
నంద్యాల జిల్లా, మన ఊరు మన గుడి మన బాధ్యత స్వచ్ఛంద సైనికులు దేశమంతటా గోపురాలు, చారిత్రక కట్టడాలు, గోవుల సేవే కాదు, గోవిందుడికి అపచారంగా అనిపించే దురలవాటును మానిపించే అద్భుతమైన చొరవను ఆచరించి చూపించారు.
మనం దారెంట వెలుతూ ఉంటే యావత్ సనాతనులు ఎంతో భక్తి ప్రపత్తులతో నిత్య ధూప,దీప, నైవేద్యాలతో అర్చించే మన ఇష్ట దైవాల చిత్రపటాలు, ప్రతిరూపాలు మనం కాలు మోపటానికి కూడా ఇష్టపడని దుర్గంధ పూరితమైన ప్రదేశాలలో, ఆపరిశుభ్ర ప్రదేశాలలో పడి ఉండటం చూసి మనసు చివుక్కుమంటుంది. కానీ ఏం చేయాలో అర్థం కాదు.

అక్కడికీ ప్రవచన కారులు చెబుతూనే ఉంటారు మనం పూజించే దేవతామూర్తుల చిత్రం పటాలు చిద్రమైన వాటిని పారే నీటిలో కానీ, పవిత్రంగా అగ్ని సంస్కారం కానీ చేయాలని, కానీ మనకు అంత ఓపికెక్కడిది. మన ఇల్లు దాటిస్తే సారి, ఏ రోడ్డు ప్రక్కనో, గుడిలో ఓ మూలనో, ఏ చెట్టు కింద నో వదిలేసి ఎనలేని పాపాన్నే కాదు, పర్యావరణ కాలుష్యాన్ని, మన సనాతన ధర్మానికి తీరని కళంకాన్ని కలిగిస్తున్నాము.

ఈ నేపధ్యంలో శ్రీ శివ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మన ఊరు మన గుడి మన బాధ్యత బృందం ఈ దురాచారానికి, ఆచరణాత్మక, పర్యావరణ హిత, శాస్త్రోక్త పరిష్కారం చూపారు. కార్తీకమాసం అంతట వదిలి వేయబడిన దేవతామూర్తుల చిత్రపటాలను సేకరించి పద్మావతి నగర్ లోని స్వచ్ఛభారత్ పార్క్ లో (ఈ పార్క్ కూడా ఈ బృందం కృషే) వాటన్నింటినీ చేర్చి పురోహితుని చేత శాంతి పూజలు చేయించి తదుపరి వాటి చెక్కలు, అద్దాలు ఊడ దీయించి దేవుడి చిత్రాలున్న కాగితాలను శాస్త్రోక్తంగా పారే నీటిలో నిమజ్జనం చేశారు. పనికొచ్చే అద్దాలను, చెక్కలను పునర్వినియోగానికి ఇచ్చి వేసి, నిరుపయోగమైన వాటిని పర్యావరణ హితంగా పరుశురామ ప్రీతి (అగ్నికి ఆహుతి) చేశారు.
ఈ బృందం ప్రతి మూడు నెలలకు ఓసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు ప్రకటించడం విశేషం.
ఇలాంటి దురాచారానికి పర్యావరణ హితమైన, శాస్త్రోక్తమైన పరిష్కారాన్ని చూపిన ఈ బృందానికి ఆస్తికులందరూ అభినందనలు తెలిపారు.





