News

అలీగఢ్ యూనివర్సిటీలో కాల్పులు.. ఉపాధ్యాయుడు హత్య

174views

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ విశ్వవిద్యాలయంలో నడకకు వెళ్లిన ఉపాధ్యాయుడి తలపై రెండుసార్లు కాల్చడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన యూనివర్సిటీలో తీవ్ర కలకలం రేపింది.

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో ఏబీకే హైస్కూల్‌లో కంప్యూటర్ సైన్స్ బోధించే డానిష్ రావు.. ఇద్దరు సహోద్యోగులు బుధవారం సాయంత్రం నడకకు వెళ్లారు. కబుర్లు చెప్పుకుంటూ సాగిపోతుండగా రాత్రి 8:50 గంటల సమయంలో కాల్పుల శబ్దాలతో మార్మోగింది. స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. సమీపం నుంచి తలపై రెండు, మూడు సార్లు కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో క్యాంపస్ అంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం దుండగులు పరారయ్యారు.

డానిష్ రావును వెంటనే జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీకి తరలించినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నీరజ్ జాడోన్ తెలిపారు. ఆస్పత్రికి చేరుకునేలోపే ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. విశ్వవిద్యాలయంలోని సెంట్రల్ లైబ్రరీ సమీపంలో ఈ కాల్పులు జరిగినట్లు తెలిపారు. ఆరుగురు పోలీసు బృందాలు ఏర్పాటు చేశామని, తప్పించుకున్న హంతకులను గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.