
తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో విజయవాడ పున్నమ్మతోటలో వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఈ నెల 26వ తేదీ నుంచి అష్టబంధన మహా సంప్రోక్షణ కుంభాభిషేక మహోత్సవాలను ఆగమ శాస్త్ర ప్రకారం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని, భక్తులు స్వామి వారి మహా క్రతువులో పాల్గొని తరించాలని ఆలయ పర్యవేక్షకులు ఎం.మల్లికార్జున కోరారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుంచి పున్నమ్మతోటలో గల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమాలను ఆలయ పర్యవేక్షణ అధికారి మల్లికార్జునరావు శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలోఆయన మాట్లాడుతూ వైఖానస ఆగమ శాస్తం ప్రకారం హిందూ దేవాలయాలను ప్రతి 12 ఏళ్లకోసారి మహా సంప్రోక్షణ చేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విజయవాడ పున్నమ్మతోటనందు టీటీడీ అధికారులు, స్థానిక భక్తులు, దాతల సహకారంతో 2010లో ఆలయ నిర్మాణాన్ని చేపట్టి 2012లో స్వామివారి విగ్రహ ప్రతిష్టగావించడం జరిగిందన్నారు. విగ్రహ ప్రతిష్ట జరిగి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్బాన్ని పురస్కరించుకొని అష్ట బంధన మహా సంప్రోక్షణ, కుంభాభిషేకాలను నిర్వహించాలని టీటీడీ ఆగమ సలహాదారు పరాశరం భావనారాయణాచార్యులు నిర్ణయించడం జరిగిందన్నారు.
ఈ నెల 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆరు రోజుల పాటు అత్యంత వైభవంగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఆరు రోజుల పాటు శోభాయమానంగా నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా నిత్య హోమం, యజ్ఞయాగాలు, అష్టబంధన ద్రవ్యారాధనం, తిరుమంజనం, కళావాహనం, ప్రథమ కాలార్చనం, అక్షతారోహణ, బ్రహ్మ ఘోష, ఆచార్య రుత్విక్ బహుమానం వంటివి నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాలకు భక్తులు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. అష్టబంధన మహా సంప్రోక్షణ కుంభాభిషేక మహోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఆగమ శాస్త్ర పండితులు, వేద పండితులు స్వయంగా నిర్వహించేందుకు ఇప్పటికే నగరానికి చేరుకోవడం జరిగిందన్నారు.
ఆలయ ప్రధాన అర్చకులు ఆర్.బాలమురళీకృష్ణ అయ్యంగార్ మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అష్టబంధన మహా సంప్రోక్షణ కుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 26న ఉదయం 8.30 గంటకు ఆచార్య వరణం, వాస్తుశాంతి, అకల్మష హోమంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురార్పణం జరుగుతుందన్నారు. 27వ తేదీన అగ్ని మథనం, పంచాగ్ని ప్రణయనం, అగ్ని ప్రతిష్ట, బింబాత్ కుంభే కళాపకర్షణ, ఉపచార సమర్పణం, ఉక్త హోమాలు జరుగునని పేర్కొన్నారు. ఈ నెల 29న సర్వ శాంతి, సహస్రాహుతి హోమాలు నిర్వహిస్తామని, 30వ తేదీన అష్టబంధన ద్రవ్యారాధనం, మహా శాంతి హోమాలు, ఉష్ణబంధనం, విశేష మహాశాంతి తిరుమంజనం, ధాన్యాధివాసం, సర్వదైవత్య హోమం, దోష ప్రాయశ్చిత్త హోమాలు నిర్వహిస్తారన్నారు. 31వ తేదీన ఉదయం మహా పూర్ణాహుతి అనంతరం చిత్త నక్షత్ర యుక్త తులాలగ్న శుభ ముహూర్తాన స్వామివారి ఆలయ ప్రవేశం చేస్తారని వివరించారు. 12ఏళ్లకోసారి జరిగే ఈ మహా క్రతువులో భక్తులందరూ వేలాదిగా పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయడం ద్వారా స్వామివారి కృపకు పాత్రులుకావాలని ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.





