
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఒకే రోజు రెండు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాజకీయంగా కలకలం రేపారు. హర్యానాలో ఇటీవల పట్టుబడిన ‘వైట్ కాలర్’ టెర్రరిస్ట్ మాడ్యూల్‌లో డాక్టర్లు ఉండటంపై ఆయన స్పందిస్తూ, వారు ఆ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారో లోతుగా దర్యాప్తు చేయాలని సూచించారు.
“చదువుకున్న డాక్టర్లు ఈ దారి పట్టడానికి కారణాలేంటి? దీని వెనుక ఎవరున్నారు? అనే విషయాలపై సమగ్రమైన విచారణ జరిపి, అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది” అని అబ్దుల్లా అన్నారు. ఈ టెర్రరిస్ట్ మాడ్యూల్ అరెస్టుల నేపథ్యంలో మరో ‘ఆపరేషన్ సిందూర్’ లాంటిది జరుగుతుందేమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “గతంలో ఆపరేషన్ సిందూర్ వల్ల మనం సాధించింది ఏమీ లేదు. ఢిల్లీ పేలుళ్లలో మనవాళ్లు 18 మంది చనిపోయారు. పొరుగు దేశంతో సంబంధాలను మెరుగుపరుచుకోవడమే ఉత్తమం. స్నేహితులను మార్చుకోవచ్చు కానీ… పొరుగువారిని మార్చుకోలేమన్న వాజ్ పేయి వ్యాఖ్యలను ఈసందర్భంగా గుర్తు చేస్తున్నా” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. “ఉగ్రవాదుల కోసం కన్నీళ్లు కార్చడం ఆయనకు పాత అలవాటే. ఇకనైనా వారి తరఫున మాట్లాడటం ఆపాలి” అని బీజేపీ నేత తరుణ్ చుగ్ ఘాటుగా బదులిచ్చారు.





