
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న నిరశన ప్రదర్శనలలో తీవ్ర హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూ ఉండడం, జాతి వ్యతిరేక నినాదాలు చోటు చేసుకుంటూ ఉండడం, దేశంలోని మిగతా ప్రజలను ఆలోచింపజేస్తోంది. అలాగే ఈ నిరశన ప్రదర్శనలు దేశంలోని కేవలం కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలలోని కొన్ని వర్గాల విద్యార్థులకే పరిమితమవుతూ ఉండడం, అలా నిరశనలు వ్యక్తం చేస్తున్న వారి వాదనలో పస లేకపోవడం, పౌరసత్వ సవరణ చట్టంతో నిజమైన భారత పౌరులెవరికీ ఎటువంటి ఇబ్బందీ లేదని ప్రభుత్వ వర్గాలు, జాతీయ వాదులు పదే పదే చేస్తున్న విజ్ఞప్తులతో వీధుల్లోకి రాకపోయినా పౌరసత్వ సవరణ చట్టానికి మెజారిటీ ప్రజల మద్దతు లభిస్తోంది.
దీంతో ఎక్కడ ఉద్యమం నీరుగారి పోతుందోనన్న భయంతో తిరోగమన వాదులు కొత్త ఎత్తు వేసినట్టు కనపడుతోంది. నిన్న ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ), అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయాల (ఏఎంయూ) విద్యార్థుల నిరశన ప్రదర్శనలు హింసాత్మక రూపం దాల్చడం, పోలీసులు వారిపై భాష్పవాయు గోళాలను ప్రయోగించడం, లాఠీ చార్జి చెయ్యడం తెలిసిందే. ఇప్పుడు సరిగ్గా ఈ ఘటనే జాతి వ్యతిరేక శక్తులకు ఆయుధంగా మారింది. విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జిని సాకుగా చూపిస్తూ ఇప్పుడు మొత్తం విషయాన్ని దారి మళ్ళించి విద్యార్థులపై పోలీసుల దాడిగా చిత్రీకరించి, ఈ ఘటన ఆధారంగా తమ CAA వ్యతిరేక పోరాటానికి దేశంలోని వివిధ విద్యా సంస్థల, విద్యార్థుల మద్దత్తును కూడగట్టే యత్నం చేస్తున్నట్టు అనిపిస్తోంది.
ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ బొంబాయిలలో రాత్రికి రాత్రి కొన్ని పోష్టర్లు వెలిశాయి. వాటిలో ”జాదవ్‌పూర్ యూనివర్సిటీలో విద్యార్థులపై ప్రతీకార దాడి జరిగినప్పుడు స్పందించలేదు. ఎంటెక్ ఫీజులు పెంచినప్పుడు స్పందించలేదు. జేఎన్‌యూ విద్యార్థులపై దాడి జరిగినప్పుడూ నోరుమెదపలేదు. ఇప్పుడు కూడా స్పందించకపోతే విద్యార్థి లోకం పట్ల మనకున్న నిబద్ధత ప్రమాదంలో పడుతుంది. అందుకే విద్యార్థులంతా జేంఎఐ, ఏఎంయూ విద్యార్థులకు మద్దతుగా క్యాంపస్‌లో మార్చ్ నిర్వహించాలి” అని ఉంది. దాంతో ఇలాంటి నిరసన కార్యక్రమాలకు ఎప్పుడూ దూరంగా ఉండే ఈ మూడు విద్యాసంస్థలకు చెందిన కొందరు విద్యార్థులు తొలిసారి ఆందోళనలకు పిలుపునిచ్చారు.
ఇదంతా చూస్తుంటే దీని వెనుక పెద్ద కుట్రే దాగి ఉన్నట్లుగా తెలుస్తోంది. నిజానికి ఈ చట్టంతో భారతీయులెవరికీ ఏ ఇబ్బందీ లేకపోయినా కొందరు కావాలనే దీనిని పెద్దది చేస్తున్నారు. దేశాన్ని మతపరంగా మూడు ముక్కలు చేసిన కాంగ్రెస్ నేడు పౌరసత్వానికి, మతానికి లింకేమిటి? అంటూ నిస్సిగ్గుగా ప్రశ్నిస్తోంది. నిజానికి పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాలలో మైనారిటీ హిందువులు దశాబ్దాలుగా దారుణమైన అవమానానికి, పీడనకు గురౌతున్నా ఏనాడూ వారిపై కాంగ్రెస్ కానీ కమ్యూనిష్టులు కానీ జాలి చూపిన పాపాన పోలేదు. 80వ దశకం చివర, 90వ దశకం ఆరంభంలో కాశ్మీర్లోని పండిట్ కుటుంబాలను అక్కడి ముస్లిములు (80 శాతం మంది పాకిస్థాన్ నుంచి వచ్చిన వారే) వెంటాడి, వెంటాడి చంపినపుడు, వాళ్ళ ఆస్తులతోపాటు మహిళల మానాలను దోచుకున్నప్పుడు వీళ్లెవరికీ నోళ్ళు పెగల్లేదు. ఇప్పటికీ కేరళ బెంగాల్ లాంటి చోట్ల బహు తరచుగా హిందూ బాలికల అపహరణ, బలవంతపు వివాహాలు, హత్యలు, అత్యాచారాలు, లవ్ జీహాద్లు ఎన్ని జరుగుతున్నా వీళ్ళకు చీమకుట్టినట్టుగా కూడా ఉండదు.
