
తిరుపతి నగరంలోని జాతీయ సంస్కృతం విశ్వవిద్యాలయంలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం డిసెంబర్ 26 నుండి 29 వరకు నాలుగు రోజుల పాటు దేశంలోని అనేక రాష్ట్రాలనుండి వచ్చే 1500 మంది ప్రతినిధులతో జరగనుంది. ఈ సమ్మేళనంలో శాస్త్రసాంకేతిక రంగాలలోని నూతన ఆవిష్కరణలు, భారతీయ విజ్ఞానవైభవం గురించి పరిశోధనాత్మకమైన మరియు ఆలోచనాత్మకమైన అనేక చర్చాసదస్సులు జరుగనున్నాయి. 26 వ తేదీన జరగనున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనం ప్రారంభసమావేశానికి ముఖ్య అతిథి మరియు ప్రధానవక్తగా రాష్ట్రియ స్వయంసేవక్ సంఘ్, సర్ సంఘచాలక్ పరమ పూజనీయ మోహన్ భాగవత్ గారు విచ్చేయనున్నారు.
అలాగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి డా. జితేంద్ర సింగ్ గారు రానున్నారు. సిఎస్ఐఆర్ పూర్వ డైరక్టర్ జనరల్ డా. శేఖర్ మాండే గారు, డిఆర్‌డిఓ పూర్వ ఛైర్మన్ డా. సతీశ్ రెడ్డి గారు, ఎన్‌ఐఎఫ్ డైరక్టర్ అరవింద్ రాణాడే, అమెరికా లోని పర్డ్యూ యూనివర్శిటీ ఆచార్యులు ప్రొఫెసర్ అలోక్ చతుర్వేదీ గారు మరియు పలు ఐఐటి, కేంద్ర పరిశోధన సంస్థల డైరక్టర్లు, విశ్వవిద్యాలయాల ఉపకులపతులు పాల్గొని వివిధ అంశాలపై ప్రసంగిస్తారు.
29 వ తేదీన జరగనున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనం ముగింపు సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి సభ్యురాలు డా. శామిక రవి గారు, కేంద్ర శాస్త్ర సాంకేతిక మండలి కార్యదర్శి అభయ్ కరండికర్ జీ రానున్నారు.
శాస్త్ర, సాంకేతిక రంగాలలో నూతన ఆవిష్కరణలకి సంబంధించి డిఆర్‌డిఓ, సియస్‌ఐఆర్, ఎన్‌ఐఎఫ్, ఎంపిసిఎస్‌టి, ఎన్‌ఆర్‌ఎస్‌సి, పిఎఫ్‌సి వంటి ప్రతిష్ఠాత్మక శాస్త్ర పరిశోధన సంస్థలు భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో భాగంగా ఏర్పాటు చేసే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్‌పో లో పాల్గోనున్నాయి. ఈ రోజు భారతీయ విజ్ఞాన సమ్మేళనం ఎక్స్‌పో బ్రోచర్‌ని విజ్ఞాన భారతి జాతీయ సంఘటన కార్యదర్శి డా. శివకుమార్ గారు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.ఎస్.ఆర్ కృష్ణమూర్తి గారు, విజ్ఞాన భారతి జాతీయ సహ సంఘటన కార్యదర్శి ప్రవీణ్ రామదాస్ గారు, విజ్ఞాన భారతి జాతీయ కార్యదర్శి మరియు సమ్మేళనం కన్వీనర్ శ్రీ కొంపెల్ల సుబ్బరాయ శాస్త్రి గారు, విజ్ఞానభారతి రాష్ట్ర కార్యదర్శి, ఆచార్య సుబ్రహ్మణ్యం గారు, రాష్ట్ర ప్రచార ప్రముఖ్ డా. ప్రసన్న కుమార్ గారు, రాష్ట్ర సహకార్యదర్శి డా. అనిల్ ఆత్మజ గారు, నోడల్ ఆఫీసర్ డా. ఓ.జి.పి కళ్యాణ శాస్త్రి గారు పాల్గొన్నారు.





