
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. దౌరాలా పోలీస్ స్టేషన్ పరిధిలోని దాద్రి గ్రామంలో ఉన్న ఒక పురాతన శివాలయంలో, తాను హిందువునని చెప్పుకునే ఒక యువకుడు దాదాపు ఒక సంవత్సరం పాటు పూజారిగా పూజలు నిర్వహించాడు. ఆ యువకుడు వాస్తవానికి బీహార్‌కు చెందిన మహ్మద్ ఖాసిం అని, అతని తండ్రి మౌల్వి అని తరువాత తెలిసింది. వివరాల్లోకి వెళితే దాదాపు ఒక సంవత్సరం క్రితం, ఈ యువకుడు గ్రామానికి వచ్చి తనను తాను “కృష్ణ, కుమారుడు సంతోష్, ఢిల్లీ నివాసి” అని పరిచయం చేసుకుని ఆలయంలో ఉండటానికి అనుమతి అడిగాడు. ఆలయంలో పూజలు నిర్వహించడానికి ఎవరూ లేకపోవడంతో గ్రామస్థులు అతన్ని అక్కడ పూజారిగా ఉండడానికి అనుమతిచ్చారు. అలా ఆలయంలోకి చేరిన సంతోష్ అలియాస్ మహ్మద్ ఖాసి పూజ, హవనము , ప్రసాద వితరణ వంటి మతపరమైన కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేయడం ప్రారంభించాడు. అతను జ్యోతిష్యం హస్తసాముద్రికం గురించి ప్రజలతో మాట్లాడటం ప్రారంభించాడు. దీంతో గ్రామస్థులు కూడా అతను జారి అనే అనుకున్నారు.
అయితే కొంతకాలం తర్వాత అతని మాట, ప్రవర్తనలో తేడా రావడం గమనించారు గ్రామస్థులు. అతని గుర్తింపు కార్డు చూపమని అడిగినప్పుడల్లా జాప్యం చేస్తూ, బుకాయిస్తూ వస్తుండడంతో వారి అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే అకస్మాత్తుగా ఎవరికీ చెప్పకుండా 15 రోజులు గ్రామం నుండి అదృశ్యమయ్యాడు. తరువాత అతను తిరిగి వచ్చి మళ్ళీ ఆలయంలో పూజలు చేయడం ప్రారంభించాడు. అది జరిగిన కొన్నిరోజులకు ఆలయంలో ఒక భండారా నిర్వహించబడింది, అందులో అతను మళ్ళీ వచ్చి ఆలయంలోని ఒక గదిలోని కొన్ని వస్తువులను తీయడం ప్రారంభించాడు. అక్కడ ఉన్న వ్యక్తులు అతన్ని ఆపి ప్రశ్నించగా కల్లబొల్లి మాటలు చెప్పే ప్రయత్నం చేశాడు. దాంతో గ్రామస్థుల అనుమానం తీవ్రమవడంతో, పోలీసులను పిలిచారు.
పోలీసుల విచారణలో, ఆ యువకుడు తనను తాను మొహమ్మద్ ఖాసిం అని, తాను బీహార్ కు చెందినవాడినని, తన తండ్రి మౌల్వి అని ఒప్పుకున్నాడు. విరాళంగా వచ్చిన డబ్బును తన వ్యక్తిగత అవసరాలకు ఉపయోగిస్తున్నానని కూడా ఒప్పుకున్నాడు. తప్పుడు గుర్తింపుతో ఆ యువకుడు ఆలయంలో ఉంటూ ప్రజల మతపరమైన భావాలతో ఆడుకున్నాడని ఎస్పీ సిటీ ఆయుష్ విక్రమ్ సింగ్ అన్నారు. అతనిపై మతపరమైన గుర్తింపును దాచడం, మోసం, ఆలయ నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. అంతేకాకుండా ఖాసిం నేపథ్యాన్ని దర్యాప్తు చేయడానికి పోలీసులు బీహార్ పోలీసులను సంప్రదించారు. ఇది పెద్ద కుట్రనా లేదా వ్యక్తిగత లాభం కోసం చేసిన మోసమా అనే దానిపై కూడా దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో మరింత మంది ప్రమేయం ఉన్నట్లు తేలితే, వారిపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెళ్లడించారు.





