NewsProgramms

నూతన విద్యా విధానంపై అవగాహన సదస్సు

126views

విద్యా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లాగరాయిలో నూతన విద్యా విధానం పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల విద్యాశాఖ ఇన్ఛార్జి కమిషనర్ మరియు ఎస్ ఎస్ ఏ స్టేట్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ డాక్టర్ వాడ్రేవు చిన వీరభద్రుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా అమలు జరగబోయే నూతన విద్యా విధానం (ఎన్. పి. ఈ) ఎన్నో కీలక అంశాలలో ముందడుగు అని శ్రీ చిన వీరభద్రుడు సోదాహరణంగా వివరించారు. అలాగే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యా ప్రమాణాల పెంపుదలకు రికార్డు స్థాయిలో బడ్జెట్ కేటాయిస్తూ, చిత్తశుద్ధితో పని చేస్తున్నదని ఆయన తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్న ఈ సదస్సులో తూర్పు గోదావరి జిల్లా ఎస్ ఎస్ ఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ విజయ భాస్కర్ పాల్గొని విద్యాబోధనలో విలువల ఆవశ్యకతను వివరించారు. అందులో ఉపాధ్యాయుల బాధ్యతలను కూడా గుర్తు చేశారు.

మరొక వక్త, విశ్రాంత తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మీదేవి మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల స్థాయిలో బోధించే ఉపాధ్యాయుడు తమ వృత్తితో మమేకమై బోధిస్తే విద్యార్థులు ప్రయోజకులుగా, ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దబడతారని తెలిపారు. అలా బోధించిన ఉత్తమ ఉపాధ్యాయుడు శ్రీ శామ్యూల్ గారిని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

విద్యా పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ శ్రీ బి సుధాకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు తన బోధనలో భారతదేశం యొక్క సాంస్కృతిక వైభవాన్ని పిల్లలకు వివరించాలని తెలిపారు. మాతృ దేశం పట్ల గౌరవము,  భక్తి కలిగిన పౌరులు దేశ అభ్యున్నతికి దోహద పడతారని, అలా జరిగిన నాడు భారతదేశం విశ్వగురు స్థానాన్ని అలంకరించగలుగుతుందని తెలిపారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.