
ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, కేదార్‌నాథ్‌ల ప్రసాదాన్ని 140 దేశాల్లోని భక్తులకు ఇండియా పోస్టు ద్వారా చేర్చేలా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. స్పీడ్ పోస్టు ద్వారా కనిష్ఠంగా 24 గంటలు, గరిష్ఠంగా 72 గంటల్లో ప్రపంచంలోని ఏ దేశానికైనా ఈ ప్రసాదం చేరనుంది. ప్రస్తుతం దేశంలో ప్రసాదం పంపిణీని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలో విదేశాలకు అందించేందుకు చర్యలు చేపడతామని బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) ఛైర్మన్ హేమంత్ ద్వివేది తెలిపారు. పోస్టు ద్వారా పంపే బాక్సులో గంగా జలం, పంచమేవ ప్రసాదం, బద్రీనాథ్‌కు చెందిన తులసి, కేదార్‌నాథ్‌కు చెందిన రుద్రాక్ష, బద్రీ విశాల్ స్వామికి సంబంధించిన తులసి మాల, రెండు ధామాలకు చెందిన హారతుల పుస్తకం, బద్రీనాథ్‌కు చెందిన చందనం, కేదార్‌నాథ్ విభూతి, చేతికి కట్టుకునే పవిత్రమైన దారం, తలపాగా, పటిక బెల్లం ప్రసాదం, బద్రీనాథ్, కేదార్‌నాథ్ నాణేలు ఉంటాయి. ఈ మొత్తం కాకుండా కేవలం తులసి, చందనం, ప్రసాదం మాత్రమే తెప్పించుకోవచ్చు. బీకేటీసీ కార్యాలయాలను సంప్రదించిగానీ, www.badrinath-kedarnath.gov.in వెబ్‌సైట్‌ద్వారాగానీ ఆర్డరు చేయవచ్చు.





