News

వ్యక్తి నిర్మాణం, సామాజిక సమరసతపై సంఘ్ దృష్టి : మోహన్ భాగవత్

205views
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన లక్ష్యం దేశ అభివృద్ధి, సామాజిక అభ్యున్నతి అని, అంతేకానీ రాజకీయ అధికారం చెలాయించడమో, రాజకీయ ఆధిపత్యం కోసమో కాదని సర సంఘచాలక్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. సంఘ కార్య శతాబ్ది సందర్భంగా తమిళనాడులో యువకులు, మేధావులు, స్టార్టప్ ప్రముఖులను ఉద్దేశించి 100 years Saga of RSS – Envisioning the Way Forward’ అనే కార్యక్రమం జరిగింది. ఈ సంభాషణ దాదాపు రెండున్నర గంటల పాటు సాగింది.
ఒక దేశాన్ని నిర్మించడం, అభివృద్ధ చేయడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ఇలా బాధ్యతాయుతంగా మెలగడం ద్వారా తన సొంత ప్రయోజనాలను కూడా కాపాడుకుంటారన్నారు. సంఘ్ రాజకీయ ఆధిపత్యంగానీ, మరో రకమైన ఆధిపత్యాన్ని ఏమాత్రం కోరుకోదని, తమ లక్ష్యం అధికారం కానేకాదని పునరుద్ఘాటించారు. కానీ.. దేశ దీర్ఘకాలిక పురోగతికి కట్టుబడి వున్న సంఘటిత, క్రమశిక్షణ కలిగిన, విలువల ఆధారిత సమాజం లక్ష్యమని ప్రకటించారు.
మరో వైపు భారత్ లో వున్న వైవిధ్యతను కూడా పునరుద్ఘాటించారు. మనం వైవిధ్యతను జరుపుకుంటామని, కానీ..ఒకే దేశం, ఒకే సమాజంగా వుండటమే పెద్ద గుర్తింపు అని అన్నారు. ఈ వైవిధ్యాలన్నీ వున్నా.. చాలా కాలంగా మనం ఒకే దేశంగా జీవిస్తున్నామని తెలిపారు.
ఇక.. మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకానికి పూర్తిగా ముగింపు పలకాలని మోహన్ భాగవత్ నొక్కి చెప్పారు. విధాన స్థాయిలో మార్పులను అనుసరించే ముందు ఆ అలవాట్లన్నీ వ్యక్తి, కుటుంబ స్థాయిల్లోనే ప్రారంభం కావాలని సూచించారు. ఇక.. భాష విషయంలోనూ మరోసారి స్పష్టతనిచ్చారు. ప్రతి భారతీయ భాష కూడా జాతీయ భాషేనని,మనం నివసించే ప్రాంత భాషను కూడా తెలుసుకోవాలని, తద్వారా సమాజంతో సులభంగా కలిసిపోగలుగుతామన్నారు. అయితే.. ఇళ్లల్లో మాత్రం అందరూ తమ తమ మాతృ భాషల్లోనే మాట్లాడుకోవాలని సూచించారు. అలాగే మన మన సంతకాలు కూడా మాతృ భాషల్లోనే చేయాలని పిలుపునిచ్చారు.
సమాజ అభివృద్ధి ఎప్పుడూ ఒంటరిగా వున్న వ్యక్తులతో కాదని, కుటుంబాలు, గ్రామాలు, చట్టాలు, సంప్రదాయాలకు కట్టుబడి వున్న వాటితోనే సాధ్యమవుతుందన్నారు. జాతీయ భావాలు కలిగిన వ్యక్తులున్న సమాజాన్ని నిర్మించాలన్నదే ఆరెస్సెస్ లక్ష్యమని పునరుద్ఘాటించారు.అలాగే ఆరెస్సెస్ ఎవరికో పోటీదారుగానో, ఎవరినో వ్యతిరేకించడానికో లేదని, తప్పుడు కథనాలను సృష్టిస్తున్నారని, ఆ అపార్థాలను తొలగించాల్సిన అవసరం వుందని తేల్చి చెప్పారు.
mohan ji
నైతికంగా, సాంస్కృతికంగా, సామాజికంగా సమాజాన్ని బలోపేతం చేయడం అనేదే దేశానికి బలమైన పునాది అని సంఘ్ నమ్ముతుందని, వ్యక్తి నిర్మాణం, సామాజిక సమరసతపై సంఘ్ దృష్టి పెడుతుందని వివరించారు.
