News

కేరళ విద్యా మంత్రి కొత్త సిలబస్

177views

“ఇలా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్నో, లేకపోతే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాన్నో అడగగలరా?” అన్నారు ఆయన. ఎందుకన్నారు? ఆయన ఎవరు? ఆయన కేరళ విద్యాశాఖ మంత్రి వి.శివనుట్టి. ఇక పూర్వాపరాల లోకి వెళ్లక తప్పదు. పాఠశాల విద్యలో మేం ఏవో మార్పులు చేస్తే నిలదీస్తున్న ఈ ముస్లిం సంస్థలు ఆ రెండు బీజేపీ పాలిత రాష్ట్రాలను నిలదీయ గలవా? అంటున్నారాయన. కేరళలో ఉన్నది వామపక్ష కూటమి ప్రభుత్వం కాబట్టే అడుగుతున్నారు కదా! అని కూడా వాపోయారు. చివరికి ఆయన తేల్చినదేమిటీ అంటే, ఒక వర్గం కోసం బడి వేళలు మార్చడం అసాధ్యం అనే.

ప్రభుత్వం మిగిలిన వర్గాల నుంచి వచ్చిన లక్షలాది విద్యార్థులను కూడా దృష్టిలో ఉంచుకుంటుంది కాబట్టి వారి శ్రేయస్సును కూడా చూడాలి కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని వివరించారు. రాష్ట్రంలో బడి వేళల్లో మరొక 30 నిమిషాలు పెంచడం కేవలం హైకోర్టు నిర్ణయం మేరకే జరిగిందని చెప్పారు. కాబట్టి ఇందులో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే న్యాయపరంగానే తేల్చుకోవాలని చెప్పేశారు. 30 నిమిషాల సమయం పెంచిన నేపథ్యంలో బడి వేళలు మారాయి. దీనితో వెంటనే ముస్లిం వర్గాల నుంచి అభ్యంతరాలు వచ్చేశాయి.

కేరళలోనే బలమైన సంస్థా కేరళ జెమ్ ఇయాతుల్ ఉలేమా కూడా వ్యతిరేకించింది. కేరళలో అత్యధిక సున్నీ ముస్లింల మద్దతు ఉన్న పెద్ద సంస్థ ఇది. అయినా ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల మీదే కోర్టు ఆదేశాలు అమలు చేస్తున్నది కానీ, మదర్సాల జోలికి పోలేదు. అయినా వారికి అభ్యంతరాలు రావడం సరికాదని కూడా తేల్చారు. కాబట్టి వీరి కోసం (ముస్లింల కోసం) బడి వేళలు మార్చడం సాధ్యం కాదని కుండ బద్దలుకొట్టారు. అయినా ప్రభుత్వ నిర్ణయంలో మత సంస్థలు అనవసరంగా జోక్యం చేసుకుంటున్నాయని కూడా సన్నాయి నొక్కులు నొక్కారు. ఇయాతుల్ ఉలేమా ప్రభుత్వ నిర్ణయం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని ప్రయత్నిస్తున్న సందర్భంలో మంత్రి ఈ ప్రకటన చేశారు. పెంచిన 30 నిమిషాలలో 15 నిమిషాలు ఉదయం మిగిలిన 15 నిమిషాలు సాయంత్రం పెంచారు. అన్నట్టు శుక్రవారాన్ని మినహాయించారు కూడా. విద్యా సంవత్సరంలో 220 రోజులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏమైనా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింలు ప్రధాన స్రవంతిలో కలిశారని కమ్యూనిస్టు మంత్రి ఇలా పరోక్షంగా తెలియచేయడం శుభ పరిణామమే.