
2007 నవంబర్ 23 మధ్యాహ్నం లక్నో, వారణాసి, ఫైజాబాద్ జిల్లాల కోర్టుల్లో వరుసగా 6 బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో మొత్తం 18 మంది మరణించారు. 86 మంది గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన జరిగి నేటికి 18 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ దాడిలో దోషులుగా తేలిన ఇద్దరు ఉగ్రవాదులు.. తారిఖ్ కాస్మీ, మహమ్మద్ అఖ్తర్‌కు 2018 ఆగస్టు 27న ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.
కానీ ఒక సమయంలో.. ఈ ఉగ్రవాదులకు సమర్థనగా ‘రిహాయి మంచ్’ అనే సంస్థ ముందుకు వచ్చింది. కోర్టు దోషిగా నిర్ధారించిన ఉగ్రవాది తారిఖ్ కాస్మీ మరియు అతని సహచరులకు ఈ సంస్థ కేవలం న్యాయ సహాయం అందించడమే కాక, ఉగ్రవాదికి మద్దతుగా అనేక ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు, ప్రెస్ కాన్ఫరెన్స్‌లు కూడా నిర్వహించింది. ఈ సమయంలో ప్రత్యేక కోర్టు నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేస్తామని కూడా మంచ్ ప్రకటించింది.
అంతేకాదు.. సమాజ్‌వాదీ పార్టీ (SP) ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి.. కోర్టు పేలుళ్ల కేసులో నిందితులైన అనుమానిత ఉగ్రవాదులపై నమోదైన కేసులను వెనక్కి తీసుకునేలా రిహాయి మంచ్ ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే అఖిలేష్ ప్రభుత్వ ఆదేశంపై హైకోర్టు స్టే విధించింది.
2018 ఆగస్టు 27న బాంబు పేలుళ్ల కేసులో ఇద్దరు దోషులకు ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష విధించింది. దోషులుగా తేలిన వారిలో ఆజమ్‌ఘడ్ నివాసి అయిన యూనాని డాక్టర్ తారిఖ్ కాజ్మీ ఇంకా కశ్మీర్ నివాసి మహమ్మద్ అఖ్తర్ ఉన్నారు. కోర్టు జీవిత ఖైదు తీర్పు తర్వాత.. రిహాయి మంచ్ ఈ నిర్ణయాన్ని పక్షపాతంతో కూడినదిగా పేర్కొంటూ హైకోర్టుకు వెళ్తామని ప్రకటించింది.
‘రిహాయి మంచ్’ యూపీ కోర్టు పేలుళ్ల కేసులో మాత్రమే కాకుండా.. అనేక ఉగ్రవాద ఘటనల్లో నిందితులైన ఉగ్రవాదులకు సమర్థనగా ముందుకు వచ్చింది. అనుమానిత ఉగ్రవాదుల కుటుంబాలకు సహాయం చేసింది. భారత వ్యతిరేక మరియు పాకిస్తాన్ మద్దతు నినాదాలు చేసిన వారిని సన్మానించింది కూడా. ఈ వ్యాసంలో మనం ఈ అన్ని అంశాలపై చర్చిస్తాము. కానీ అంతకుముందు రిహాయి మంచ్ పుట్టుక గురించి తెలుసుకుందాం.
కోర్టు పేలుళ్ల కేసు తర్వాత ఏర్పడిన రిహాయి మంచ్
రిహాయి మంచ్ జననం యూపీ కోర్టు పేలుళ్ల కేసు సమయంలోనే జరిగింది. లక్నో, వారణాసి మరియు ఫైజాబాద్ కోర్టుల్లో న్యాయవాదులు, న్యాయవ్యవస్థనే లక్ష్యంగా చేసుకుని, ఇండియన్ ముజాహిదీన్ మరియు హర్కత్-ఉల్-ఎ-ఇస్లామీ (HuJI) వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన ఉగ్రవాదులు ఆరుచోట్ల పేలుళ్లు జరిపారు. ఇందులో 5 మంది న్యాయవాదులు, ఒక స్టాల్ విక్రేత మరియు ఇద్దరు గుమస్తాలతో (వకీళ్ల సహాయకులు) సహా మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
పేలుళ్ల తర్వాత న్యాయవాదులంతా కలిసి, ఈ ఘటనలో నిందితులైన అనుమానిత ఉగ్రవాదుల కేసును వాదించడానికి నిరాకరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా న్యాయవాదులు కఠిన వైఖరి తీసుకోవడంతో, నిందితుల కేసును వాదించడానికి ఎవరూ ముందుకు రాలేదు. సరిగ్గా ఈ సమయంలోనే మహమ్మద్ షోయబ్ అనే న్యాయవాది.. అనుమానిత ఉగ్రవాదులకు న్యాయ సహాయం అందించడానికి ముందుకు వచ్చాడు.
