News

కంబోడియాలో విష్ణువు విగ్రహం కూల్చివేత.. భారత్ అభ్యంతరం

192views

గత కొద్దిరోజులుగా కంబోడియా-థాయ్‌లాండ్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నడుస్తున్నాయి. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఘర్షణకు దారి తీసింది. దీంతో ఇరు దేశాల మధ్య వార్ నడుస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు ఉద్రికత్తంగానే ఉన్నాయి.

ఇలాంటి తరుణంలో కంబోడియాలో విష్ణువు విగ్రహం ధ్వంసమైంది. కంబోడియా భూభాగంలో అన్ సెస్ ప్రాంతంలో ఉన్న విగ్రహాన్ని ఒక జేసీబీ కూల్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ విగ్రహాన్ని థాయ్‌లాండే కూల్చేసిందని కంబోడియా అధికారి ఒకరు ఆరోపించారు. దీనిపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇక ప్రీహ్ విహార్ ప్రతినిధి లిమ్ చాన్‌పాన్హా మాట్లాడుతూ.. 2014లో నిర్మించిన విష్ణు విగ్రహాన్ని థాయ్‌లాండ్‌కు 100 మీటర్ల సరిహద్దు దూరంలో జరిగిందని వెల్లడించారు. సోమవారం ఈ విగ్రహాన్ని కూల్చేశారని తెలిపారు. బౌద్ధ, హిందూ అనుచరులు పూజించే పురాతన దేవాలయంగా పేర్కొన్నారు. విగ్రహాల ధ్వంసాన్ని ఖండిస్తున్నారు. ఇక సంఘటనపై థాయ్‌లాండ్ అధికారులు ఇంకా స్పందించలేదు.

విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో నిర్మించిన విష్ణుమూర్తి విగ్రహాన్ని కూల్చివేసినట్లు మాదృష్టికి వచ్చింది. ఇది కొనసాగుతున్న థాయ్‌లాండ-కంబోడియా సరిహద్దు వివాదంతో ప్రభావితమైన ప్రాంతంలో ఉంది. ఇటువంటి అగౌరవ చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని అన్నారు.

ఈ ప్రాంతం ఉమ్మడి సాంస్కృతిక, నాగరిక బంధాలను నొక్కి చెబుతూ.. దక్షిణ, ఆగ్నేయాసియా అంతటా ప్రజలు హిందూ, బౌద్ధ దేవతలను ఎంతో గౌరవిస్తారని, పూజిస్తారని జైస్వాల్ పేర్కొన్నారు. ఇటువంటి చిహ్నాలు, ఈ ప్రాంతం ఉమ్మడి వారసత్వంలో అంతర్భాగమని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు మతపరమైన, సాంస్కృతిక వారసత్వానికి నష్టం తీవ్రతరం చేస్తుందని, ఉద్రిక్తతలను మరింత పెంచుతుందన్నారు. రెండు దేశాలు చర్చల ద్వారా శాంతిని పునరుద్ధరించాలని, ప్రాణనష్టం, ఆస్తినష్టం, వారసత్వ నష్టం జరగకుండా చూడాలని పిలుపునిచ్చారు.