ArticlesNews

హిందుత్వ విజయం

255views

పదిహేడేళ్లనాటి మాలేగావ్‌ పేలుళ్ల కేసుపై ముంబై ప్రత్యేక కోర్టు గురువారం తీర్పునిచ్చింది. సాధ్వీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌, లెఫ్టినెంట్‌ కర్నల్‌ ప్రసాద్‌ పురోహిత్‌ సహా ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురినీ నిర్దోషులుగా ప్రకటించింది. వారికి వ్యతిరేకంగా ఈ కేసులో ఎలాంటి బలమైన, నమ్మదగ్గ సాక్ష్యాలేవీ లేవని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.

అయితే… 17 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సాధ్వీప్రజ్ఞా నిర్దోషిగా బయటపడ్డారు. అయితే.. ఇది తన విజయం మాత్రమే కాదని, హిందుత్వ విజయమని ప్రకటించారు.

మరోవైపు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాషాయ ఉగ్రవాదం అనే కథనాన్ని సృష్టించిన కాంగ్రెస్, ఆయన జీవితంలో 17 సంవత్సరాలు వృధా చేసింది. అయితే తన జైలు జీవితంలో నిరంతరం తనను బెల్టులతో కొట్టారని, పోలీసు కస్టడీలో పగలు, రాత్రి తెగ హింసించారని సాధ్వీ ప్రజ్ఞా వెల్లడించారు. పోలీసులు కొట్టిన దెబ్బల కారణంగా సాధ్వీ ఊపిరితిత్తుల పొరలు పగిలిపోయాయి. ఒకానొక సమయంలో స్పృహ కూడా కోల్పోయారు. స్పృహ కోల్పోయినా… పోలీసులు మాత్రం హింసించడం మాత్రం ఆపలేదని పేర్కొన్నారు.ఇలా వణుకుపుట్టించే విషయాలను ఆమె వెల్లడించారు.

తన స్థానంలో ఎవరైనా వేరే వారు వుంటే.. చాలా ఇబ్బందులు పడేవారని, కానీ తనకు మాత్రం న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం వుంచుకున్నానని పేర్కొన్నారు.

‘‘వారు నన్ను ఎంతగా కొట్టారంటే.. ఊపిరితిత్తుల పొరలు పగిలిపోయాయి. స్పృహతప్పి పడిపోయాను. ఆ తర్వాత 5 రోజులు ఆస్పత్రిలో చేరాను. స్పృహ వచ్చే సరికి నా ఒంటిపై కాషాయబట్టలు లేవు. ఫ్రాక్ కనిపించింది.నన్ను వెంటిలేటర్ మరియు ఆక్సిజన్ మీద ఉంచారు. నేను కొద్దిగా కోలుకున్న వెంటనే, పోలీసులు నన్ను మళ్ళీ హింసించడం ప్రారంభించారు. బెల్టులతో కొట్టారు. నా తల మీద బలంగా తాకింది. ఈ సమయంలో వెన్నుపాము విరిగిపోయింది. నా శిష్యులలో ఒకర్ని కూడా అరెస్ట్ చేసి, నాతో పాటు తీసుకొచ్చారు. ఆమెను తీవ్రంగా కొట్టారు. తర్వాత నా ముందుకు తీసుకొచ్చి మరింత గట్టిగా కొట్టారు. దీని తర్వాత పోలీసులు ఆ బెల్టును నా శిష్యుడికి ఇచ్చి నన్ను తీవ్రంగా కొట్టమన్నారు. సంకోచిస్తున్న సమయంలో పోలీసులు ఒత్తిడి తెచ్చారు.అన్యమనస్కంగానే నా శిష్యుడు నన్ను బెల్టుతో కొట్టాడు. అతని చేతులు వణికిపోతున్నాయి. దీని తర్వాత పోలీసులు వలయంగా ఏర్పడి నన్ను బెల్టుతో కొట్టారు. ఆ సమయంలోనే థానే పోలీస్ కమిషనర్ అలసిపోయే వరకు నన్ను బెల్టుతో కొట్టారు. నేను పడిపోయాను. మహిళా పోలీసు అధికారి కూడా కర్రతో కొట్టారు.’’ అని సాధ్వీ వెల్లడించారు.

అశ్లీల వీడియోలూ చూపించారు…..
కాంగ్రెస్ హయాంలో ఖైదీల ప్రవర్తన కూడా విచిత్రంగా, అశ్లీలతో నిండి వుండేదని సాధ్వీ వెల్లడించారు. తనను కొంత మంది పురుష ఖైదీల ముందు నిల్చొబెట్టి, అశ్లీల, అసభ్య ఆడియోను ప్లే చేశారని వెల్లడించారు. ఆ సమయంలో పోలీసులు తనను తీవ్రంగా వేధించారని పేర్కొన్నారు. ‘‘ఆ రోజు నన్ను దారుణంగా కొట్టారు. నిలబడడమే కష్టంగా మారింది. నేను కూర్చోవచ్చా అని అడిగాను. అప్పుడు పోలీసులు నువ్వు ఏమైనా పెళ్లికి వచ్చావా? ’’ అంటూ అపహాస్యం చేశారన్నారు.

