News

ఖలిస్థాన్‌ వేర్పాటువాదులకు కెనడా నుంచే నిధులు

199views

ఖలిస్థాన్‌ వేర్పాటువాద సంస్థలకు తమ దేశంలోనే నిధులు అందుతున్నాయని కెనడా తొలిసారిగా అంగీకరించింది. ‘‘అసెస్‌మెంట్‌ ఆఫ్‌ మనీలాండరింగ్, టెర్రరిస్ట్‌ ఫైనాన్సింగ్‌ రిస్క్‌స్‌ ఇన్‌ కెనడా 2025’’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. ఇంటర్నేషనల్‌ సిక్‌ యూత్‌ ఫెడరేషన్, బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌ వంటి ఖలిస్థాన్‌ వేర్పాటువాదులతో పాటు, హమాస్, హెజ్‌బొల్లాలు కెనడాలోని వ్యక్తులు, సంస్థల నుంచి ఆర్థిక సాయాన్ని పొందుతున్నాయని వెల్లడించింది. ‘‘ఈ ఉగ్రసంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగించడానికి ఏకంగా ప్రభుత్వంలోని కొన్ని వర్గాల నుంచి, క్రిప్టో కరెన్సీల రూపంలో నిధుల్ని సేకరిస్తున్నాయి. దాతృత్వ, లాభాపేక్షలేని సంస్థల(ఎన్‌పీవో) ద్వారా నిధులు సేకరిస్తూ వాటిని ఉగ్ర కార్యకలాపాలకు వినియోగిస్తున్నాయి. కొందరు వ్యక్తులు కూడా వీటికి డబ్బు సమకూరుస్తున్నారు’’ అని నివేదిక వెల్లడించింది. ఖలిస్థాన్‌ వేర్పాటువాదులు కెనడాతో సహా అనేక దేశాల నుంచి ఆర్థిక సాయాన్ని పొందుతున్నారన్న అనుమానాలు ఉన్నాయి. కెనడా అండదండలతోనే ఖలిస్థాన్‌ వేర్పాటువాదులు చెలరేగిపోతున్నారని భారత్‌ చేస్తున్న ఆరోపణలకు ఈ నివేదిక ద్వారా మరింత బలం చేకూరింది.