ArticlesNews

అహోం రాజ వైభవాన్ని తెలిపే అస్సాంలోని మొయిదామ్స్!

57views

భారతదేశంలో కూడా పిరమిడ్‌ల లాంటి నిర్మాణాలు ఉన్నాయని మీకు తెలుసా..? ఈజిప్ట్.. పిరమిడ్‌లకు ప్రసిద్ధి చెందితే, మన దేశంలో కూడా శతాబ్దాల చరిత్ర కలిగిన, పిరమిడ్ లాంటి రాజ సమాధులు ఉన్నాయి. వాటినే అస్సాంలోని మొయిదామ్స్ అని అంటారు. ఇవి UNESCO ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు కూడా పొందాయి.

ఈ ప్రపంచ UNESCO దినోత్సవం సందర్భంగా.. భారతదేశంలో అంతగా తెలియని ఈ అద్భుతాన్ని గురించి తెలుసుకుందాం. అస్సాం యొక్క ఈ పిరమిడ్ల వారసత్వాన్ని “మొయిదామ్స్ : అహోం రాజవంశం యొక్క మట్టి దిబ్బ సమాధి వ్యవస్థ” అంటారు. అస్సాంలోని చరాయిదేవ్ జిల్లాలో ఉన్న ఈ భారీ నిర్మాణాలు 2024 జూలై 26వ తేదీన అధికారికంగా UNESCO ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడ్డాయి.

దీంతో.. కజీరంగా నేషనల్ పార్క్, మానస్ వైల్డ్‌లైఫ్ శాంక్చువరీ తర్వాత అస్సాం నుంచి UNESCO గుర్తింపు పొందిన మూడవ ప్రదేశంగా మొయిదామ్స్ నిలిచాయి. సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన ఈ ఘనత, ఈశాన్య భారతదేశానికి తొలిసారిగా దక్కింది.

మొయిదామ్స్ ఎందుకు అంత ప్రత్యేకమైనవి..?
స్థానిక తాయ్-అహోం ప్రజలు ఎంతో గౌరవించే చరాయిదేవ్‌లోని మొయిదామ్స్ అనేవి.. మట్టితో చేసిన భారీ దిబ్బలు. ఇవి ఈజిప్ట్, చైనాలోని పిరమిడ్‌లు, రాజ సమాధుల లాగే కనిపిస్తాయి. 13వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దాదాపు 600 సంవత్సరాలు పాటు.. అహోం రాజులు, రాణులు, గొప్ప వ్యక్తుల అంతిమ విశ్రాంతి స్థలంలో ఈ సమాధులు ఉండేవి.

మొదట వీటిని చెక్కతో కట్టినా, తర్వాత రాళ్లు, కాల్చిన ఇటుకలతో మళ్లీ నిర్మించారు. వీటి ఇంజనీరింగ్, ఆధ్యాత్మిక భావన అద్భుతం. ఈ సమాధుల్లో రాజ చిహ్నాలు, రాజుల వస్తువులు, కొన్నిసార్లు సేవకుల అవశేషాలు కూడా ఉండేవి. ప్రతి మొయిదామ్ పవిత్రమైన కొండలు, అడవులు, నీటి మధ్య ఉంటుంది. ఇది అహోం ప్రజల ప్రకృతి, దైవభక్తి, జ్ఞాపకాల తత్వాన్ని తెలియజేస్తుంది.

చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యత
13వ శతాబ్దంలో చైనా నుంచి వలస వచ్చిన తాయ్-అహోం ప్రజలతో ఈ నిర్మాణాలు మొదలయ్యాయి. చరాయిదేవ్ వారి మొదటి రాజధానిగా, అస్సాంలో రాజ సమాధుల సంస్కృతికి కేంద్రంగా మారింది. ఈ మొయిదామ్స్‌ను “ఆత్మల నివాసాలు”గా భావించేవారు. అహోం రాజుల దైవత్వాన్ని గౌరవించడానికి, మరణానంతరం వారి ఆత్మలు ప్రయాణించడానికి వీటిని నిర్మించారు. 20వ శతాబ్దంలో కొంత విధ్వంసానికి గురైనప్పటికీ.. భారత పురావస్తు శాఖ (ASI) మరియు అస్సాం రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాల ద్వారా ఈ ప్రదేశాలను పునరుద్ధరించి, రక్షించారు. దీనివల్ల వాటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రామాణికత గురించి తెలుసుకునేందుకు భవిష్యత్ తరాలకు అవకాశం లభించింది.

ప్రపంచ వారసత్వ గౌరవం
మొయిదామ్స్‌ను UNESCO జాబితాలో చేర్చడం వలన ప్రపంచ వారసత్వ ప్రదేశాల సంఖ్యలో.. భారతదేశం ఆరవ స్థానానికి చేరుకున్నట్లైంది. అంతేకాకుండా, ఈ ప్రత్యేకమైన సమాధి నిర్మాణ సంప్రదాయానికి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ (ICOMOS).. ఈ మొయిదామ్స్‌ను అసాధారణమైన సాంస్కృతిక వారసత్వానికి సాక్ష్యంగా, మానవ చరిత్రలోని ముఖ్యమైన దశలను సూచించే నిర్మాణంగా ప్రశంసించింది. ఈ గుర్తింపు భారతదేశం తన విభిన్నమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి చేస్తున్న ప్రయత్నాలకు నివాళితో పాటు.. ప్రపంచ వేదికపై ఈశాన్య భారతదేశానికి దక్కిన గర్వించదగిన అధ్యాయంగా పేర్కొనవచ్చు.