ArticlesNews

జ్ఞాన దీపం.. సన్మార్గ దర్శనం

159views

( నేడు దత్త జయంతి )

జీవులు ధర్మబద్ధంగా జీవించడానికి అవరోధం ఏర్పడినప్పుడు.. భగవంతుడు అవతార పురుషుడిగా ఉద్భవిస్తాడు. దుష్టులను శిక్షిస్తాడు. అలాగే నిత్య జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను అధిగమించడానికి, స్థిరచిత్తంతో ముందుకు సాగడానికి తోడ్పడేందుకు ఆ కరుణాంతరంగుడు సద్గురువుగా అవతరిస్తాడు. ధార్మికతను ప్రబోధిస్తాడు, మోక్షేచ్ఛ కలిగిస్తాడు. అలా అవతరించిన మహాత్ముడే దత్తాత్రేయుడు.

మార్గశిర పౌర్ణమి త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడి జయంతి. అత్రి మహాముని సతీమణి అయిన అనసూయకు త్రిమూర్తులు ఇచ్చిన మాటను అనుసరించి ఆవిడ గర్భం నుంచి దత్తుడు ఉద్భవించాడు. దత్తుని జన్మదిన విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఎక్కువమంది మార్గశిర పౌర్ణమినాడే పండుగ చేసుకుంటారు. ‘స్మృతి కౌస్తుభం’, ’మార్కండేయ పురాణం’ దత్తుని గురించి అనేక విషయాలను తెలియజేస్తున్నాయి.

నారదముని తన భక్తి ప్రపత్తులతో విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకున్నాడు. మెచ్చిన విష్ణువు వరం కోరుకోమనగా.. సత్వరూపం దర్శింపచేయమని అడిగాడు నారదుడు. అప్పుడు ‘బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఒకటిగా చేయగలిగితే నీ కోరిక తీరుస్తాను’ అన్నాడు విష్ణుమూర్తి. వెంటనే నారదుడు భూలోకానికి బయల్దేరాడు. తన ప్రయత్నంలో భాగంగా అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్లాడు. ఆ సమయంలో ముని ఆశ్రమంలో లేడు. ఆయన సతీమణి అనసూయ ఆతిథ్యమిచ్చింది. తర్వాత నారదుడు వైకుంఠం, కైలాసం, సత్యలోకాలకు వెళ్లినప్పుడు సందర్భవశాత్తూ అనసూయ పాతివ్రత్యం గురించి చెప్పాడు. అది విన్న త్రిమూర్తులు ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించాలనుకున్నారు.

భార్యల సూచనను అనుసరించి త్రిమూర్తులు బ్రాహ్మణ రూపంలో అత్రి మహాముని ఆశ్రమానికి వచ్చారు. తమకు ఆకలిగా ఉందని, వివస్త్రగా భోజనం వడ్డిస్తే తింటామని చెప్పారు. ఆశ్చర్యపోయిన అనసూయ ఈ విషయం భర్తతో చర్చించింది. మహా జ్ఞాని అయిన అత్రిముని సంగతి గ్రహించాడు. భార్యకు మంత్రోదకం ఇచ్చి వారిపై చల్లమన్నాడు. అనసూయ వారిపై మంత్రజలం చిలకరించగానే.. ఆ విప్రులు ఆరు నెలల పసిబాలలుగా మారిపోయారు. అప్పుడు అనసూయ వారికి స్తన్యమిచ్చి సంతృప్తిపరిచింది. అప్పుడే ఆశ్రమానికి వచ్చిన నారదుడు త్రిమూర్తులు శిశువులుగా మారిపోవడం చూశాడు. ఆ విషయాన్ని వారి సతీమణులకు తెలియజేశాడు. వాళ్లు నారదుని వెంట ఆశ్రమానికి వచ్చారు. బాలురు క్రీడించడం చూశారు. ఆ ముగ్గురూ తమ భర్తలేనని గ్రహించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను తమకు అప్పజెప్పమని అత్రిమునిని ప్రార్థించారు.

వరం కోరిన మునిపత్ని
అత్రిముని అనుజ్ఞతో ఆయన పత్ని అనసూయ.. బాలుర మీద మంత్రోదకం చల్లగానే వారు తిరిగి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా మారారు. అనసూయ పాతివ్రత్యానికి మెచ్చిన త్రిమూర్తులు ఆమెను వరం కోరుకోమన్నారు. దానికి అత్రి, అనసూయ దంపతులు త్రిమూర్తులే తమకు పుత్రుడిగా జన్మిస్తే సంతోషిస్తామని చెప్పారు. వారి ఆశీర్వాదం ఫలించి.. ఆ దంపతులకు మూడు తలలు, ఆరు చేతులతో పుత్రుడు జన్మించాడు. అతడే దత్తాత్రేయుడు. మధ్య శిరస్సు విష్ణువుది, కుడి శిరస్సు శివునిది, ఎడమ శిరస్సు బ్రహ్మది. దత్తుడి దేహంలో కుడి భాగం గురువు. ఎడమ భాగం భగవంతుడు. దత్తాత్రేయుని ఆరు చేతుల్లో- మంత్రాలకు ఆధారమైన జపమాల, సకల శాస్త్రాలకూ నిలయమైన డమరుకం, జ్ఞాన తేజస్సును ప్రసాదించే చక్రం, కమండలం, త్రిశూలం, శంఖం ఉంటాయి.

