News

శబరిమల బంగారం లెక్కల్లో అవకతవకలు.. హైకోర్టు కీలక ఆదేశాలు

208views

అయ్యప్పస్వామి కొలువుదీరిన శబరిమల ఆలయంలోని విగ్రహాల బంగారం తాపడం బరువు తగ్గడంపై శుక్రవారం కేరళ హైకోర్టులో విచారణ జరిగింది. బంగారం లెక్కల్లో అవకతవకలు చోటుచేసుకున్నట్లు కనిపిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై క్రిమినల్‌ కేసు నమోదుచేసి, దర్యాప్తు చేయాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. అలాగే ఈ వివాదంపై ఇప్పటికే న్యాయస్థానం సిట్ ఏర్పాటు చేసి, నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దానిని బహిర్గతం చేయొద్దని పేర్కొంది.

అసలు ఏం జరిగిందంటే..? శబరిమలలో గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించారు. వాటిని సరిచేయించి కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తానని ఉన్నికృష్ణన్‌ అనే దాత తీసుకెళ్లారు. ఈ పనిని చెన్నైలోని ఓ సంస్థకు అప్పగించారు. 2019లో వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు 42.8 కిలోలుగా ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. అయితే, ఆ తాపడాలను తమ వద్దకు తెచ్చినప్పుడు బరువు 38.28 కిలోలు మాత్రమే ఉందని సదరు కంపెనీ తెలిపింది.

అంతేగాక, ఆలయం నుంచి తాపడాలను తొలగించిన దాదాపు 40 రోజుల తర్వాత వాటిని చెన్నైలోని కంపెనీకి అందించినట్లు తెలిసింది. ఈ పరిణామాలపై ఇప్పటికే హైకోర్టు పలు అనుమానాలు వ్యక్తంచేసింది. ఉన్నట్టుండి తాపడాల బరువు 4.524 కేజీలు తగ్గడాన్ని తీవ్రంగా పరిగణించింది. వీటిని తిరిగి అమర్చినప్పుడు ఎందుకు బరువును సరిచూడలేదని ప్రశ్నించింది. అలాగే ముందుస్తు అనుమతి లేకుండా ద్వారపాలక విగ్రహల బంగారు తాపడాలను మరమ్మతుల నిమిత్తం తొలగించడం పైనా ఆగ్రహం వ్యక్తచేసింది.