మహమ్మద్ షోయబ్.. ఈ యువకులను అకారణంగా ఇరికించారని వాదించారు. నిందితులకు మద్దతుగా ఈ పోరాటం చేయడానికి న్యాయవాది మహమ్మద్ షోయబ్‌కు రాజీవ్ యాదవ్ కూడా తోడయ్యారు. ఆ తర్వాత 2012లో రిహాయి మంచ్ పేరుతో ఈ సంస్థ ఏర్పడింది.
రాజీవ్ యాదవ్ అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ చేసే సమయంలోనే వామపక్ష విద్యార్థి సంఘం అయిన అఖిల్ భారతీయ ఛాత్ర సంఘ్ (AISA) లో చేరాడు. రిహాయి మంచ్ ఏర్పాటు చేసిన తర్వాత.. న్యాయవాది మహమ్మద్ షోయబ్, రాజీవ్ యాదవ్, షాహనవాజ్ ఆలం మరియు అనిల్ యాదవ్ తో పాటు ఇతర సహచరులతో కలిసి, ఉగ్రవాద కేసుల్లో అరెస్ట్ అయిన ముస్లింల కోసం కిందిస్థాయి నుంచి న్యాయస్థానాల వరకు పోరాటం సాగించారు.
2018 లో షాహనవాజ్ ఆలం మరియు అనిల్ యాదవ్ కాంగ్రెస్‌లో చేరారు. ఇక 2022లో రాజీవ్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా ఆజమ్‌ఘడ్ లోని నిజామాబాద్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ముస్లింలు కూడా అతన్ని తిరస్కరించారు.
ఎక్కువ మంది ముస్లింల ఓట్లు ఎస్పీ ముస్లిం అభ్యర్థి ఆలంబాదికే పడ్డాయి. రాజీవ్ యాదవ్‌కు కేవలం 1,119 ఓట్లు మాత్రమే దక్కడంతో.. అతడు డిపాజిట్ కూడా కోల్పోవడం జరిగింది. అయితే, అదే స్థానం నుంచి కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసిన రిహాయి మంచ్ సభ్యుడు అనిల్ యాదవ్‌కు 2297 ఓట్లు వచ్చాయి.
ఉగ్రవాదుల మద్దతులో ధర్నా ప్రదర్శనలు
2013 జూన్‌లో రిహాయి మంచ్ నాయకులు.. కోర్టు పేలుళ్ల కేసులోని అనుమానిత ఉగ్రవాదులను రక్షించాలని, వారిపై చర్యలు తీసుకున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ బయట నెల రోజులపాటు ధర్నా ప్రదర్శనలు చేశారు. ఈ ప్రదర్శనలో రిహాయి మంచ్ అధ్యక్షుడు మహమ్మద్ షోయబ్, ప్రధాన కార్యదర్శి ఇంకా ప్రతినిధి రాజీవ్ యాదవ్, మౌలానా జహంగీర్ ఆలం కాస్మీ, ఇండియన్ నేషనల్ లీగ్ జాతీయ అధ్యక్షుడు మహమ్మద్ సులేమాన్ తో సహా పలువురు పాల్గొన్నారు.
రిహాయి మంచ్, కోర్టు పేలుళ్ల కేసులో అనుమానిత ఉగ్రవాది ఖాలిద్ ముజాహిద్ మరణానికి పోలీసు, ఐబీ అధికారులే కారణమని పేర్కొంటూ.. వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది.
ఖాలిద్ ముజాహిద్ 2013 మే 18న ఫైజాబాద్ కోర్టులో హాజరైన తర్వాత.. లక్నో జైలుకు తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా అనారోగ్యంతో మరణించాడు. కానీ రిహాయి మంచ్ మాత్రం ఇందులో పోలీసు యంత్రాంగాన్ని బాధ్యులుగా పేర్కొంది.
