News

రాత్రికి రాత్రే దేవాలయం మాయం…

235views

తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలకు గానీ, హిందువులకు గానీ రక్షణ లేకుండా పోతోంది. రాత్రికి రాత్రే దేవాలయాలకు ముప్పు ఏర్పడుతోంది. తాజాగా పల్లడం సమీపంలోని శతాబ్దాల నాటి మాధేశిలింగం అనే ఆలయం రాత్రికి రాత్రే అదృశ్యమైంది. దీనిని కూల్చేసినట్లు చెబుతున్నారు. పల్లడం సమీపంలోని కొండపైనే ఈ పురాతన ఆలయం వుంది. ఈ స్థలాన్ని నమాజ్ కోసం వినియోగించడానికే ప్రభుత్వం ఇలా చేస్తోందని హిందువులు ఆరోపిస్తున్నారు.

అయితే… ఇది శివాలయం. HR & CE విభాగం నిర్వహణలోకి వచ్చింది.మంగళం ప్రభుత్వ పాఠశాల పక్కనే ఈ ఆలయం వుంది. అత్యంత పురాతన శివాలయం కావడంతో చాలా మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా అమావాస్య, ప్రదోషం, పౌర్ణమి లాంటి పవిత్ర రోజుల్లో ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. అయితే కూల్చేసిన ఆలయాన్ని కూల్చేశారన్న వార్త తెలుసుకొని పల్లడం సామాజిక కార్యకర్త అన్నాదురై తన బృందంతో వచ్చి, అక్కడి స్థలాన్ని పరిశీలించారు. ‘‘ఈ ఆలయం అత్యంత పురాతనమైంది. చారిత్రక, ఆధ్యాత్మికంగా గొప్ప క్షేత్రం. మంగళం కొండ కూడా అత్యంత పురాతనం. శివుడు అనేక వేల సంవత్సరాలుగా ఇదే కొండపై వుంటున్నాడు.’’ అని పేర్కోన్నారు.

అయితే..HR & CE శాఖపై అన్నాదురై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి పురాతన ఆలయాన్ని నిర్లక్ష్యం చేశారని, హాలులో చెద పురుగులు పట్టినా, పట్టించుకోలేదని, సరైన నిర్వహణే లేదని, దీంతో పూజలకు కూడా చాలా కష్టమైపోతోందని అన్నారు.ఆధ్యాత్మిక క్షేత్రాలను ప్రోత్సహించాల్సిన ఈ శాఖ, నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు.

సంవత్సరాలుగా అసలు నిర్వహణే లేదని, అలాంటిది ముందస్తు నోటీసు లేకుండా కూల్చేయడం దిగ్భ్రాంతికరమని అన్నారు. అయితే అర్చకుని ప్రకారం పునర్నిర్మాణం కోసమే కూల్చేశారని అంటున్నారు. అయినా సరే… దీనికి సంబంధించిన నిర్మాణ పనుల ఆనవాళ్లు కానీ, రిపోర్టులు కానీ ఏవీ కూడా ఆ శాఖ వద్ద లేనేలేవు. ఉద్దేశపూర్వకంగానే HR & CE విభాగం చేస్తోందని, దీనిని పునర్నిర్మించడానికి తక్షణమే చర్యలకు ఉపక్రమించాలన్నారు. సంప్రదాయం ప్రకారం పునరుద్ధరణ చర్యల్లో భాగంగా కుంభాభిషేకం నిర్వహించాలని సూచించారు. అలాగే ఆలయ పునరుద్ధరణ అన్న అంశమే నిజమైతే.. వెంటనే ఓ నోటీసు అతికించి, భక్తులకు కచ్చితమైన సమాచారం ఇవ్వాలని, అదేమీ లేదని మండిపడ్డారు.

మరో వైపు ఈ ఘటనను హిందూ మున్నాని సంస్థ కూడా తీవ్రంగా ఖండించింది. ఇంతటి ముఖ్యమైన అంశంపై HR & CE శాఖ మౌనంగా వుందని, దీనిని ఖండిస్తున్నామని ప్రకటించింది. 600 సంవత్సరాల పురాతనమైన ఆలయం పక్కన వున్న భూమిని దర్గా నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంది.
హిందూ మున్నాని రాష్ట్ర అధ్యక్షుడు కాదేశ్వర సుబ్రమణియన్ మాట్లాడుతూ, “లోటస్ పాండ్ వద్ద ఉన్న ప్రసిద్ధ ఆలయం కొండపై ఉంది. భక్తులు ప్రతిరోజూ దీనిని సందర్శిస్తారు. దర్గా నిర్మించడానికి కొంతమంది ముస్లింలు ఆక్రమించుకోవడానికి చూస్తున్నారు. ఇప్పుడు చిన్న నిర్మాణం చేసి, దానిని ప్రార్థనా స్థలంగా వినియోగిస్తున్నారు. క్రమంగా దానిని శ్మశానవాటికగా మార్చారు. ఆకుపచ్చ జెండాను ఎగరేశారు. నమాజ్ చేయడం కూడా ప్రారంభించారు.దీంతో హిందూ భక్తులకు సమస్యలు వస్తున్నాయి. ఇది మతపరమైన అంశం. ఫిర్యాదులు చేసినా, అధికారులు పట్టించుకోవడం లేదు.’’ అని మండిపడ్డారు.