News

JNU పవిత్రత భంగమైంది, దోషులను శిక్షించండి : VHP డిమాండ్

160views

జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం క్యాంపస్ లో రెచ్చగొట్టే నినాదాలు చేసిన వామపక్ష విద్యార్థి సంఘాలపై విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ నినాదాలు అత్యంత దురదృష్టకరమని, ఈ విషయంపై లోతైన దర్యాప్తు చేసి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

విద్యా సంస్థల్లో పవిత్రత బాగా క్షీణిస్తోందని, ఇలాంటి నినాదాలు, ఘటనల ద్వారా ప్రజాస్వామ్య నిబంధనలను వారు ఉల్లంఘించినట్లేనని ఓ ప్రకటనలో మండిపడ్డారు. దేశ ప్రధానమంత్రి మరియు ఇతరులను లక్ష్యంగా చేసుకుని చేసిన అసభ్యకరమైన నినాదాలతో జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం పవిత్రత మళ్లీ భంగమైంది” అంటూ మండిపడ్డారు. ఢిల్లీ అల్లర్లకు సంబంధించి ఉమర్ ఖలీద్ మరియు షార్జీల్ ఇమామ్‌లకు బెయిల్ నిరాకరించడంతో వారు రెచ్చగొట్టే నినాదాలు చేశారన్నారు.

ప్రాసిక్యూషన్ లో ఉమర్, షర్జీల్ కి వ్యతిరేకంగా ప్రత్యక్షంగా, వారి నేరాన్ని రుజువు చేసే ఆధారాలున్నాయని సుప్రీం కోర్టు గుర్తించిందని, 2020లో ఢిల్లీలో హిందువులపై జరిగిన ప్రణాళికాబద్ధమైన దాడుల వెనుక ఉన్న పెద్ద కుట్రకు సంబంధించిన నేరాలలో వారి నిర్ణయాత్మక పాత్రను కూడా సుప్రీం గుర్తించిందన్నారు. అలాగే వారు దేశ ఐక్యత, ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా కుట్రలు పన్నారని మండిపడ్డారు. ఇది అత్యంత దారుణమైన నేరమన్నారు.

ప్రతి ఒక్కరూ విచారణ కోసం వేచి ఉండటం సముచితం, అక్కడ నిందితులు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఉంటుందన్నారు. దురదృష్టవశాత్తూ, కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి JNU క్యాంపస్ వాతావరణాన్ని చెడగొట్టారని, ఇది అత్యంత దురదృష్టకరమని, సిగ్గుచేటన్నారు. దీనిపై యూనివర్సిటీ యాజమాన్యం ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేసిందని, దర్యాప్తు చేపట్టి, దోషులను చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు.