News

విఠల్ భాయి పటేల్ కు ఘన నివాళి

195views

సర్దార్ పటేల్ సోదరుడు విఠల్ భాయి పటేల్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (బ్రిటిష్ ఇండియాలో నేటి పార్లమెంట్కు సమాన మైనది) స్పీకర్ గా ఎన్నికై ఈ సంవత్సరానికి (2025) వందేళ్లు వూర్తయింది. ఈ సందర్భంగానే ఢిల్లీ శాసనసభ రెండు రోజుల – అఖిల భారత సభాపతుల సమావేశాలు ఏర్పాటు చేసింది.

ఆ కాలంలో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకర్గా (అప్పుడు అధ్యక్షుడు అనేవారు) ఎన్నికైన తొలి వ్యక్తి విఠల్ భాయి పటేల్, వందేళ్ల క్రితం విఠల్ భాయి ఏర్పరిచిన సభా సంప్రదాయాలనే నేటికీ దేశంలో అనుసరిస్తున్నాం. ఆయన రెండు పర్యాయాలు ఆ పదవికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటయిన స్పీకర్ల సమావేశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరంభించారు.

విఠల్ భాయి సెప్టెంబర్ 27,1873న జన్మించారు. ఇంగ్లండ్లో న్యాయశాస్త్రం చదివిన తరువాత బొంబాయి వచ్చి న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఆయన 1912లో బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిలు, 1918లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు ఎన్నికయ్యారు. 1924లో మరొక దఫా ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదా సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు (బొంబాయి నగరం నుంచి) ఎన్నికయ్యారు. ఆగస్ట్ 22, 1925న సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు తొలి భారతీయ స్పీకర్గా పదవీ బాధ్యతలు చేపట్టారు. సహాయ నిరాకరణోద్యమాన్ని గాంధీజీ ఆరంభించడం, ఆయనే రద్దు చేయడం నచ్చని అనేక మందిలో విఠల్ భాయి ఒకరు. చౌరీచౌరా ఉదంతంతో గాంధీజీ మనస్తాపం చెందిన సహాయ నిరాకరణోద్యమాన్ని రద్దు చేశారు. దీనితో సుభాశ్ చంద్ర బోస్, మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్ వంటివారు గాంధీజీతో విభేదించారు. తరువాత 1923లో స్వరాజ్య పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అయితే స్వరాజ్య సమరంలో జాతీయ కాంగ్రెస్ తో కలిసే పనిచేశారు.