ArticlesNews

సంక్రాంతి పండుగలో ఎన్ని విశేషాలో…

65views

ముంగిట్లో కళకళలాడే రంగవల్లికలు, ఇంటికి వచ్చే బంధువులు, గాలిపటాలు ఎగరేస్తూ సందడి చేసే పిల్లలు… ఇలా సంక్రాంతి అంటేనే ఓ సంబరం, ఓ ఆనందం. అంగరంగ వైభవంగా చేసుకునే ఈ వేడుకల వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో చూసేద్దామా…

కాలచక్రానికి అధిపతి సూర్యుడు. ఆ ఆదిత్యుడి అధీనంలో నిరంతరం తిరిగే కాలచక్రంలో సంవత్సరానికి రెండు ఆయనాలు వస్తాయి. అవే దక్షిణాయనం, ఉత్తరాయణం. జనవరి తొలిపక్షం చివర్లో అంటే సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలవుతుంది. దీన్నే పుణ్యకాలంగా పిలుస్తాం. ఈ సమయంలోనే పంటా చేతికొస్తుంది. అందుకే సంక్రాంతికి ఓ వైపు సూర్యారాధనను చేస్తూనే మరోవైపు ఆహారాన్ని ఇచ్చే నేలతల్లినీ అందమైన రంగవల్లికలతో, పూలతో పూజిస్తాం. భోగితో మొదలై ముక్కనుమతో ముగిసే సంక్రాంతి పండుగలో ప్రతి రోజుకీ ఓ విశిష్టత ఉంది.

భోగభాగ్యాలతో మురిసేలా…
సంక్రాంతి పండుగ భోగితోనే ప్రారంభమవుతుంది. ఉత్తరాయణ కాలం మొదలయ్యే ముందురోజు విపరీతంగా ఉండే చలిని తట్టుకునేందుకే తెల్లవారుజామున భోగిమంటల్ని వేస్తారు. గోదాదేవి ధనుర్మాసం మొదటి రోజు నుంచీ తిరుప్పావై పాశురాలతో రంగనాథుడ్ని ఆరాధించి… భోగినాడే స్వామిని వివాహమాడి ఆయనలో లీనమవ్వడం వల్లే ఈ పండుగ వచ్చిందనే కథ ప్రాచుర్యంలో ఉంది. అందుకే ధనుర్మాస వ్రతం భోగితో ముగుస్తుంది. ఇక, భోగినాడు ఆవుపిడకలపైన కొత్తబెల్లం, కొత్త బియ్యం, ఆవుపాలతో పొంగలిని వండి సూర్యభగవానుడికి నివేదించడం పరిపాటి. అలాగే సూర్యాస్తమయం అయ్యేలోగా అయిదు సంవత్సరాలలోపు ఉన్న బాలబాలికలకు భోగిపళ్లు పోయడమూ ఓ సంప్రదాయమే. అందులో భాగంగా ఈ సమయంలో దొరికే రేగుపండ్లను ఉపయోగిస్తారు. రేగుపండ్లకు సంస్కృతంలో బదరీ ఫలమని పేరు. సూర్యుడి కాంతిని తనలో నిలుపుకొనే శక్తి రేగుపండుకు ఉంటుంది. ఈ పండ్లను పిల్లలపైన పోయడం వల్ల సూర్యుడి శక్తి వారికి చేరుతుందనే ఉద్దేశంతోనే రేగుపండ్లు, చెరకుముక్కలు, చిల్లర, నవధాన్యాలు, పాలకాయలు, పూరేకులు… తదితరాలను కలిపి భోగిపండ్లను పోస్తారు. ఒకప్పుడు బదరీవనంలో నరనారాయణులు భోగినాడే తపస్సు ప్రారంభించారట.

దానికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరాలనివ్వడంతో దేవతలంతా వారి తలలమీద బదరీఫలాలను కురిపించారట. అందుకే పిల్లల్నీ నరనారాయణులుగా భావించి రేగుపండ్లను పోస్తారని అంటారు.

నువ్వులు తినాలంటారు…
భోగి మర్నాడు వచ్చే పండుగే మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టే ఈరోజును మకర సంక్రాంతి లేదా మకర సంక్రమణంగా పిలుస్తారు. ఈ రోజునుంచీ ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. ఏడాది మొత్తం చేసే దానధర్మాలతో పోలిస్తే.. మకర సంక్రాంతి నాడు కూష్మాండం దానం చేయడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెంది శుభాలు చేకూరుస్తారట. అలాగే నువ్వుల్ని ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఆరోగ్యంతోపాటూ ఆయుష్షూ పెరుగుతుందని చెబుతారు. తెల్ల నువ్వులతో దేవతార్పణం, నల్ల నువ్వులతో పితృతర్పణం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

పాడికీ ప్రాధాన్యం
సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే రోజును కనుమగా భావించడం వల్లే ఈ రోజును మేష సంక్రాంతిగా పిలుస్తారు. ఉపకారం చేసినవారికి ప్రత్యుపకారం చేయాలన్నదే కనుమ పండుగ అంతరార్థం. కృషి వ్యవస్థకు మూలాధారమైన పశువులకు కృతజ్ఞతలు తెలియజేయడమే ఈ పండుగ ప్రధాన ఉద్దేశం. కనుమనాడు రైతన్నలు ముందుగా పశుశాలను శుభ్రం చేసి… తమ గోవుల్నీ, బసవన్నల్నీ కడిగి పసుపు రాసి కుంకుమపెట్టి పూలమాలలతో అలంకరించి పూజించి, మేత వేసి… సాయంత్రం మేళతాళాలతో ఊరేగిస్తారు. తెలుగువారు పితృదేవతలకు ప్రీతికరమని గారెల్ని వండుతారు. సంక్రాంతి తొలి మూడురోజులకీ ఏదో ఒక పరమార్థం ఉంటే… నాలుగో రోజున ముక్కనుమగా పిలుస్తారు.

ఈ రోజున కూడా కనుమ తరహాలోనే పశువులను పూజించే సంప్రదాయం కొన్నిచోట్ల ఉంటే… మరికొన్ని ప్రాంతాల్లో సావిత్రి గౌరీ వ్రతం పేరుతో అమ్మవారిని పూజిస్తారు.