News

పుణ్యక్షేత్రాలకు భారత గౌరవ్‌ ప్రత్యేక రైళ్లు

237views

పుణ్యక్షేత్రాలు సందర్శించే యాత్రికుల సౌకర్యార్థం నవంబరులో రెండు భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సౌత్‌ స్టార్‌ రైల్‌ డైరెక్టర్‌ విఘ్నేష్‌ తెలిపారు. విజయవాడ బెంజిసర్కిల్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టూర్‌ ప్యాకేజీ వివరాలు వెల్లడించారు.

తమిళనాడు, కేరళ దేవాలయాల యాత్ర నవంబరు 16న ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ యాత్రలో దేవాయాలు, పంచద్వారక, మహదేవ్, జ్యోతిర్లింగాలు దర్శించుకోవచ్చన్నారు. తిరుకడైయూర్, చిదంబరం, అరుణాచలం, తిరుచ్చి, తంజావూర్, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరువనంతపురం, చొట్టనిక్కర, గురువాయూర్‌ తదితర ప్రాంతాలు సందర్శిస్తుందన్నారు. ప్రదోషం రోజు చిదంబరం నటరాజు దర్శనం, మాస శివరాత్రికి అరుణాచలం శివుని దర్శనం, అమావాస్య రోజు కావేరీనది ఒడ్డున పిండ తర్పణం చేసుకోవచ్చని తెలిపారు.

భోజనం, వసతి, బస్సు, ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌తో కలిసి టికెట్‌ ధర స్లీపర్‌ తరగతిలో ఒకొక్కరికీ రూ.19,950, థర్డ్‌ ఏసీలో రూ.29,750, సెకెండ్‌ ఏసీలో రూ.37,750, ఫస్ట్‌ ఏసీలో రూ.42,950 ఉంటుందన్నారు. మరో యాత్ర నవంబరు 26న ప్రారంభమవుతుందని ఈ యాత్రలో పంచ ద్వారక, నిష్కలంక మహాదేవ్‌ జ్యోతిర్లింగాల దర్శనం ఉంటుందని ఇందులో ద్వారకానాథ్, కంక్రోలి ద్వారక, బేట ద్వారక, సోమనాథ్, నాగశ్వర్, నిల్కలంక మహాదేవాలయంతో పాటు యాదగిరి, స్టాట్యూ ఆఫ్‌ ఈక్విటీ, స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ తదితర ప్రాంతాలు సందర్శించవచ్చన్నారు.

10 రోజుల ఈ యాత్రలో టికెట్‌ ధర థర్డ్‌ ఏసీలో రూ.41,150, సెకెండ్‌ ఏసీలో రూ.53,250, ఫస్ట్‌ ఏసీలో రూ.63 వేలు ఉంటుందన్నారు. గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌ రైల్వేస్టేషన్లలో నిలుస్తుందని చెప్పారు. ఈ ప్రత్యేక రైలు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో లేదని రిజర్వేషన్ల కోసం ఫోన్‌ నంబరు 9355021516లో సంప్రదించాలని కోరారు. ఆన్‌లైన్‌లోనూ ‘టూర్‌లైమ్స్‌’ వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు.