ArticlesNews

పరమాత్ముని పట్టపురాణి

133views

( తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు )

శ్రీమహాలక్ష్మి పద్మావతీదేవిగా దివి నుంచి భువికి దిగి వచ్చి శ్రీనివాసుడి ఆగమన లక్ష్యాన్ని సంపూర్ణం చేసింది. ఆ ఆపద్బాంధవుడు తిరుమలలో అవతరించి భక్తులకు కొంగుబంగారమైతే, ఆమె తిరుచానూరులో ఆవిర్భవించి కరుణాలయగా కటాక్షిస్తోంది. శ్రీమహావిష్ణువు, శ్రీమహాలక్ష్మి ప్రతిరూపాలే పద్మావతీ శ్రీనివాసులు. వారి అనుబంధాన్ని భక్తకవులు పున్నమికీ వెన్నెలకి, సూర్యునికీ కిరణాలకి, కడలికీ అలలకి, పూలకీ పరిమళానికి మధ్య ఉన్న బంధంతో పోల్చారు. శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్తమాల్యద కావ్యంలో మరింత రమ్యంగా లక్ష్మీదేవి ధరించిన రత్నహారంలో విష్ణుదేవుడి సౌందర్యం, ఆ స్వామి అలంకరించుకున్న కౌస్తుభమణి దర్పణంలో లక్ష్మీదేవి సౌందర్యం పరస్పరం ప్రతిబింబిస్తూ ఉంటాయని అభివర్ణించాడు. పోతనామాత్యులు, అన్నమాచార్యులు ఆ పరమపావనిని ‘పరమాత్మ పట్టపురాణి’గా ప్రస్తుతించారు.

శ్రీదేవి తోడుగా ఉన్నందునే సప్తగిరీశుడు ‘శ్రీ’నివాసుడయ్యాడని, శౌర్యలక్ష్మిగా వక్షస్థలంలో కొలువై ఉన్నందునే ఆ లోకేశుడు లోకాల్ని సమర్థంగా సంరక్షిస్తున్నాడని, భాగ్యలక్ష్మిగా ఆ బ్రహ్మాండ నాయకుడిలో సగభాగమైనందునే భక్తజనులకు భోగభాగ్యాలను ప్రసాదిస్తున్నాడని అమ్మవారి ఉపాసకుల ప్రగాఢవిశ్వాసం. ఆ దేవదేవి ధ్యానంతో మానసిక ప్రశాంతతతో పాటు, ఇంద్రియనిగ్రహం సుసాధ్యమవుతాయంటారు భక్తులు. అమ్మవారు వెలసిన దివ్యధామం ‘శాంతినిలయం’గా ప్రసిద్ధం. శాంతితో పాటు తన భక్తుల్లో క్షమాగుణాన్నీ వృద్ధి చేసే శక్తిమతి ఆ పద్మావతి. అందుకే ఆ తల్లిని ‘తత్‌క్షాంతి సంవర్ధినీమ్‌’ అని స్తుతిస్తారు. తిరుచానూరులో కొలువైన అలమేలు మంగమ్మను దర్శనం చేసుకుంటేనే తిరుపతి యాత్ర పూర్తయినట్లని భక్తజనులు విశ్వసిస్తారు.

అన్నమయ్య మనవడు తాళ్లపాక చిన్నన్న పద్మావతి అమ్మవారి వైభవాన్ని ఓ తాళపత్రంలో సంపూర్ణంగా వివరించాడు. పద్మపురాణం ప్రకారం శ్రీనివాసుడు పన్నెండేళ్లు తన హృదయేశ్వరి కోసం ఈ పుణ్యస్థలిలో తపస్సు చేశాడు. ఆ తపోఫలంగా కార్తికశుక్ల పంచమి, శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రంలో తిరుచానూరు పద్మసరోవరంలో ఆ జగన్మాత పద్మావతిగా అవతరించింది. తీవ్రసాధనల ఫలంగానే జ్ఞానలక్ష్మి వరిస్తుందని స్వయంగా పరమాత్మే నిరూపించిన ఘట్టమిది. అందుకే సిరులతల్లి ఆవిర్భవించిన శ్రీకొలను, తిరుమల పుష్కరిణి అంతటి పరమపవిత్రం. తిరుచానూరు తీర్థక్షేత్రంలో ఆ కరుణాంతరంగ చతుర్భుజాలతో పద్మాసనియై దర్శనమిస్తుంది.

అమ్మవారి దేవాలయ విశాల ప్రాంగణం ఒకానొకప్పుడు శ్రీవారి ధాన్యాగారమట. ఆ దివ్యధామాన్ని అలమేలుమంగపట్నం, శ్రీశుకపురం అని కూడా పిలుస్తారు. కార్తికమాసంలో ఆ దేవదేవికి అంగరంగవైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. వేడుకల వేళ విశ్వజనని వాహనవైభవం వీక్షకులకు నయనానందకరం. శేషవాహనంపై అనంతలక్ష్మిగా, హంసవాహినియై సరస్వతిగా, కల్పవృక్షంపై కామితార్థ ప్రదాయినిగా… ఇలా రోజుకొక్క రూపంలో దర్శనమిస్తూ ఆ బ్రహ్మాండనాయకి భక్తుల్ని ధన్యుల్ని చేస్తుంది.