News

వారంలో ఒకరోజు ‘సైక్లింగ్’ – ప్రకృతిని ఆస్వాదిస్తూ పల్లె దారుల్లో పయనం

216views

నేటి కాలంలో పని ఒత్తిడి, తీరికలేని జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరు సతమతమవుతున్నారు. వివిధ కారణాల వల్ల ప్రశాంతతను కోల్పోతున్నారు. దీంతో అందులోంచి బయట పడేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వారాంతాలను తమ అభిరుచికి అనుగుణంగా మార్చుకుంటున్నారు.

నిత్య జీవితంలో పని ఒత్తిడితో అనేకమంది శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో రోజులో ఎంతో కొంత సమయం ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కనీసం వారాంతంలోనైనా ప్రశాంతంగా దైనందిన చర్యలు ఉండేలా ప్రణాళిక వేసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పుడు దీన్నే కోనసీమ జిల్లా అమలాపురం పట్టణవాసులు ఆచరిస్తున్నారు.

ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం : అమలాపురంలో ఉన్నటువంటి ఉద్యోగులు, వ్యాపారులు, విశ్రాంత ఉద్యోగులు ఒక బృందంగా ఏర్పడి ప్రతి ఆదివారం, సెలవు రోజుల్లో దాదాపు 30 నుంచి 40 కిలోమీటరు (రాను, పోను) సైక్లింగ్ను చేస్తున్నారు. ఈ క్రమంలో వారానికి ఓ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అమలాపురం నుంచి అల్లవరం, పాశర్లపూడి, ముమ్మిడివరం, ముక్కామల తదితర ప్రాంతాలకు ప్రతి వారం ఓ వైపు గ్రామీణ ప్రాంత రహదారుల్లో సైక్లింగ్‌ చేస్తున్నారు. వెళ్లే దారులను ముందే నిర్ణయించుకుని ఉదయం అంతా ఒక ప్రదేశానికి చేరుకుని బయలుదేరుతారు. మిగిలిన రోజుల్లో స్థానిక ఎస్‌కేబీఆర్‌ కళాశాలలో నడక, వ్యాయామం చేస్తారు.

అల్పాహారం రుచులను ఆస్వాదిస్తూ : వారంలో ఒక్క రోజైనా సహజసిద్ధ ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటున్నారు వీరు. ఈ బృందంలో 40-60 ఏళ్లు పైబడిన వారు సైతం సభ్యులుగా ఉండటం గమనార్హం. సైక్లింగ్‌ చేసే సమయంలో మధ్యలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పురాతన హోటళ్లలో సంప్రదాయ అల్పాహారం రుచిని ఆస్వాదిస్తారు. ఒక 15 నిమిషాలు విరామం తీసుకుని తిరిగి ప్రయాణాన్ని కొనసాగిస్తారు. దారిమధ్యలో కనిపించే ప్రకృతి రమణీయ దృశ్యాలను చరవాణిలో బంధిస్తూ ప్రశాంత దారుల్లో ముందుకు సాగుతారు.

శారీరకంగా, మానసికంగా ఫిట్గా : సైక్లింగ్ బృందంలో ఒకరైన సత్యనారాయణరాజు దీనిపై మాట్లాడుతూ, నేదునూరుకు చెందిన తను ప్రస్తుతం అమలాపురంలో ఉంటున్నట్లు తెలియజేశారు. నాలుగేళ్ల క్రితం కొంతమంది స్నేహితులతో కలిసి సరదాగా వారాంతంలో సైక్లింగ్‌ ప్రారంభించామని అది తర్వాత కాలంలో అలవాటుగా మారిందని ఆనందం వ్యక్తం చేశారు. ఫలితంగా తమ ఆరోగ్యంలో సైతం మార్పు వచ్చిందని, కొత్త ఉత్సాహాన్ని పొందుతున్నామని తెలిపారు. ఇది తమలో నూతనోత్తేజం తీసుకువస్తుందని బృంద సభ్యులు పేర్కొంటున్నారు. శారీరకంగా, మానసికంగా ఫిట్గా మారేందుకు దోహదపడతుందని చెబుతున్నారు.