మరో వైపు ఆరెస్సెస్ స్థాపన, హెడ్గేవార్ దార్శనికత గురించి కూడా మోహన్ భాగవత్ ప్రస్తావించారు. తన 11 ఏళ్ల వయస్సులోనే తల్లిదండ్రులను డాక్టర్జీ కోల్పోయారని, అయినా తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారని, వైద్య విద్యను పూర్తి చేసి, తర్వాత తన జీవితాన్ని పూర్తిగా దేశ సేవకే అంకితం చేశారన్నారు. బాలగంగాధర్ తిలక్, గాంధీజీ, భగత్ సింగ్ వంటి ప్రముఖ వ్యక్తులతో డాక్టర్జీ నిరంతరం సంభాషణలు జరిపేవారని, విదేశీ దాడుల కంటే సామాజిక దుర్బలత్వం వల్లే భారత్ కి ఇబ్బంది అన్న విషయాన్ని హెడ్గేవార్ గ్రహించారన్నారు.
దేశానికి జీవితాంతం సేవ చేస్తానని డాక్టర్జీ ఎలా ప్రతిజ్ఞ చేశారో, పూర్తి అంకిత భావాన్ని ప్రదర్శిస్తూ బ్రహ్మచర్యాన్ని ఎలా ఎంచుకున్నారో కూడా మోహన్ భాగవత్ వివరించారు.‘‘స్వేచ్ఛ, సమానత్వం, ఐక్యత వుంటేనే సమన్వయం సాధ్యమని డాక్టర్జీ ప్రబలంగా విశ్వసించారు. ఐక్యతే లేకపోతే రాజ్యాంగం కూడా మనల్ని రక్షించలేదు అనేవారు. వ్యక్తులు, వ్యవస్ధలు, నిజాయితీ, నిస్వార్థత, దేశ భక్తిని బలోపేతం చేసే వాతావరణం సామాజిక పరివర్తనకు అవసరమని కూడా డాక్టర్జీ విశ్వసించేవారు’’ అని పేర్కొన్నారు.
ఇక.. తమిళనాడులో సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధేలతో పోల్చిన కథనాలను ఉటంకిస్తూ.. ‘‘మనది సనాతన దేశం. దీని గుర్తింపే వైవిధ్యం. అన్నింటినీ అంగీకరిస్తుంది.మన జాతికి పునాదే వైవిధ్యం. దానిని మనం జరుపుకుంటాం కూడా. ఇది హిందూ దేశం. హిందూ అనే పదానికి భారతీయ, హిందవీ, ఇండిక్ అనే అర్థాలున్నాయి. మనం చూసే తేడాలు కేవలం తాత్కాలికం. ఐక్యతే శాశ్వతమైంది. సంపూర్ణమైంది’’ అని మోహన్ భాగవత్ ప్రకటించారు.
ఆరెస్సెస్ ఓ శక్తిమంతమైన సంస్థగా మారాలని కోరుకోవడం లేదని, కానీ.. యావత్ సమాజం శక్తిమంతంగా మారాలని మాత్రం కోరుకుంటోందని, ఇందెలో అభిప్రాయ భేదాలున్న వారు కూడా వుంటారని స్పష్టం చేశారు. దేవుడు తమకు తాముగా సహాయం చేసుకునే వారికి సహాయం చేస్తాడని, సహాయం కోసం మనం ప్రభుత్వంపై మాత్రమే ఆధారపడలేమన్నారు.కాబట్టి సమాజం తనకు తానుగా సహాయం చేసుకునేలా చూడటం స్వయంసేవక్ బాధ్యత అని తెలిపారు.
ధర్మం అనేది కేవలం ఆరాధించేది మాత్రమే కాదని, అందర్నీ ఐక్యం చేసేది, ఉద్ధరించేదిగా అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ ధర్మం కోసం పని చేయడానికి సిద్ధంగా వున్నప్పుడు దేశం అభివృద్ధి చెందుతుందని వివరించారు.ఇక.. ‘‘ఆరెస్సెస్ ద్వారా వచ్చిన మార్పులకు క్రెడిట్ మేం ఆశించం,ఆరెస్సెస్ ఈ మార్పును తీసుకువచ్చిందని చరిత్ర ఎక్కడా ప్రస్తావించకూడదని కూడా మేము కోరుకుంటున్నాం. కానీ సమాజం నాయకత్వం వహించి క్రెడిట్ తీసుకోవాలని మాత్రం కోరుకుంటున్నాం. భారత్ ను కీర్తి శిఖరాలకు తీసుకెళ్లగల, దాని నాగరిక జ్ఞానాన్ని ప్రపంచంతో పంచుకోగల సామర్థ్యం గల సమాజాన్ని సృష్టించడం లక్ష్యం’’ అని స్పష్టం చేశారు.