ఈ విషయంలో మీడియానే అసలు దోషి. ఇలాంటి విషయాలలో నిజానిజాలను తెలిపే ప్రయత్నం దేశంలోని ప్రధాన మీడియా ఎన్నడూ చెయ్యలేదు. నిజానికి బ్రిటిష్ కాలం నుంచే దేశంలోని ప్రధాన మీడియా అమ్ముడుపోయింది. వామపక్ష, తిరోగమన వాదుల హస్తగతమయ్యింది. భారత దేశ చరిత్ర వక్రీకరించబడింది. చరిత్రలో ముస్లిం సమాజం నుంచి హిందూ సమాజం ఎదుర్కున్న సవాళ్ళను, అనుభవించిన కష్టాలను, పొందిన అవమానాలను చరిత్రీకరించడానికి స్వాతంత్ర్యానంతరం సైతం సరియైన దిశలో ప్రయత్నం జరుగకపోగా వారి సెక్యులర్ పుర్రెలకు తోచినట్లుగా చరిత్రను వక్రీకరించారు. అసత్యాలతో, అభూత కల్పనలతో నింపేశారు. మొత్తమ్మీద సెక్యులర్ పాలకులు, చరిత్రకారులు, పత్రికానిర్వాహకులు మూకుమ్మడిగా గూడుపుఠానీ చేసి హిందూ సమాజాన్ని సమర్ధవంతంగా తప్పుదోవ పట్టించారు. నిజ చరిత్రతోనూ, వర్తమానంతోనూ, భవిష్యత్తులో పొంచి ఉన్న ప్రమాదాలతోనూ సంబంధం లేకుండా, అసలా ఆలోచనే హిందువులకు రాకుండా హిందువుల హృదయాలలో సెక్యులరిజం అనే మత్తు మందును నూరి పోశారు. దాని ఫలితమే నేడు హిందువులలో నెలకొన్న నైరాశ్యం.
పౌరసత్వ సవరణ చట్టం వల్ల తమకేమీ నష్టం లేదని తెలిసినా ఈ దేశంలో అక్రమంగా చొరబడిన రోహింగ్యాలు, ఇతర ముస్లిములను రక్షించుకోవడానికి ఈ దేశంలోని సాధారణ ముస్లిములు కూడా వీధుల్లోకి వచ్చారు. నిజానికి భారతీయ ముస్లిములెవరికీ CAA వల్లగానీ NRC వల్లగానీ ఎలాంటి ఇబ్బందీ లేదు. మరి తమకు తమ భావి తరాలకు, దేశానికి రక్షణ కల్పించే CAA చట్టాన్ని రక్షించుకోవడానికి హిందువులెందుకు వీదుల్లోకి రారు? ఎందుకంటే ఈ దేశంలో ఒక సగటు హిందువుకి చరిత్రపై అవగాహన లేదు. వర్తమానంలో తన చుట్టూ జరుగుతున్న విషయాలపై అవగాహన లేదు. భవిష్యత్తుపై స్పష్టత లేదు. దేశ ప్రజలలో ఇవి కల్పించాల్సిన ప్రధాన మీడియా ఎప్పుడో అమ్ముడుపోయి వక్రమార్గం పట్టింది.
కావాలంటే చూడండి ముస్లిములు గానీ క్రైస్తవులు గానీ హిందువులపై దాడి చేసినా, హిందువుల ఊరేగింపులు అడ్డుకున్నా “ఒక వర్గానికి చెందిన గుర్తు తెలియని యువకులు కొందరు” అని వ్రాస్తారు. అదే హిందువులెవరైనా ఏ కారణం చేతైనా దాడి చేసినా, గొడవకు దిగినా దానికి మతం రంగు పులిమి వారి పుట్టు పూర్వోత్తరాలన్నీ బయట పెడతారు. సరిగ్గా CAA విషయంలో కూడా మీడియా ఇలాగే వ్యవహరిస్తోంది. దేశంలో ఏవో కొన్ని రాష్ట్రాలలో, అందునా కొన్ని జిల్లాలలో, అదీ ముస్లిములు, ముఖ్యంగా రోహింగ్యా ముస్లిములు అధికంగా ఉండే ప్రాంతాలలో, అలాగే ముస్లిం విశ్వవిద్యాలయాలు, కళాశాలలలో మాత్రమే జరుగుతున్న ఆందోళనలను బాధ్యతా రహితంగా, నిస్సిగ్గుగా దేశం మొత్తం జరుగుతున్నట్లుగా చూపుతూ దేశంలోని ప్రజలందరినీ మాయలో పడేసే ప్రయత్నం చేస్తోంది. అలాగే CAA దేశ ప్రజలందరికీ వ్యతిరేకమైనదిగా, దేశ ప్రజలందరికీ ఇబ్బందులు సృష్టించేదిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. CAAపై దేశమంతా ఆగ్రహం వ్యక్తమవుతున్నట్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నది.