కోర్టు దోషిగా నిర్ధారించిన ఉగ్రవాదిని సమర్థించడం
రిహాయి మంచ్.. ఉగ్రవాదులు ఖాలిద్ ముజాహిద్ మరియు జైలులో ఉన్న ఉగ్రవాది తారిఖ్ కాస్మీలు నిర్దోషులని, వారిని తప్పుగా ఇరికించారని పేర్కొంది. తారిఖ్ కాస్మీని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అనేక చోట్ల ధర్నా ప్రదర్శనలు నిర్వహించింది. అయితే, రిహాయి మంచ్ ఏ ఉగ్రవాదిని అయితే నిర్దోషిగా పేర్కొంటూ విడుదల చేయాలని డిమాండ్ చేసిందో.. అదే తారిఖ్ కాస్మీకి 2018 ఆగస్టు 27న కోర్టు దోషిగా నిర్ధారించి, జీవిత ఖైదు శిక్ష విధించింది. కోర్టు అతనితో పాటు జమ్మూ కశ్మీర్ నివాసి అయిన మహమ్మద్ అఖ్తర్‌ను కూడా దోషిగా భావించి జీవిత ఖైదు తీర్పు ఇచ్చింది.
రిహాయి మంచ్ ఒత్తిడితో కేసు ఉపసంహరణ
రిహాయి మంచ్ వల్ల పెరుగుతున్న ఒత్తిడి ఇంకా ముస్లిం బుజ్జగింపు విధానాల కారణంగా.. ఎస్పీ ప్రభుత్వం 2013 ఏప్రిల్ 24న కోర్టు పేలుళ్ల కేసులో నిందితుడైన ఉగ్రవాది తారిఖ్ కాస్మీపై నమోదైన కేసును వెనక్కి తీసుకుంది. అయితే ఆ తర్వాత అలహాబాద్ హైకోర్టు అఖిలేష్ ప్రభుత్వాన్ని మందలించి, ప్రభుత్వ ఆదేశంపై స్టే విధించింది. అంతేకాక వారి విధానం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా ఉంది కదా అని కూడా ప్రశ్నించింది.
రాంపూర్ సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై దాడి చేసిన ఉగ్రవాదులకు మద్దతు
2007 డిసెంబర్ 31 రాత్రి రాంపూర్‌లోని సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై ఆయుధాలు, హ్యాండ్ గ్రెనేడ్‌లతో సహా ఆరుగురు కంటే ఎక్కువ మంది ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 7 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఇంకా ఒక రిక్షా డ్రైవర్ మరణించాడు. కానీ ఈ ఉగ్రవాద దాడిని రిహాయి మంచ్ మాత్రం నిజమైనది కాదంటూ.. ఉద్దేశపూర్వకంగా ఉగ్రవాద దాడిగా (so-called terrorist attack) గా ప్రచారం చేసింది. రిహాయి మంచ్ ప్రధాన కార్యదర్శి రాజీవ్ యాదవ్.. దాడి తర్వాత అరెస్టైన అనుమానిత ఉగ్రవాదులను, వారి కుటుంబాలను నిస్సహాయులుగా చూపించారు.
అయితే అరెస్టయిన ఉగ్రవాదులలో ముంబైకి చెందిన ఫహీం అన్సారీ, ప్రతాప్‌గఢ్‌కు చెందిన కౌషర్ ఫారూఖీ ఇంకా సుహైల్‌లను నిర్దోషులుగా నిరూపించేందరకు రాజీవ్ యాదవ్ ప్రయత్నించారు. ఈ ఉగ్రవాదుల కుటుంబాల పరిస్థితిని ఉటంకిస్తూ.. వారు నిస్సహాయులు, బాధిత వ్యక్తులు అన్నట్లుగా చలించిపోయేలా రాజీవ్ యాదవ్ చిత్రీకరించారు.
అయితే 2019 నవంబర్ 2న రాంపూర్ కోర్టు నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధించింది. వారిలో పాకిస్తాన్ నివాసితులు ఇమ్రాన్ షెహజాద్, మహమ్మద్ ఫారూఖ్, మధుబనికి చెందిన సబాఉద్దీన్, రాంపూర్‌కు చెందిన షరీఫ్ అలియాస్ సుహైల్ ఉన్నారు.
అంతేకాక మురాదాబాద్ నివాసి జంగ్ బహదూర్‌కు జీవిత ఖైదు, ముంబైకి చెందిన ఫహీం అన్సారీకి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే బరేలీకి చెందిన గులాబ్ ఖాన్ మరియు ప్రతాప్‌గఢ్‌కు చెందిన కౌసర్ ఫారూఖీని.. సాక్ష్యాలు లేకపోవడం వలన విడుదల చేసింది. అంటే రిహాయి మంచ్ ఏ దాడిని అయితే కల్పిత దాడి అని సంబోధించిందో.. అదే కేసులో ఎన్‌ఐఏ-ఏటీఎస్ కోర్టు 2023 ఫిబ్రవరి 28న మరోసారి లష్కర్-ఎ-తయ్యబా ఉగ్రవాదులైన సబాఉద్దీన్ అలియాస్ సబా, ఫారూఖ్, ఇమ్రాన్ షెహజాద్ అలియాస్ అబు ఒషామాకు జీవిత ఖైదు శిక్ష విధించింది.
