News

నన్నయ, పోతన, శ్రీనాథుల చేతిరాతలు చదివేద్దామా

251views

మన చరిత్ర, సంస్కృతి, సాహిత్యాన్ని లిఖితం చేసిన తాళపత్రాలను, వాటిలోని విజ్ఞానాన్ని భావితరాలకు భద్రంగా అందజేయాలన్న లక్ష్యంతో వాటిని డిజిటల్‌ రూపంలోకి తెస్తున్నారు కాకినాడ పురావస్తుశాఖ అధికారులు.

ఆదికవి నన్నయ రాసిన మహాభారతం మొదలు శ్రీనాథుడి భీమఖండం, కాశీఖండం, పోతన భాగవతం, విష్ణుశర్మ పంచతంత్రకథలు, రామాయణం, పద్య, గద్య కావ్యాలు, ఆయుర్వేద, జాతక, సాహిత్య తదితర 5 వేలకు పైగా తాళపత్ర గ్రంథాలు ఇక్కడి కార్యాలయంలో ఉన్నాయి. తీరప్రాంతం కావడంతో తరచూ చెమ్మగిల్లడం, తాళపత్రాలు పిండిలా రాలిపోతుండడంతో ఎప్పటికప్పుడు శాస్త్రీయంగా శుభ్రం చేస్తున్నారు. ఇంకా ఎక్కువ కాలం ఉంటే పూర్తిగా పాడై విలువైన గ్రంథాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉండడంతో డిజిటలైజేషన్‌ చేయాలని నిర్ణయించారు. ఇందుకు తిరుమల తిరుపతి దేవస్థానం, చీరాలలోని సనాతన జీవన్‌ట్రస్ట్‌ సహకారం తీసుకున్నారు.

తాళపత్రాలను ముందుగా మెత్తని బ్రష్‌తో శుభ్రంగా తుడిచి వాటిపై సిట్రినెల్లా అనే రసాయనం, లెమన్‌ గ్రాస్‌ ఆయిల్‌తో లేపనం చేసి ఆరబెట్టారు. ఆ తర్వాత వాటిని తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయానికి పంపించి.. అత్యంత శక్తిమంతమైన స్కానర్లతో స్కాన్‌ చేశారు. ఆ తాళపత్రాలకు మళ్లీ చెదలు పట్టకుండా ఎర్రని గుడ్డతో చుట్టి కాకినాడకు తీసుకొచ్చారు. మూడున్నరేళ్ల క్రితం చేపట్టిన ఈ ప్రక్రియ ఇటీవల పూర్తయింది. త్వరలోనే వీటిని ప్రజలకు అందుబాటులో ఉంచుతామని.. ఈ మేరకు వెబ్‌సైట్‌ రూపొందిస్తున్నట్లు కాకినాడ పురావస్తుశాఖ ఏడీ తిమ్మరాజు తెలిపారు.