
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) మళ్లీ వార్తల్లో నిలిచింది. అక్కడి విద్యార్థులు కొందరు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై తీవ్ర అభ్యంతరకరమైన, రొచ్చగొట్టే నినాదాలు చేసిన వీడియోలు బయటికి వచ్చాయి. దీనిపై JNU అధికార యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. ఈ నినాదాలను తాము ఖండిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే దీనిలో పాత్ర వున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా యాజమాన్యం ప్రకటించింది. తక్షణమే సస్పెండ్ చేయడం లేదా యూనివర్శిటీ నుంచి శాశ్వతంగా బహిష్కరణ కూడా చేసే అవకాశం వుందని యాజమాన్యం ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా యూనివర్శిటీ యంత్రాంగం ఢిల్లీ పోలీసులను కోరింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కూడా స్పందించింది. విశ్వవిద్యాలయాలు కొత్త కొత్త ఆవిష్కరణలకు, ఆలోచనలకు కేంద్రాలే కానీ, విద్వేషపూరిత ప్రయోగశాలలుగా మార్చడానికి తాము మాత్రం అనుమతించమని తేల్చి చెప్పింది.
‘‘వాక్ స్వాతంత్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు. కానీ… ఏ విధమైన హింస, చట్టవిరుద్ధమైన ప్రవర్తనను కానీ, దేశ వ్యతిరేక కార్యకలాపాలను మాత్రం ఎట్టి పరిస్ధితుల్లోనూ సహించం’’ అని JNU యాజమాన్యం ప్రకటించింది.
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (JNUSU)తో సంబంధం ఉన్న విద్యార్థులు నిర్వహించిన “ఎ నైట్ ఆఫ్ రెసిస్టెన్స్ విత్ గెరిల్లా ధాబా” అనే కార్యక్రమం సబర్మతి ప్రాంగణంలో జరిగింది. ఈ సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు విశ్వవిద్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇక.. మొదట కేవలం చిన్న కార్యక్రమంగా కనిపించింది. కేవలం 30 నుంచి 35 మంది విద్యార్థులే వచ్చారు. అయితే, 2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో ఉమర్ ఖలీద్ మరియు షార్జీల్ ఇమామ్ బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించిన తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయిందని యూనివర్శిటీ యాజమాన్యం పేర్కొంది.ఆ తర్వాత కొద్దిసేపటికే, విద్యార్థుల బృందం ప్రధానమంత్రి మరియు హోంమంత్రిని లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టే నినాదాలు చేయడం ప్రారంభించిందని కూడా తెలిపింది.
ఈ గొడవంతా ఎప్పుడు కారణమైందంటే…
2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో ఉమర్ ఖలీద్ మరియు షార్జీల్ ఇమామ్‌లకు బెయిల్ మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన వెంటనే ఈ గొడవ ప్రారంభమైంది. కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సబర్మతి హాస్టల్ దగ్గర వామపక్ష విద్యార్థి సంఘాలు ఈ నిరసనను నిర్వహించారు. ఈ నిరసనలోనే ఉద్దేశపూర్వకంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు యూనివర్శిటీ క్యాంపస్ భద్రతా అధికారులు పేర్కొంటున్నారు. ఇదేమీ అనుకోకుండా జరిగింది కాదని, ఉద్దేశపూర్వకంగానే వామపక్ష విద్యార్థులు నినాదాలు చేసినట్లు కూడా తెలిపారు.