అలాగే తన రెండు చేతులూ ముందుకు చాచి, వాటిపై బెల్టులతో కొట్టారని, దీంతో తన చేతులు వాచాయన్నారు.దాని తర్వాత గోరువెచ్చని నీరు ఇచ్చారని, దీంతో కాస్త ఉపశమనం లభించిందన్నారు. ఇలా సాధ్వీప్రజ్ఞా సింగ్‌ ఎన్నో గగుర్పొడిచే విషయాలను ప్రకటించారు.

కేసు పూర్వాపరాలు….
మహారాష్ట్రలో 17 ఏళ్ళ కిందట, 2008లో తీవ్ర కలకలం రేపిన మాలేగావ్ పేలుళ్ళ కేసులో బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ సహా ఏడుగురు నిందితులను ముంబైలోని NIA ప్రత్యేక కోర్టు జులై 31, 2025న నిర్దోషులుగా విడుదల చేసింది. దీంతో… ఈ కేసును అడ్డుపెట్టుకుని కాషాయ ఉగ్రవాదం అంటూ.. అప్పటి UPA ప్రభుత్వం చేసిందంతా పూర్తిగా దుష్ప్రచారం, కుట్రపూరితం అని స్పష్టమైంది. నాటి పేలుడు ఘటనలో ఆరుగురు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు.

ఈ కేసులోని ఏడుగురు నిందితులైన సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ్, అజయ్ రహిర్కర్, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణిలను ప్రత్యేక న్యాయమూర్తి ఎ కె లహోటి నిర్దోషులుగా ప్రకటించారు. ఈ కేసులో నమ్మదగిన, బలమైన సాక్ష్యాలను అందించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని, నిందితులపై ఆరోపణలను పూర్తిగా నిరూపించలేకపోయారని అన్నారు. ముఖ్యంగా పేలుళ్ళలో ఉపయోగించిన బైక్ ప్రజ్ఞా ఠాకూర్‌దే అని గాని, అది ఆమె పేరిటే రిజిస్టర్ అయిందని గాని, ఆ బైక్ పైనే బాంబును అమర్చి పేల్చారని గాని రుజువు చెయ్యడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైందని తేల్చి చెప్పారు. ఈ దర్యాప్తులో ఎన్నో లోపాలున్నాయని, కేవలం అనుమానం కారణంగా దోషులుగా ప్రకటించి శిక్షించలేమని తీర్పులో స్పష్టం చేశారు. ఈ కేసులో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం – ఉపా వర్తించదని అన్నారు.

మాలేగావ్ బాంబు పేలుళ్ళ బాధితుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం, గాయపడిన బాధితులకు రూ. 50,000 ప్రభుత్వం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

ఈ కేసు దర్యాప్తు నిర్వహించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), నిందితులకు “తగిన శిక్ష” విధించాలని కోరింది. ప్రాసిక్యూషన్, డిఫెన్స్ ఇద్దరి నుండి విచారణలు, తుది వాదనలు పూర్తి చేసిన తర్వాత, ఏప్రిల్ 19న కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. పవిత్ర రంజాన్ మాసంలో, నవరాత్రి పండుగకు ముందు ఈ పేలుడు జరిగిందని, ముస్లిం సమాజంలోని ఒక వర్గంలో భయాందోళనలు సృష్టించడమే నిందితుడి ఉద్దేశమని NIA తెలిపింది.

ఈ కేసును మొదట మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్ దర్యాప్తు చేయగా, 2011లో ఎన్‌ఐఏకి బదిలీ చేశారు. ఏడుగురు నిందితులపై కోర్టు అభియోగాలు మోపిన తర్వాత 2018లో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. 2016లో, ఎన్‌ఐఏ ఒక ఛార్జ్ షీట్ సమర్పించింది. ఇందులో తగిన సాక్ష్యాలు లేకపోవడంతో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, ఇతర నిందితులను నిర్దోషిగా తేల్చింది.

ఈ అభియోగాలలో యుఎపిఎ సెక్షన్లు 16 (ఉగ్రవాద చర్యకు పాల్పడటం), 18 (ఉగ్రవాద చర్యకు కుట్ర పన్నడం), ఐపీసీ సెక్షన్లు 120 (b) (నేరపూరిత కుట్ర), 302 (హత్య), 307 (హత్య ప్రయత్నం), 324 (స్వచ్ఛందంగా గాయపరచడం), 153 (ఏ) (రెండు మత సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం) ఉన్నాయి. విచారణ సమయంలో, ప్రాసిక్యూషన్ 323 మంది సాక్షులను సమర్పించింది. వారిలో 37 మంది ప్రతికూలంగా మారారు.