News

బాలికలకు “రాణి లక్ష్మీ బాయి” స్వీయ రక్షణ కార్యక్రమం

205views

పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల బాలికలకు స్వీయ రక్షణ అవసరమని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల బాలికల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మరక్షణ సామర్థ్యాలను పెంపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. సమగ్ర శిక్ష, రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ”రాణి లక్ష్మీ బాయి ” స్వీయ రక్షణ కార్యక్రమం సీతానగరం మండలం జోగింపేట కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో జరిగింది.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ.. “రాణి లక్ష్మీ భాయ్” స్వయం రక్షక కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించుకున్నామన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల బాలికలకు ఆత్మరక్షణ శిక్షణ అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరికీ ఆత్మరక్షణ అవసరమని, దాని ప్రాధాన్యతను బాలికలకు వివరించారు. విద్యతో పాటు ఆత్మరక్షణ నైపుణ్యాలు ఎంత ముఖ్యమో తెలిపారు. ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఎంత విద్య నేర్చినా ముందుగా మన ప్రాణాలను కాపాడుకునే తెలివితేటలను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఉద్భోదించారు. ఆత్మరక్షణలో నైపుణ్యాలు లేకపోతే ఎదురయ్యే సమస్యలను కలెక్టర్ విద్యార్థులకు అర్ధమయ్యేలా వివరించారు. . ఈ శిక్షణ కార్యక్రమాన్ని బాలికలు సద్వినియోగం చేసుకొని ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో తమ దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాలని కోరారు. శిక్షణలో భాగంగా విద్యార్థినులు కరాటే, జూడో వంటి ఆత్మరక్షణ పద్ధతులను ప్రదర్శించారు.

ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల బాలికల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మరక్షణ సామర్థ్యాలను పెంపొందించడం జరుగుతుందని సమగ్ర శిక్ష అధికారులు తెలియజేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాలికలకు భద్రతా చిట్కాలు మరియు సమయస్ఫూర్తి గురించి నేర్పించాలని విజ్ఞప్తి చేశారు.