నిషేధిత సంస్థ పీఎఫ్ఐ (PFI) తో రిహాయి మంచ్ పేరు
2023లో రిహాయి మంచ్ పేరు నిషేధిత సంస్థ పీఎఫ్ఐ (PFI) తో ముడిపడింది. రిహాయి మంచ్ వ్యవస్థాపకుడు మహమ్మద్ షోయబ్‌ను ఉగ్రవాద సంబంధాల ఆరోపణలపై యూపీ ఎస్‌టీఎఫ్ లక్నో నుంచి అదుపులోకి తీసుకుని విచారించింది. అయితే విచారణ తర్వాత సాయంత్రానికి అతన్ని విడిచిపెట్టారు. ఆ సమయంలో ఏడీజీ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. పీఎఫ్ఐకి వ్యతిరేకంగా చేపట్టిన చర్యల నేపథ్యంలో.. విచారణ కోసం మహమ్మద్ షోయబ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
పాకిస్తాన్ విజయాన్ని జరుపుకున్న వారికి మద్దతు
రిహాయి మంచ్ ఉగ్రవాద నిందితులకు న్యాయ పోరాటం చేయడమే కాక.. భారత వ్యతిరేక ప్రకటనలు చేసిన ముస్లిం యువతకు కూడా మద్దతు ఇచ్చింది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్-2021లో దుబాయ్‌లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిచింది.
పాకిస్తాన్ విజయంపై జమ్మూ కశ్మీర్‌కు చెందిన ముస్లిం విద్యార్థులు ఆగ్రాలో సెలబ్రేట్ చేసుకుంటూ.. భారత వ్యతిరేక నినాదాలు చేశారు. ఇంకా పాకిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత పోలీసులు ఆర్బీఎస్ ఇంజనీరింగ్ కాలేజీ, ఆగ్రా విద్యార్థులు అర్షీద్ యూసుఫ్, ఇనాయత్ అల్తాఫ్ షేక్ మరియు శౌకత్ అహ్మద్ గనీలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
కానీ దేశ వ్యతిరేక ప్రకటనలు చేసిన ఈ యువకులకు మద్దతుగా రిహాయి మంచ్ అధ్యక్షుడు మహమ్మద్ షోయబ్ నిలబడ్డారు. విద్యార్థుల అరెస్టును అక్రమమని, అది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ.. ఏ దేశ ఆటగాడైనా బాగా ఆడితే ఎవరైనా అభినందించవచ్చని అన్నారు. అంతేకాక ఏం జరిగినా తాము విద్యార్థుల కోసం న్యాయ పోరాటం చేస్తామని కూడా ఆయన అన్నారు.
అక్రమ మత మార్పిడి నిందితుడు మౌలానా కలీమ్ మద్దతు
హిందువులను అక్రమంగా మత మార్పిడి చేసినందుకు దోషిగా తేలి, జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న మౌలానా కలీమ్ సిద్దిఖీకి రిహాయి మంచ్ అధ్యక్షుడు మహమ్మద్ షోయబ్ మద్దతు ఇచ్చారు. మౌలానా అరెస్టును వ్యతిరేకిస్తూ మౌలానా సిద్ధిఖీ ప్రతిష్టాత్మక ఇస్లామిక్ పండితుడని, కుట్ర చేసి ఆయన్ని ఇరికించారని మహమ్మద్ షోయబ్ అన్నారు. 2024లో లక్నోలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు అక్రమ మత మార్పిడి కేసులో మౌలానా కలీమ్ సిద్దిఖీతో సహా 12 మందికి జీవిత ఖైదు శిక్ష విధించింది.
రిహాయి మంచ్ చీఫ్ మహమ్మద్ షోయబ్ మాట్లాడుతూ.. మౌలానాను ఇరికించే ఆపరేషన్ బాధ్యతను ఏటీఎస్‌కు అప్పగించారని అన్నారు. ఆ ఏటీఎస్ ఒకసారి ఉగ్రవాదం పేరుతో, మరోసారి మత మార్పిడి పేరుతో నకిలీ అరెస్టులు చేస్తోందని ఆరోపించారు.