భగవంతుడు ఒక్కడే!
కలియుగానికి ముందు దత్తాత్రేయస్వామికి పదహారు అవతారాలు ఉన్నాయని వాసుదేవానంద సరస్వతీ స్వామి దత్తపురాణంలో వర్ణించాడు. దత్తుని ఉద్భవ గాథలు వివిధ రకాలుగా ప్రచారంలో ఉన్నాయి. వేద కాలంలో ఇంద్రాది దేవతలకు ప్రాధాన్యత ఉండేది. పురాణ కాలం నాటికి మూర్తిత్రయం ఏర్పడింది. ఈ ముగ్గురు మూర్తులూ భిన్నులు కాదు.. భగవంతుడు ఒక్కడే అనే వేద ప్రమాణాన్ని నిరూపించేందుకే దత్తోద్భవం జరిగింది- అంటారు ఆధ్యాత్మికవేత్తలు.

దత్తుని పాదముద్రలు
దత్తాత్రేయుడు సత్యాన్వేషణ చేసేందుకు చిన్న వయసులోనే ఇల్లు వదిలి వెళ్లాడు. ఉత్తర కర్ణాటకలో గానుగాపూర్‌గా వ్యవహరిస్తున్న పట్టణం దత్తునికి జ్ఞానోదయం కలిగిన ప్రాంతమని చెబుతారు. గుజరాత్‌లోని గిరినార్‌ పర్వత శిఖరంపై దత్తుని పాదముద్రలు నేటికీ దర్శనమిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.

ఆ స్వామి అవతారాలే!
దత్తునికి గోవులన్నా, శునకాలన్నా మిక్కిలి ప్రేమ. వేద కాలంలో శునకాలను అదృష్ట చిహ్నంగా భావించేవారు. దత్తుని వెంటనున్న నాలుగు శునకాలు నాలుగు వేదాలను ప్రతిబింబిస్తాయి. దత్త సంప్రదాయంలో శ్రీపాద వల్లభులు, నృసింహ సరస్వతి, అక్కల్కోటస్వామి, శ్రీ వాసుదేవానంద సరస్వతి, కృష్ణ సరస్వతి, తదితర యోగులను దత్తాత్రేయుని అవతారాలుగానే భావిస్తారు.
మేడిచెట్టు కింద కొలువయ్యాడు

దత్తాత్రేయుడు మేడిచెట్టు (ఔదుంబర వృక్షం) మొదట్లో ఉండటానికి ఇష్టపడతాడన్నది పురాణ వచనం. అందువల్లే ఈ చెట్టును భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ చెట్టు కింద కూర్చుని..
అనసూయాత్రి సంభూత దత్తాత్రేయ మహామతే
సర్వదేవాధిదేవ త్వం మమ చిత్తం స్థిరీకురు
సర్వ మంగళ మాంగళ్య సర్వాధివ్యాధి భేషజ
సర్వసంకట హారిం త్వం మమ చిత్తం స్థిరీకురు
సర్వ పాప క్షయకరః తాప దైన్య నివారణః
యోభీష్టదః ప్రభుః స త్వం మమ చిత్తం స్థిరీకురు

అంటూ దత్తాత్రేయుని స్తుతిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. యమదంష్ట్రలు అంటే యముడి దంతాలు లేదా మరణానికి సంబంధించిన సమయం. అలాంటి విపత్తును సైతం తుదముట్టిస్తాడని నమ్మి దత్తాత్రేయుని పూజిస్తారు.

సర్వ జీవులను ఉద్ధరించడమే అవతార లక్ష్యంగా గల దత్తాత్రేయుని మహిమను ‘సూత్ర పాఠ విచారం’ గ్రంథంలో చక్రధరుడు కీర్తించాడు. సంసారబంధనాల్లో చిక్కుకోకుండా దైవిక గుణాలతో అలరారడం అవధూత లక్షణం. ఆ స్వామి అందుకు ప్రబల నిదర్శనం. ఒక్క మాటలో చెప్పాలంటే… గురువుల్లో ఉత్తమ గురువు; ఆది, మధ్యం, అంతం లేని మహా అవధూత దత్తాత్రేయుడు. ఆ స్వామి జ్ఞాన దీపమై సన్మార్గాన్ని దర్శింపచేస్తాడు.