
( జనవరి 14 – భోగి )
సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజే సంక్రాంతి. దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే సమయం కనుక ‘ఉత్తర క్రాంతి’ అని కూడా పిలుస్తారు. సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా ఏడాదికి పన్నెండు సంక్రాంతులొస్తాయి. కానీ మకర సంక్రమణం నుంచి భాస్కరుడు ప్రచండ తేజస్సుతో ప్రకాశిస్తాడు.
దక్షిణాయనంలో వర్షాలు, చలితో రోగాలు, వాతావరణ కల్లోలాలకు ముగింపు పలుకుతుంది ఉత్తరాయణం. ఆరోగ్యకారకం, ఆహారసాధకం, ఆనందదాయకం, ఆధ్యాత్మికపూరకమైన విశిష్టకాలమిది. దక్షిణాయనం పితృదేవతలకు ముఖ్యమైతే, ఉత్తరాయణం దేవతలకు ముఖ్యమైంది.
ముగ్గులు, గొబ్బెమ్మలు, బసవన్నలు, హరిదాసులు, కోడిపందేలు, భోగిమంటలతో శోభాయమానమైన సంక్రాంతి సంబరాల గురించి ఎంత చెప్పినా తక్కువే. చెరుకుగడలు, కోలాటాలు, బొమ్మల కొలువులు ఇవన్నీ మన తెలుగువారికే సొంతం.
గంగిరెద్దులు, ధాన్య రాశులు, భోగిపండ్లు- ఇలా సరదాలూ సంతోషాలూ పంచుతుంది. మామిడాకుల తోరణాలు, పసుపు రాసిన గుమ్మాలు, గొబ్బెమ్మల సందడితో ప్రతి లోగిలీ ప్రకాశిస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ అంటూ మూడు రోజుల ముచ్చటైన పండుగిది. ఈ మూడు రోజుల విశిష్టతను తెలుసుకుంటే సంక్రాంతి శోభ అర్థమవుతుంది.
లక్ష్మీనారాయణులు దీవిస్తారు
మహావిష్ణువుకు బదరీవృక్షం (రేగి) ప్రీతికరమైందని, అందుకే ఆ స్వామి బదరికా వనంలో విహరిస్తాడని పురాణేతిహాసాలు పేర్కొన్నాయి. భోగి రోజున రేగిపండ్లను చిన్నారుల తలపై పోస్తారు. పండ్లతో పాటు నాణేలు కూడా చేర్చడంతో లక్ష్మీదేవి అనుగ్రహమూ చేకూరుతుందని విశ్వసిస్తారు. అలా భోగి పండ్లతో లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం ప్రత్యక్షంగా అందుతుంది. ఎర్రగా, గుండ్రంగా ఉండే రేగిపండ్లను సూర్యుడికి ప్రతీకగా చెబుతారు. ఇవి ఆరోగ్యకారకం కూడా. బొమ్మల కొలువులతో సందడి చేస్తారు. గోదాదేవి శ్రీహరిని భర్తగా పొందిన శుభదినం కనుక దేవాలయాల్లో గోదా శ్రీరంగనాథుల కల్యాణం జరిపిస్తారు.
గాలిపటం.. అంతరార్థం
శ్రీహరిని స్తుతిస్తూ హరిదాసులు చేసే గానం వైష్ణవ సంప్రదాయానికి అర్థం చెబుతుంది. ఇక గాలిపటాలు జీవుణ్ణి దేవుడితో అనుసంధానించే ఆధ్యాత్మికతకు గుర్తుగా నిలుస్తాయి. భగవదాశీర్వాదం దారంలా నిలబడి మానవుడనే గాలిపటాన్ని సంరక్షిస్తున్నంత కాలం ఆనందంగా ఎగురుతూనే ఉంటుంది. ఈ అంతరార్థం తెలిసినా, తెలియకున్నా గాలిపటాలు ఎగరేసే సంప్రదాయం మాత్రం సంక్రాంతిలో భాగమైపోయింది. అయ్యప్ప భక్తులకు శబరిమలపై మకరజ్యోతి సందర్శనం లభించేది కూడా సంక్రాంతి పర్వదినానే.
భోగభాగ్యాల భోగి
భోగితో సంక్రాంతి ప్రారంభమవుతుంది. ఇది ఇంద్రుడికి ప్రీతికరమైంది అన్నది పురాణ వచనం. ఈ రోజు ఇంద్రుణ్ణి, ఇష్టదేవతలను పూజిస్తారు. తెల్లవారు జామున ఇంటి ముందర, కూడళ్లలో భోగిమంటలు వేస్తారు. ఈ కాలంలో వణికించే చలిని తరిమేందుకే ఈ ఆచారం. దీని వల్ల సూక్ష్మక్రిములూ నశిస్తాయి, వాతావరణ కాలుష్యమూ దూరమవుతుంది. యజ్ఞ దేవతను స్మరిస్తూ ఆవు పేడతో చేసిన పిడకలు భోగిమంటల్లో వేస్తారు. వాటితో పాటు ఎండిన కొమ్మలు, ఇంట్లో వాడని చెక్క వస్తువులూ వేస్తారు. ఆపై అభ్యంగన స్నానాలు చేసి, కొత్త బట్టలు ధరిస్తారు. కొత్తబియ్యం, కొత్తబెల్లంతో పొంగలి వండి భగవంతునికి నివేదిస్తారు.