అనుమానిత ఉగ్రవాది సైఫుల్లాకు మద్దతు
భోపాల్-ప్యాసింజర్ రైలులో ఐఈడీ పేలుడు కేసులో నిందితుడైన అనుమానిత ఉగ్రవాది సైఫుల్లా ఎన్‌కౌంటర్‌పై కూడా రిహాయి మంచ్ చీఫ్ మహమ్మద్ షోయబ్ ప్రశ్నలు లేవనెత్తారు. 2017లో సైఫుల్లా ఎన్‌కౌంటర్ చేసిన విధంగానే.. 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఉగ్రవాదం, మత మార్పిడి పేరుతో అరెస్టులు చేస్తున్నారని ఆయన అన్నారు.
‘లవ్ జిహాద్’ చట్టంపై పరిణామాలు అనుభవించాల్సి వస్తుందనే హెచ్చరిక
యూపీలో చేసిన లవ్ జిహాద్ చట్టం కూడా రాజ్యాంగ విరుద్ధమని మహమ్మద్ షోయబ్ పేర్కొన్నారు. ఈ చట్టం పౌర హక్కులను ఉల్లంఘిస్తుందని మరియు సామాజిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేస్తుందని అన్నారు. యోగి ప్రభుత్వంపై దాడి చేస్తూ.. ప్రభుత్వం ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించి, ఓట్ల ధ్రువీకరణ చేయాలని చూస్తోందని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు అనుభవించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
సీఏఏ వ్యతిరేక అల్లర్లలో రిహాయి మంచ్ పేరు
లక్నోలో జరిగిన సీఏఏ వ్యతిరేక అల్లర్లలో కూడా రిహాయి మంచ్ అధ్యక్షుడు మహమ్మద్ షోయబ్ పేరు వినిపించింది. 2019 డిసెంబర్ 19న లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో మహమ్మద్ షోయబ్‌పై కేసు నమోదైంది. ఆ తర్వాత అతన్ని అరెస్ట్ కూడా చేశారు.
షోయబ్ దాదాపు ఒక నెల రోజులు జైలులో ఉన్నారు. హింస కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి రూ.63.37 లక్షల నష్టపరిహార నోటీసు అందుకున్న 28 మంది అల్లరిమూకల్లో.. షోయబ్ కూడా ఒకరు. ఈ అల్లర్లలో ఒక వ్యక్తి మరణించగా.. 16 మంది పోలీసులతో సహా 35 మందికి పైగా గాయపడ్డారు.
బెయిల్‌పై విడుదలైన సరిగ్గా 20 రోజుల తర్వాత.. మహమ్మద్ షోయబ్ తన సహచరులతో కలిసి లక్నోలోని ఘంటాఘర్ వద్ద నిషేధాజ్ఞలను ఉల్లంఘించి.. క్యాండిల్ మార్చ్ నిర్వహించారు. ఆ తర్వాత మరోసారి అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది.
బట్లా హౌస్ ఎన్‌కౌంటర్ 11వ వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమం
2019 సెప్టెంబర్ 20న రిహాయి మంచ్ లక్నోలో బట్లా హౌస్ ఎన్‌కౌంటర్ 11వ వార్షికోత్సవాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాజీ న్యాయమూర్తి బీడీ నఖ్వీ, సౌత్ ఆసియా హ్యూమన్ రైట్స్ డాక్యుమెంటేషన్ సెంటర్‌కు చెందిన రవి నాయర్ తో సహా రిహాయి మంచ్‌కు చెందిన పలువురు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని బట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన అనుమానిత ఉగ్రవాదులకు మద్దతుగా నిర్వహించారు.
‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదం చేసినందుకు సన్మానం
జేఎన్‌యూలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ మరియు భారత వ్యతిరేక నినాదాలు చేసిన కేసులో నిందితుడైన కన్హయ్య కుమార్‌ను.. రిహాయి మంచ్ సన్మానించింది. లక్నోలోని అంబేద్కర్ యూనివర్సిటీలో ‘మోదీ గో బ్యాక్’ అని నినాదాలు చేసిన విద్యార్థులను కూడా మంచ్ సన్మానించింది. మంచ్‌కు పాకిస్తాన్ పట్ల ప్రేమ గతంలో కూడా ఉప్పొంగింది. అధ్యక్షుడు మహమ్మద్ షోయబ్‌పై కూడా పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత తోటి న్యాయవాదులు షోయబ్ ముఖానికి నలుపు రంగు పూశారు.





