
‘అయోధ్య రామమందిరం పునాదిలో ఉపయోగించిన గ్రానైట్ దాదాపు 240 కోట్ల సంవత్సరాల పాతది, చాలా బలమైంది’ అని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్‌కు చెందిన సీనియర్ శాస్త్రవేత్త యోగేంద్రసింగ్ తెలిపారు.
దిల్లీ వేదికగా ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (ఐఐటీఎఫ్)లో అయోధ్య రామ మందిరం నమూనాను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్, కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ నిపుణుల సంయుక్త టీమ్ ప్రదర్శించింది. ఆలయం నిర్మాణ రహస్యాలను, నిర్మాణంలో వినియోగించిన బలమైన బండరాళ్ల సమాచారాన్ని సందర్శకులకు వారు వివరిస్తున్నారు.
‘ఈ మందిరం వేల ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా నిలిచేలా నిర్మాణ పనులు జరిగాయి. ప్రతి దిమ్మెను నిర్మాణ పనుల్లో ఉపయోగించే ముందు, దాని బలం, మన్నికను టెస్ట్ చేశారు’ అని యోగేంద్రసింగ్ వివరించారు. ‘‘ప్రతి బండరాయికి ఫ్రాక్చర్ టెస్టింగ్ చేశారు. జియో-మెడికల్ పారామితుల ఆధారంగా దాని లోపల ఏవైనా పగుళ్లు ఉన్నాయా అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు. బండరాళ్లకు కోర్ నమూనా పరీక్షలు చేశారు. ఇందులో ఆ రాళ్ల శాంపిల్స్‌ను సేకరించి, అన్ కన్‌ఫైన్డ్ కంప్రెసివ్ స్ట్రెంత్ పరీక్ష చేశారు. దీనివల్ల బండరాయి ఎంతటి ఒత్తిడిని తట్టుకొని నిలువగలదనే తేలుతుంది. అంతర్గత పగుళ్లను గుర్తించేందుకు వాటికి అల్ట్రాసోనిక్ స్పీడ్ పరీక్షలు చేశారు’’ అని నిర్మాణ ప్రత్యేకతలను కళ్లకు కట్టారు.