దానికి ఉదాహరణే పైన తెలిపిన యూనివర్సిటీల విషయం. నిజానికి విద్యార్థుల ముసుగులో కొంత మంది అసాంఘిక శక్తులు జామియా యూనివర్సిటీలో ఆశ్రయం పొంది ఉన్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు యూనివర్సిటీ హాష్టల్లో తనిఖీలు నిర్వహించడానికి వెళ్ళారు. అక్కడున్న విద్యార్థులు పోలీసుల్ని తమ హాష్టల్ గదులలోకి అనుమతించకుండా తీవ్రంగా ప్రతిఘటించారు. ఆ సందర్భంగా పోలీసులు విద్యార్థులపై లాఠీ చార్జి చేశారు. యదావిధిగా మీడియాలో అత్యధిక ప్రాధాన్యం లభించింది. జరిగిన వాస్తవం ఎక్కడో ఏమూలో వ్రాసి, పోలీసుల లాఠీ చార్జిని ఖండిస్తూ కొందరు రాజకీయ నాయకులు, విద్యార్థి నాయకులు చేసిన ప్రకటనలను పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాసింది మీడియా. పోలీసులు లాఠీ చార్జి చేస్తున్న దృశ్యాలను పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టి ఫోటోలు వేశారు. ఉడుకునెత్తురున్న విద్యార్థులు మరి వెనకాముందూ చూడకుండా ఉద్రేకపడతారని వాళ్ళకీ తెలుసు. నిజానికి వాళ్ళకు కావలసింది కూడా అదే. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీలైనంత ఎక్కువమంది వీధుల్లోకి రావడం.
నిజానికి ఇక్కడ మనమందరం గమనించాల్సిన విషయం ఒకటుంది. పోలీసులు లాఠీఛార్జి చేసిన యూనివర్సిటీ విద్యార్థులు ఢిల్లీలో ఒక బస్సును తగలెట్టారు. అంతటితో ఊరుకున్నారా? ఆ మంటలను ఆర్పడానికి వచ్చిన ఫైరింజన్ ను ధ్వంసం చేశారు. వాళ్ళు విద్యార్థులా? అరాచకవాదులా? తమ వసతి గృహంలో అసాంఘిక శక్తులకు చోటు కల్పించిన వాళ్ళని పోనీలే విద్యార్తుల్లెమ్మని క్షమించెయ్యాలా? మీడియాకు ఏ మాత్రం బుద్ధున్నా వాళ్ళు చేసిన అరాచకాన్ని హైలైట్ చేసుండాలి. కానీ దురదృష్టం, కొన్ని దుష్ట శక్తులచే ప్రేరేపించబడిన విద్యార్థుల అరాచకాన్ని ప్రజాగ్రహంగా చూపించింది సిగ్గులేని మీడియా. పాక్, బంగ్లా, ఆఫ్ఘన్ల నుంచి ప్రాణాలరచేత పట్టుకుని భారత్ కు వచ్చి అనేక దశాబ్దాలుగా భారత్లో శరణార్ధులుగా జీవిస్తున్న అమాయక హిందువులకు CAA వల్ల న్యాయం జరుగుతుందన్న సత్యాన్ని చెప్పడం మాని, బారతీయ ముస్లిములకేదో అన్యాయం జరుగుతుందని జాతి వ్యతిరేక శక్తులు, స్వార్ధ రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలనే పదే పదే ప్రసారం, ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తోంది. అంతే కాదు విద్రోహ శక్తులు సృష్టిస్తున్న విధ్వంసాన్ని పదే పదే ప్రసారం చేస్తూ అమాయక ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది.
మీడియా ఇకనన్నా బుద్ధి తెచ్చుకుని బాధ్యతగా మెలగాలి. హిందూ సమాజామూ నిద్ర వీడి మేలుకోవాలి. కొన్ని రాజకీయ పక్షాలు హిందువులకు అనుకూలంగా ఉన్నట్టు నటిస్తూ హిందువుల ప్రయోజనాలకు భిన్నంగా ఏ విధంగా వ్యవహరిస్తున్నాయో అర్థం చేసుకోవాలి. ఇది ఒక సంధి కాలం. దశాబ్దాలుగా పాలకుల నయ వంచనలో నలిగినది చాలు. విజాతీయ, విధర్మీయ, విద్రోహ, స్వార్థ రాజకీయ శక్తుల, అమ్ముడుపోయిన మీడియా మాయలో పడకుండా హిందువులందరూ జాగరూకతతో వ్యవహరించాల్సిన తరుణమిది. తస్మాత్ జాగ్రత్త.
– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.
గమనిక : ఈ వ్యాసంలో వ్యక్తపరచిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





