News

ప్రతిష్టాత్మకంగా దసరా ఉత్సవాలు

200views

విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2 వరకు జరిగే దసరా ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. వన్‌టౌన్‌ బ్రాహ్మణవీధిలోని జమ్మిదొడ్డిలో దసరా ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల నివేదికను మంత్రి పరిశీలించారు.

అనంతరం మాట్లాడుతూ గతం కంటే ఘనంగా దసరా ఉత్సవాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూలానక్షత్రం, విజయదశమి రోజు ప్రతి భక్తుడికీ లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందిస్తామన్నారు. ఉత్సవాలను జయప్రదం చేయటానికి అన్ని శాఖల్లోని సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. అన్నప్రసాదం, తాగునీరు అందుబాటులో ఉండాలని, సామాన్య భక్తుడికే అగ్ర ప్రాధాన్యమని తెలిపారు. ఇంద్రకీలాద్రితో పాటు ప్రకాశం బ్యారేజీ విద్యుత వెలుగులతో శోభాయమానంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

దూరాభారం కారణంగా ఇబ్రహీంపట్నం దగ్గర పవిత్ర సంగమం కంటే దుర్గాఘాట్‌లో నిర్వహించే పంచహారతులకే ప్రాధాన్యత ఇచ్చామని, భక్తుల నుంచి కూడా స్పందన వస్తోందని మంత్రి తెలిపారు. గత దసరాలో భక్తులు వేచి ఉండే ప్రాంతం, క్యూలైన్ల విషయంలో కొంత ఇబ్బంది కలిగిందని, ఈసారి వాటిని సరిదిద్ది మరిన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. విద్యాధరపురంలో టీటీడీ స్థలాన్ని దసరా ఉత్సవాలకు వినియోగించుకునేందుకు అనుమతి కోరతామన్నారు. దుర్గమ్మ ప్రధాన ఆలయానికి పూర్తి బంగారు తాపడం కోసం టీటీడీని సంప్రదించామని, వారికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారన్నారు.