News

అయోధ్యలో ఆకాశాన్నంటే రామ మందిరాన్ని నిర్మిస్తాం – అమిత్ షా

520views

యోధ్యలో రామ మందిరం నిర్మాణంపై భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆకాశాన్ని తాకేలా అతి పెద్ద రామ మందిరం నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మందిర నిర్మాణ పనులు నాలుగు నెలల్లో ప్రారంభిస్తామని స్పష్టంచేశారు. ఝార్ఖండ్‌లో ఐదో దశ ఎన్నికల సందర్భంగా పాకుర్‌లో నిర్వహించిన ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ”అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఇప్పుడు కేవలం నాలుగు నెలల్లో అయోధ్యలో ఆకాశాన్ని తాకేలా అతి పెద్ద రామమందిరం నిర్మిస్తాం” అని తెలిపారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ అయోధ్యలో రామ మందిరం నిర్మాణాన్ని అడ్డుకుందనీ.. కోర్టుల్లో ఈ కేసును నిలిపేసిందని ఆరోపించారు. దేశాన్ని సురక్షితంగా ఉంచకపోగా.. ప్రజల మనోభావాలను కూడా గౌరవించలేదని ఆక్షేపించారు. అయోధ్యలో పెద్ద రామమందిరం రాముడికి నిర్మించాలి కదా అని అమిత్‌ షా ర్యాలీలో పాల్గొన్న ప్రజలను అడగ్గా ‘అవును.. అవును” అంటూ పెద్ద ఎత్తున స్పందించారు.

గత కొన్ని దశాబ్దాలుగా నెలకొన్న అయోధ్య భూవివాదంపై నవంబర్‌ 9న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. వివాదాస్పదంగా ఉన్న 2.77 ఎకరాల భూమిలో రామమందిరం నిర్మించాలని స్పష్టంచేసింది. అలాగే, మసీదు నిర్మాణం కోసం ఐదెకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, మూడు నెలల్లోగా ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి రామమందిరం నిర్మాణం చేపట్టాలని ఆదేశించింది. తీర్పు వెలువడిన రెండు రోజుల్లోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రామమందిరం నిర్మాణం పనులు సమీక్షించేందుకు ఓ ట్రస్ట్‌ను కూడా ఏర్పాటు చేసింది.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.