
అమ్మానాన్నలు, గురువు తరవాత అతిథిని దైవస్వరూపంగా భావించడం మన సంప్రదాయం. సర్వకాల సర్వావస్థల్లోనూ అతిథులను సేవించమంటుంది భారతీయ సంస్కృతి. తల్లిదండ్రులు, గురువు నిత్యం మనతో ఉండి మన ఉన్నతికి మార్గదర్శకులవుతారు కాబట్టి వారిని సేవించుకోవడంలో అర్థముంది. మరి అనుకోకుండానో, పని మీదో మన ఇంటికి వచ్చి ఒక పూటో, ఒక రోజో మనతో గడిపి వెళ్లిపోయే అతిథి మనకు దైవస్వరూపం ఎందుకు అవుతాడు?
సద్భావన, సత్సంకల్పం నిండిన వ్యక్తి ఏ కారణంగా ఇంటికి వచ్చినా సగౌరవంగా ఆహ్వానించాలి. ఉన్నంతలోనే ఆతిథ్యమిచ్చి, సత్కరించాలి. అప్పుడా అతిథి సంతుష్టితో ఆ కుటుంబానికి అంతా మంచి జరిగేలా ఆశీర్వదించమని భగవంతుణ్ని వేడుకుంటాడు. అతిథిలో ఉన్న పరమాత్మ సంతృప్తి చెంది మనం తెలిసో తెలియకో చేసిన కర్మలను క్షమిస్తూ మనకు దీవెనలు అందిస్తాడు. జగద్గురు ఆది శంకరాచార్యులు భిక్ష నిమిత్తం ఒక ఇంటికి వెళ్తారు, నిరుపేద కుటుంబం అది. అతిథికి ఏమీ పెట్టలేని నిస్సహాయ పరిస్థితిలో, ఉన్న ఒక్క ఉసిరికాయను భిక్షగా వేసి దీనంగా నిలుచుంటుందా ఇల్లాలు. ఆమె స్థితిని అర్థం చేసుకున్నారు శంకరాచార్యులు. అంతటి పేదరికంలోనూ తన దగ్గర మిగిలిన ఆ ఒక్క ఉసిరికాయను కూడా తనకు అర్పించిన ఆమె ఆతిథ్యానికి సంతృప్తి చెందుతారు. ఆమెకు సకలైశ్వర్యాలు అనుగ్రహించమని సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మిని వేడుకుంటారు. ఆ మాత అనుగ్రహించి ఆ పేదరాలి ఇంట కనకధారను కురిపించిందట! అందుకే అతిథిని దైవస్వరూపంగా భావించి ‘అతిథి దేవోభవః’ అన్నారు.
పూర్వకాలంలో గృహస్థులు అతిథుల రాకకోసం ఎదురు చూసేవారు. ఎందుకంటే మన స్థితిగతులు ఏమీ ఎరుగని, ఎలాంటి పరిచయమూ లేని, మన నుంచి ఆహ్వానం లేకుండానే ఇంటికి వచ్చిన వ్యక్తిని దైవసందేశమేదో మనకు అందించడానికి వచ్చిన దేవదూతగా భావించేవారు. తమకు ఉన్నంతలోనే ఉచిత రీతిలో వారిని సత్కరించేవారు. ఆ ఆతిథ్యానికి సంతోషించి ‘దైవానుగ్రహ ప్రాప్తిరస్తు’ అని దీవిస్తూ అతిథి వెళ్తుంటే కుటుంబమంతా కలిసి తృప్తిగా సాగనంపేవారు. అపరిచిత వ్యక్తి అతిథిగా వచ్చినప్పుడు వారికి సేవ చేయడం వల్ల మనలో అహంకారం తగ్గి వినయం అలవడుతుంది. అందుకే పిల్లలకూ చిన్నప్పటి నుంచి అతిథి మర్యాదలు అలవాటు చేయాలంటారు పెద్దలు.
చతుర్వేద సారాన్ని నిత్యజీవితంలో పాటించే విధంగా మనల్ని తీర్చిదిద్దే తల్లి, తండ్రి, గురువు, అతిథులు సాక్షాత్తూ చతుర్ముఖ బ్రహ్మ స్వరూపులే. తల్లీ తండ్రీ గురువు ఉన్నత విలువలతో కూడిన మన జీవన గమనానికి రథసారథులైతే, ఆ ప్రయాణంలో దైవసంకల్ప వెలుగులు నింపడానికి మెరుపులా వచ్చి మాయమయ్యే వారు అతిథులు. వచ్చిన వ్యక్తి కుబేరుడైనా, కుచేలుడైనా… సమానంగా చూడాలి, స్వాగతించాలి, సత్కరించాలి. వారిలో కొలువున్న దైవత్వాన్ని దర్శించాలి. మన దేశాన్ని చూడటానికి మన సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకోవడానికి వచ్చే విదేశీయుల పట్ల ఇంతే మర్యాదతో వ్యవహరించాలి. ‘అతిథి దేవోభవః’ అన్న మాటలోని సందేశం అదే!





