
భారతదేశ చరిత్ర ఔన్నత్యం గురించి తెలిసినా, చిరకాలం వలస దేశంగా ఉంచాలనుకుంది ఇంగ్లండ్. మీరు బానిసత్వంలోకి రావడానికి మీ గతమే కారణమన్న అభిప్రాయం కలగచేయడానికి చాలా చేశారు. ఆర్యుల రాక సిద్ధాంతం అందులో ఒకటి. ఇవే కాకుండా కొన్ని దురాచారాలను చూపించి మీ గతమంతా వాటితోనే నిండి ఉందన్న వాదన లేవదీశారు.
సతీసహగమనం అలాంటి వాటిలో ఒకటి. నిజంగానే సతి అనే దురాచారం ఎంతో ఘోరమైనది.. అమానుషమైనది. కానీ ఇది ఇంగ్లిష్ ప్రభుత్వం చూపించిన స్థాయిలో బ్రిటిష్ ఇండియాలో ఉందా? లేదనే అంటున్నారు సతీశ్ ఝంఝన్వాలా, ఆనంద్ ముఖర్జీ. సతీ సహగమనం ఆచారం పేరుతో భారతీయ చరిత్ర నిండా ఆంగ్లేయులు కమురు కంపును నింపారని ఆ ఇద్దరు రచయితలు తేల్చారు. ‘సతి: ది మిత్ ఆఫ్ విడో బర్నింగ్ ఇన్ బ్రిటిష్ ఇండియా’ అనే పుస్తకంలో పలు వివరాలు ఇచ్చారు. సతి ఆచారం గురించి బ్రిటిష్ వారు ఇచ్చిన కథనాలను ఈ పుస్తకం సవాలు చేసింది. సతి ఆచారం గురించి బ్రిటిష్ ఇండియాలో అతిశయోక్తులు చెప్పారని, వివరాలను వక్రీకరించారని ఆ రచయితలు పేర్కొన్నారు.
రాజా రామ్మోహన్ రాయ్ ఉద్యమం మేరకు విలియం బెంటింక్ ఈ దురాచారాన్ని నిషేధించాడని చరిత్ర చెబుతోంది. ఈ నిషేధానికి కావలసిన ఆధారాలను వారు పురాణాల నుంచి, జానపద కథల నుంచి తీసుకున్నారని రచయితలు చెబుతున్నారు. యాజ్ఞవల్క్య, మనుస్మృతులను కూడా సంప్రదించినట్టు చెప్పుకున్నారు. నిజానికి ఆ రెండు స్మృతులు సతి ఆచారాన్ని మత అనివార్యతగా పేర్కొనలేదు. సతి ఆచారం గురించి ఈ రెండు స్మృతులు గట్టిగా చెప్పి ఉంటే, వితంతువులకు నిబంధనలు చెప్పవలసిన ఏం ఉంటుందని రచయితలు ప్రశ్నించారు. ఆ రెండు స్మృతులు భర్త పోయిన స్త్రీలు సహగమనం చేయడం కంటే వారు సన్యాసం స్వీకరించడం లేదా పునర్ వివాహం చేసుకోవచ్చునని కూడా సూచించా యంటారు ఆ ఇద్దరు రచయితలు. కాబట్టి సతి గురించి ఇంగ్లిష్ అధికారులు చేసిన వక్రీకరణలను ఈ ఇద్దరు పూర్తిగా నిరాకరించారు. దీని ఉద్దేశం ఒకటే- రాజకీయ కారణం అని కూడా తేల్చారు.
1815-1828 మధ్య కలకత్తా నగరంలో వందలాది సతీ సహగమనాలు జరిగాయని చెప్పడాన్ని కూడా ఈ పుస్తకంలోని రెండో అధ్యాయం సవాలు చేసింది. ఆ గణాంకాలను బట్టే 1829లో సతీ సహగమన నిషేధ చట్టం తీసుకువచ్చారని చెబుతారు. ఆ రెండు సంవత్సరాల మధ్య వందలాది సహగమనాలు జరిగాయనడమే అతిశయోక్తి అని, సరైన ఆధారాలు కూడా లేవని ఆ రచయితలు చెప్పారు. అలాంటి చట్టం ఒకటి తీసుకురావడానికి ఈ కథలన్నీ అల్లారని వారు వాదించారు. ఏ విషయం గురించి భారతీయులకు చెప్పాలన్నా మొదట ఆంగ్లేయులు సతి గురించి ప్రస్తావించేవారని చెప్పే పలు ఆధారాలను వారు ప్రస్తావించారు. వలస పాలన కొనసాగింపును అడ్డుకోకుండా భారతీయుల గతమంతా అనాగరికమే అని చెప్పడానికి ఇదంతా వ్యూహాత్మకంగా చేశారని రచయితలు ఆరోపించారు. భారతదేశంలో జరిగిన చిట్టచివరి సతీ సహగమనం అంటూ 1987 నాటి రూప్ కన్వార్ ఉదంతాన్ని కూడా రచయితలు తీసుకువచ్చారు.
అప్పుడే సతీ ఆచారాన్ని, సతీమాత పేరుతో పూజలు ఆరాధనలు జరపడం ప్రభుత్వం నిషేధించింది. నిజానికి సతీమాత ఆరాధన అనేది ఇటీవలి ఆచారం కానేకాదని సతీశ్ ఝంఝున్వాలా వాదిస్తున్నారు. రాజస్థాన్లో ఈ ఆరాధన ఉంది. కానీ ఇది శతాబ్దాలుగా ఉందని అన్నారు. అక్కడ ఉన్న ఒక సతీమాత ఆలయానికి ఆయన ధర్మకర్త కూడా. అంతిమంగా రచయితలు కోరినది ఒకటే. వలస పాలకులు రాసిన చరిత్రను పునః పరిశీలన చేసుకోమనే.