
( డిసెంబరు 4 – ఉన్నవ లక్ష్మీనారాయణ జయంతి )
ఇరవయ్యవ శతాబ్దారంభం నాటి భారతీయ పునరుజ్జీవన ఉషస్సులు కొత్త దారులు చూపించాయి. ప్రపంచం నలుమూలలా నాడు సంభవించిన పరిణామాల ప్రభావమూ ఇందుకు దోహదపడింది. మహా సామ్రాజ్యం జార్ రష్యా మీద చిన్న దేశం జపాన్ సాధించిన విజయం భారత స్వాతంత్య్రోద్యమ దృష్టికి పదును పెట్టింది. ఆ చారిత్రక పరిణామం తరువాత రష్యాలో వచ్చిన బోల్షివిక్ విప్లవాన్ని నాటి భారతీయులు సామాజిక మార్పులో మైలురాయిగా భావించారు. అలాంటి కాలం ఇచ్చిన మహనీయులలో ఒకరు ఉన్నవ లక్ష్మీనారాయణ. రాజకీయ, సంస్కరణోద్యమాలు ఒకవైపు, కొత్త దృష్టితో సాహిత్యోద్యమం మరొకవైపు సాగించిన బహుముఖ ప్రజ్ఞాశీలి ఆయన. బోల్షివిక్ విప్లవం, దాని ఆశయంగా చెప్పే శ్రామికవర్గాల ఉనికి అనే భావనలతో ఆయనే తెలుగు సాహిత్యంలో చిరస్మరణీయమైన నవల రాశారు. అదే మాలపల్లి.
లోతైన తాత్త్విక, సామాజిక, రాజకీయ నేపథ్యాలుంటే తప్ప మాలపల్లి వంటి నవల ఆ కాలంలో వెలువడడం సాధ్యపడేది కాదు. అందుకే ఆ నవలకు అంత పఠనీయత, ఖ్యాతి వచ్చాయి. ఉన్నవ గొప్ప సాహిత్యవేత్తగానే కాకుండా, గాంధేయవాదిగా, నిబద్ధతగల స్వాతంత్య్రం సమరయోధుడిగా కూడా తెలుగునాట చరిత్రకెక్కారు. తన కాలానికి తగ్గట్టు సంఘ సంస్కరణను ఆరాధించారు. దానికి అంకితమయ్యారు. ఆయన హరిజనోద్ధారకుడు. స్త్రీ విద్య, వితంతు వివాహాలు ప్రోత్సహించిన సమున్నత సంస్కర్త. రెండు భిన్నకోణాలైన కందుకూరి వీరేశలింగం సంస్కరణ ప్రభావం, గాంధీజీ జాతీయోద్యమ స్పృహ కూడా ఉన్నవ మీద కనిపిస్తాయి.
ఉన్నవ లక్ష్మీనారాయణ 1877 డిసెంబరు 4వ తేదీన గుంటూరు జిల్లా వేములూరుపాడులో జన్మించారు. తల్లిదండ్రులు శేషమ్మ, శ్రీరాములు. ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి ఎన్నో గ్రంథాలు చదివి సాహిత్యాభిలాషను పెంపొందించుకున్నాడు. గుంటూరులో 1900 సంవత్సరంలో యంగ్‌మెన్ లిటరరీ అసోసియేషన్ స్థాపించి ఎందరో యువకుల్లో సాహిత్యాభిలాషను పెంపొందించాడు. 1902లో గుంటూరులో వితంతు శరణాలయాన్ని స్థాపించాడు. అందుకు ప్రేరణ వీరేశలింగం. గుంటూరులో తొలి వితంతు వివాహాన్ని జరిపించి, ఆ కార్యక్రమానికి వీరేశలింగం గారినే అధ్యక్షునిగా తీసుకువచ్చారు. ఉన్నవ ఉపాధ్యాయునిగా, న్యాయవాదిగా కూడా పనిచేశారు. స్వరాజ్య పార్టీలో, భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి ఉద్యమించారు.
అప్పటి సమాజంలో బారిష్టర్ వృత్తికున్న విలువను గుర్తించి 1916లో ఐర్లాండ్ డబ్లిన్‌లో బార్‌ఎట్‌లా పూర్తి చేశాడు. 1917లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా చేరి ఉన్నవ లక్ష్మీనారాయణ మంచి పేరు ప్రతిష్ఠలు తెచ్చుకున్నాడు. గుంటూరులో స్త్రీ విద్య ప్రోత్సాహానికి 1922లో ‘శారదానికేతన్’ సంస్థ స్థాపించి ఎందరో బాలికలకు చదువుకొనే అవకాశం కల్పించాడు. ఇప్పటికీ ఆ సంస్థ బాలికల విద్యాసంస్థగా ప్రగతి పథంలో నడుస్తుంది. ‘పల్నాడు’ పుల్లరి సత్యాగ్రహానికి 1922లో నాయకత్వం వహించి అరెస్టయి రాయవెల్లూరు జైలుకు వెళ్ళాడు. 1923లో కాంగ్రెసు కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. నిబద్ధత గల స్వాతంత్య్రోద్యమ వీరుడిగా 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయ్యాడు. గుంటూరులో 1942లో క్విట్ ఇండియా సందర్భంగా చురుగ్గా పాల్గొని అరెస్టై జైలుశిక్ష అనుభవించాడు. సాహిత్యవేత్తగా ఉన్నవ ఉన్నత శిఖరాలు అధిరోహించినా ఉద్యమకారునిగా ఆయనకు చరిత్రలో ఉన్న స్థానం ఎంతటిదో గుర్తు చేసుకోవడం కూడా అవసరమే.
రష్యా బోల్షివిక్ విప్లవంతో స్ఫూర్తి పొందిన తొలి తెలుగు రచయితగా ఉన్నవ ఖ్యాతి గాంచారు. ఆ ప్రభావంతో 1921లో మాలపల్లి నవలకు శ్రీకారం చుట్టి 1922లో రాయవెల్లూరు కారాగారంలో ఉన్నప్పుడు పూర్తి చేశారు. దేశభక్తి; సంఘ సంస్కరణాభిలాషతో ఆ రచన సాగించారు. సమాజంలో సాంఘిక, ఆర్థిక అసమానతలు తొలగించి సమతా ధర్మాన్ని స్థాపించడమే నవల ఫలశ్రుతి. నిజానికి ఆయన ముందునుంచీ కుల వ్యవస్థను నిరసించాడు. ‘నాయకురాలు’, ‘బుడబుక్కల జోస్యం’, ‘స్వరాజ్య సోది’, భావతరంగాలు’ వంటి రచనలతో కూడా ఉన్నవ స్వాతంత్య్రోద్యమంతో పాటు సాహిత్యోద్యమంలో కూడా తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు.
గాంధేయవాదిగా, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడిగా, సంఘసంస్కర్తగా, గుంటూరు శారదానికేతన్ వ్యవస్థాపకుడిగా, తెలుగు నవలా సాహిత్య తాళికుడిగా గణననీయమైన కీర్తి ప్రతిష్ఠలు పొందిన ఉన్నవ వారి సతీమణి శ్రీమతి లక్ష్మీబాయమ్మ ఆయనకు చేదోడువాదోడుగా నిలిచి సహకరించింది. ఉన్నవవారు 1958 సెప్టెంబర్ 25వ తేదీన పరమపదించినా ఆయన తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయులు.





