
‘‘సుబ్రహ్మణ్య భారతి జయంతి ప్రత్యేకం ’’
‘వెన్నెల్లో సింధు నదిలో పడవ పై మలయాళ భామతో అందమైన తెలుగు పాట పాడుకోవాలి’ అని స్వప్నించిన కవి సుబ్రహ్మణ్య భారతి. ఈ పాటలో ఆయన భారతదేశంలోని అన్ని జాతులవారూ కలిసి సాగాలని భావించారు. గురజాడ, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి కవితా ప్రవాహాల త్రివేణీ సంగమం ‘భారతి’ గేయం. ‘ఊడి వలయాడు పాప…’ లాంటి చిన్నపిల్లల గీతాలు రాసినా, ‘కాలిపోయినా బాధపడ్డా పదేపదే వందేమాతరం పాడాలి’ అని నినదించినా, ‘కవిత రాసేవాడు కవి కాడు. కవిత్వాన్ని జీవితంగా జీవితాన్ని కవిత్వంగా చేసుకున్నవాడే కవి’ అని పలికినా… సుబ్రహ్మణ్య భారతి పదాలు.. పదాలు కావు… అక్షర తూణీరాలు. ఓ పక్క తమిళ సంస్కృతీ సాహిత్యాల ఉనికిని నినదిస్తూనే మరోపక్క భారతీయ ఏకాత్మను చాటిన కవి. తమిళ భాషని తల్లీ అని సంబోధించి అక్కున చేరిన అదే కవి, – ‘హిమాలయాలు మనవి, గంగానది మనది, ఇంకెందుకు ఆత్మన్యూనత మనకి’ అని ఎలుగెత్తి చాటగలిగారు.
సుబ్రహ్మణ్య భారతి అసలు పేరు సుబ్బియ. 1882 డిసెంబర్ 11న తమిళనాడులోని తూతుకూడి జిల్లా ఎట్టయపురంలో జన్మించారు. 1893లో ఎట్టయపురం రాజావారు సంగీత పాటవ పోటీలు నిర్వహించారు. గండపెండేరాలు తొడిగించుకున్న ఉద్ధండ గాన గంధర్వులతో 11 ఏళ్ల సుబ్బియ పోటీపడ్డాడు. పిట్ట కొంచెమైనా కూత ఘనమనిపించాడు. రాజావారు ‘భారతీయార్’ అన్న బిరుదునిచ్చారు. అలా సుబ్బియ కాస్తా సుబ్రహ్మణ్య భారతి అయ్యారు. ఆయనకు తన 16వ ఏట చెల్లమ్మాళ్‌తో వివాహం అయింది. అయితే సంసారంలో ఇమడలేకపోయిన ఆయన 17 ఏళ్ల వయసులో ఇల్లు విడిచి కాశీకి పయనమయ్యారు.
జాతీయవాదం, దేశభక్తి, హైందవ తత్త్వం లాంటి భావాలపై భారతికి మక్కువ కలిగింది ఇక్కడే. నాలుగేళ్ల పాటు ఈ ఊరూ ఆ ఊరూ అంటూ అనేక ప్రాంతాలు తిరిగారు. దాంతో ఆనాటి వాస్తవిక విషాదమయ భారతదేశం ఎలా ఉందో తెలిసొచ్చింది. కులం, లింగం, విద్య, డబ్బు పేరిట ఒకరు మరొకరిని హీనంగా చూసే రుగ్మతల్ని చూసి ఆయన కళ్లు చెమ్మగిల్లాయి. ఫలితంగా ఆయన ఆలోచనా ఖడ్గధార పదునెక్కింది. వివేచనతో పాటు వేషమూ మారింది. తలపాగా, దాని నుంచి మెడ చుట్టూ సాగే వస్త్రం, మెలి తిరిగిన మీసం, పెరిగిన గెడ్డం, అమానవీయతను దహించే నిప్పు కణికల్లాంటి కళ్లు – వెరసి ఒక సాంఘిక వీరుడిలా మారారు.
తిలక్, అరవింద్ ఘోష్ వంటి అతివాదుల స్ఫూర్తితో సుబ్రహ్మణ్య భారతి జాతిని ఉత్తేజితం చేసే కవితలు రాశారు. ‘భారతమాతను తల్చుకుంటేనే నీకు శత్రువులంటే భయం పోతుంది’ అని నినదించగలిగారు. స్వదేశీ మిత్రన్, ఇండియా లాంటి పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించి, జాతీయోద్యమ రచనలనెన్నింటినో వెలువరించారు. స్త్రీలు రాజకీయాల్లో భాగస్వాములు కావాలని ప్రబోధిస్తూ, ఉద్యమించినవారిలో మొట్టమొదటి సంస్కర్త కూడా ఆయనే. స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానులేనని భావిస్తే ప్రపంచం వైజ్ఞానికంగా, మేధాపరంగా సమున్నతంగా విలసిల్లుతుందని భారతి భావించారు. హిందూ సమాజంలోని కుల వ్యవస్థకు కూడా భారతి వ్యతిరేకంగా పోరాడారు. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినా భారతి తన కుల గుర్తింపును విడిచిపెట్టారు. దళితులను హిందూ ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు పోరాటం చేశారు.
సుబ్రహ్మణ్య భారతి తన కవిత్వంతో ప్రగతిశీలమైన, సంస్కరణాత్మకమైన ఆదర్శాన్ని వ్యక్తీకరించారు. ఆయన రచనలు మతం, రాజకీయం, సమాజానికి సంబంధించిన అనేక విస్తృతమైన అంశాలను వస్తువులుగా కలిగి ఉన్నాయి. ఆయన భావాలు చాలా వరకూ ఆధునిక కాలానికి కూడా ప్రాసంగికంగా, సమకాలీనంగా నిలవడం విశేషం. బహుముఖ ప్రజ్ఞను చాటుకున్న భారతి 1921 సెప్టెంబర్ 12న 38 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఆయన తమిళులు, తెలుగువారికే కాదు యావత్ జాతికి సదా స్మరణీయులు.





