News

శుభాంశు శుక్లా అనుభవం.. గగన్‌యాన్‌కు అవసరం: ప్రధాని మోదీ

136views

భవిష్యత్తులో భారత్‌ చేపట్టబోయే గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష అనుభవాలు చాలా అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2040లోపు మనం మరో 40 నుంచి 50 మంది వ్యోమగాములను తయారుచేసుకోవాల్సిన అవసరముందని తెలిపారు. భారత్‌ చేపట్టబోయే గగన్‌యాన్‌ ప్రాజెక్టుపై ప్రపంచం మొత్తం ఆసక్తి కనబరుస్తోందని.. ఇందులో భాగం కావడానికి అనేకమంది శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారని శుక్లా ప్రధానికి తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీతో జరిగిన భేటీకి సంబంధించి మంగళవారం శుక్లా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అందులో ప్రధాని మాట్లాడుతూ.. గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు శుంభాంశు అంతరిక్ష యాత్రతో తొలి అడుగు పడిందన్నారు.

భారత్‌ చేపడుతున్న అంతరిక్ష సంస్కరణలకు, ఆశయాలకు సహాయకారిగా ఉంటుందని మోదీ శుక్లాతో అన్నారు. 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు అంతరిక్ష కార్యక్రమంలో గగన్‌యాన్‌ యాత్ర కీలకపాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఇందులో భాగంగా అంతరిక్షం నుంచి తాను తీసిన కొన్ని చిత్రాలను భేటీ సమయంలో శుక్లా ప్రధానికి ట్యాబ్లెట్‌ కంప్యూటర్‌లో చూపిస్తూ వాటి గురించి వివరించారు. అంతరిక్ష అనుభవాలు, శాస్త్ర-సాంకేతిక రంగ పురోగతి, గగన్‌యాన్‌ మిషన్‌ వంటివాటిపై చర్చించారు.

కాగా 2040 నాటికి భారతీయ వ్యోమగామిని చందమామ పైకి పంపడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే ఏడాది అంతరిక్షంలోకి వ్యోమమిత్ర అనే రోబోను పంపించనున్నామని లోక్‌సభ సమావేశంలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ వివరించారు. 2027లో తొలిసారిగా మానవసహిత అంతరిక్ష యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. 2040లో చంద్రుడిపై భారత వ్యోమగామి పాదం మోపి.. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారని, 2035 కల్లా మనకూ సొంత అంతరిక్ష కేంద్రం ఉంటుందన్నారు.