News

స్వదేశానికి బంగ్లా చొరబాటుదారుల క్యూ

193views

ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమం పశ్చిమబెంగాల్‌లో అక్రమ వలసదారుల్లో దడ పుట్టిస్తోంది. అధికారిక పత్రాలను సమర్పించలేమని తెలిసి బంగ్లాదేశీయులు తమ స్వదేశానికి పరుగులు తీస్తున్నారు! దీంతో సరిహద్దులో ఒక్కసారిగా తాకిడి పెరిగింది. ‘మమ్మల్ని ఇంటికి వెళ్లిపోనివ్వండి’ అని సరిహద్దు భద్రత దళం (బీఎస్‌ఎఫ్‌) బలగాలను వేడుకుంటున్నవారు పెద్దసంఖ్యలో కనిపిస్తున్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హకీంపుర్‌ బీఎస్‌ఎఫ్‌ ఔట్‌పోస్టు ద్వారా వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నవారితో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. పిల్లాపాపలతో, మూటాముల్లె సర్దుకుని వారంతా అక్కడే నిరీక్షిస్తున్నారు. ఔట్‌పోస్ట్‌ నుంచి రోజుకు 150 నుంచి 200 మంది బంగ్లాకు తరలిపోతున్నట్లు బీఎస్‌ఎఫ్‌ అధికారులు తెలిపారు. మొదట్లో ఇలాంటివారిని పోలీసు స్టేషన్లకు తరలించేవారు. వందలమందిని ఉంచేందుకు సరిపడా స్థలం లేక ఇప్పుడు శిబిరాల్లో పెడుతున్నారు.

ముడుపులతో అన్ని రకాల కార్డులు
‘‘పేదరికం వల్ల మా దేశం నుంచి ఇక్కడికి వచ్చాం. నెలకు రూ.20,000 వరకు సంపాదించి, ఒక చిన్నగదిలో సర్దుకుని, మిగుల్చుకున్న డబ్బును ఇంటికి పంపేదాన్ని. ఇప్పుడు తిరిగి ఖుల్నాకు వెళ్లిపోవాలనుకుంటున్నాను’’ అని షహీన్‌ బీబీ అనే మహిళ తెలిపారు. అక్రమ వలసదారుల్లో చాలామందికి ఆధార్, రేషన్, ఓటరు కార్డులు ఉన్నాయి. దళారులకు ముడుపులు ముట్టజెప్పి ఇవన్నీ సంపాదించుకుంటున్నారు. ఎస్‌ఐఆర్‌ కింద పాత పత్రాలను సమర్పించాల్సి ఉండటం వారిలో గుబులు రేపుతోంది. కోల్‌కతా, హావ్‌డా పారిశ్రామిక ప్రాంతాల నుంచి అనేకమంది ఇప్పుడు సరిహద్దు బాటపడుతున్నారు. శిబిరాల్లో ఉంచినవారికి భోజన సదుపాయాన్ని బీఎస్‌ఎఫ్‌ కల్పిస్తోంది. మిగిలినవారు మాత్రం దాతలపై ఆధారపడాల్సి వస్తోంది. బెంగాల్లోకి వచ్చేందుకు రూ.5,000 నుంచి రూ.20,000 వరకు సమర్పించుకున్నామని పలువురు చెబుతున్నారు.