఐఆర్ రూపొందించినట్టు కనిపిస్తోందన్నారు. ఎల్‌డీఎఫ్‌తో సంబంధం ఉన్న ఇద్దరు అనుమానితుల్లో ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో నిష్పాక్షిక విచారణ ప్రశ్నార్థకమేనని అన్నారు.

తటస్థ ఏజెన్సీకి అప్పగించండి
శబరిమల బంగారం చోరీపై విచారణను తటస్థ విచారణ ఏజెన్సీకి అప్పగించాలని అమిత్‌షా డిమాండ్ చేశారు. ఈ విషయమై బీజేపీ ఇంటింటికి వెళ్లి ప్రచారం సాగిస్తుందని, ప్రజల్లో చైతన్యం కలిగిస్తుందని చెప్పారు. ‘ఇది ప్రజాస్వామ్యం. తటస్థ ఏజెన్సీకి కేసు దర్యాప్తును అప్పగించాలని సీఎంను నేను డిమాండ్ చేస్తున్నాను’ అని అన్నారు.